ఇథనాల్‌పై రగడ!
దేశ ప్రయోజనాలు, రైతులకు లబ్ధి, పర్యావరణహితం పేరిట కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇథనాల్ బ్లెండింగ్ విధానంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతున్నది. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడం వల్ల వాహనాల మైలేజీ తగ్గుతున్నదని, ఇంజిన్లు దెబ్బతింటున్నాయని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. ఈ విధానంపై జంతర్‌మంతర్ వేదికగా నిరసనలు జరగడం, ఈ20 ఇంధనాన్ని భూటాన్ నిరాకరించిదనే వార్త కార్చిచ్చులా వ్యాపించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇది మరోసారి చర్చనీయాంశమైంది.
ప్రజాగ్రహం పెరుగుతున్న నేపథ్యంలో కొంతమేరకు మైలేజీ తగ్గుతుందన్న మాట వాస్తమేనని అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం.. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ విధానంపై వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేయడం గమనార్హం. సుప్రీంకోర్టు వేదికగా ఈ20 విధానం ఒక ప్రయోగమని చెబుతూనే, భవిష్యత్తులో ఈ100 లక్ష్యాన్ని సాధిస్తామని పాలకులు ఏకపక్ష ప్రకటనలు గుప్పించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో పాలకుల ప్రయోగానికి వినియోగదారులు ఎందుకు మూల్యం చెల్లించాలనే కీలక ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. వాస్తవానికి ఈ20 ఇంధనం వల్ల జరుగుతున్న నష్టాలకు బాధ్యత వహించేందుకు ఎవరూ ముందుకురాకపోవడం సమస్యగా మారింది. ఈ ఇంధనం వల్ల జరిగే డ్యామేజీకి బీమా వర్తించదని ఇన్సురెన్స్ కంపెనీలు చెబుతున్నాయి. మరోవైపు వాహనతయారీ సంస్థల వ్యవహారం విచిత్రంగా ఉంది.
మీడియా ముందుకువచ్చి ఈ20 ఇంధనం సురక్షితమేనని ఒకవైపు చెబుతూ, ఇంజిన్‌కు నష్టం వాటిల్లితే అధిక శాతం దీన్ని వాడొద్దని మాన్యువల్‌లో పొందుపరచడం శోచనీయం. మరోవైపు పర్యావరణ పరిరక్షణ అనే నినాదమూ ప్రశ్నార్థకంగా మారింది. ఇథనాల్ పరిశ్రమలు ఉన్న ఈశాన్య రాష్ట్రంలోని బైర్నిహట్ అత్యంత కాలుష్యపూరిత ప్రాంతంగా మారిందనే ఆరోపణలు రావడం ఆందోళనకరం.
కాగా, మన ఈ20 ఇంధనాన్ని భూటాన్ నిరాకరించినట్టు వార్తలు రావడం వాహనదారుల అనుమానాలకు బలాన్ని చేకూర్చింది. తమ దేశంలో ఇథనాల్ ఇంధనాన్ని నిల్వ చేసే మౌలిక సదుపాయాలు లేవని భూటాన్ చెప్పినట్టు తెలుస్తున్నది. అయితే, ఈ వార్తలను కేంద్రం కొట్టిపారేసినప్పటికీ, దేశంలోని వాహనదారుల అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉన్నది. ఈ నేపథ్యంలో పారదర్శకత పాటిస్తూనే, వినియోగదారులకు ప్రత్యామ్నాయ ఇంధనాన్ని కూడా అందుబాటులో ఉంచాలని చెప్పక తప్పదు.






