రోడ్ల నాణ్యతపై రాజీ తగదు!
ఒక దేశ నాగరికతను ఆ దేశం వద్ద ఉన్న ఆయుధ సంపత్తిని, రాజధానిలోని ఆకాశహర్మ్యాలను, విదేశీ పెట్టుబడుల గణాంకాలను చూసి కాదు.. సామాన్య పౌరుడు ప్రతిరోజూ ప్రయాణిం చే రహదారులను చూసి అంచనా వేయాలి. రహదారులు ఎంత నాణ్యంగా ఉంటే, ఆ దేశ పరిపాలన అంత బాధ్యతాయుతంగా ఉందని ప్రపంచం నమ్ముతుంది. రహదారి అనేది ప్రభుత్వ నిజాయితీకి, ఇంజినీరింగ్ సామర్థ్యానికి, ప్రజాధనంపై ఉన్న గౌరవానికి ప్రతీక.
మన దేశంలో రోడ్లు సుమారు 63 లక్ష ల కిలోమీటర్లకు పైగా విస్తరించి, ప్రపంచంలో రెండో అతిపెద్ద రహదారి వ్యవస్థ ను కలిగి దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక గా నిలుస్తున్నాయి. జాతీయ రహదారులు మొత్తం రహదారుల్లో రెండు శాతం మా త్రమే ఉన్నప్పటికీ, దేశ రవాణాలో దాదాపు నలభై శాతం భారాన్ని మోస్తున్నాయి.
గత దశాబ్దంలో ఎక్స్‌ప్రెస్‌వేలు, ఆర్థిక కారిడార్‌లు, గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టులు, సరిహద్దు రహదారుల నిర్మాణంపై ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెట్టింది. ప్రతి రోజు వందల కిలోమీటర్ల రహదారులు నిర్మిస్తున్నామని గణాంకాలు చెబుతున్నాయి. కానీ, ఎన్ని కిలోమీటర్లు నిర్మించామన్నది కాదు, ఎంతకాలం మన్నికగా నిలబెట్టామన్నదే ముఖ్యం.
ప్రపంచ బ్యాంక్, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ వంటి సంస్థలు మౌలిక వసతుల్లో రహదారి వ్యవస్థ ముఖ్యమని ఎన్నోసార్లు స్పష్టంగా చెప్పాయి. ‘అమెరికా సంపన్న దేశం కాబట్టి, ఇక్కడ రహదారులు బాగున్నాయని అనుకోవద్దు. ఇక్క డ రహదారులు బాగున్నాయి కాబట్టే అమెరికా సంపన్న దేశంగా ఎదిగింది’ అన్న అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నె డీ మాటలు అక్షర సత్యం. అందుకే అభివృద్ధి చెందిన దేశాలు ముందుగా రహదారులను నిర్మించాయి.
తరువాత ఆర్థిక శక్తులుగా ఎదిగాయి. మనం పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లించే లక్షల కోట్ల రూపాయలతో ఆసుపత్రులు, పాఠశాలలు, నీటి పారుదల వ్యవస్థలు, రహదారులు నిర్మిస్తారు. కానీ, ప్రతి వర్షాకాలం వచ్చినప్పుడు కోట్ల రూపాయలతో నిర్మించిన రహదారులు గుంతలుగా మారిపోతున్నాయి. కొన్ని చోట్ల మొదటి వర్షానికే కొట్టుకుపోతే, మరికొన్ని చోట్ల రహదారి కుంగిపోయి, ఇంకొన్ని చోట్ల పూర్తిగా తెగిపోతుంది.
రోడ్డు నిర్మాణంలో నాణ్యత లోపించడానికి, అవి త్వరగా పాడైపోవడానికి ప్రకృతి వైపరీత్యాలే కాదు, వ్యవస్థాగత సాంకేతిక లోపంతో పాటు నిర్లక్ష్యం, అవినీతి, నాణ్యతపై రాజీ, బాధ్యతలేని పరిపాలన కూడా కారణాలే. నాసిరకం బిటుమెన్, ప్రమాణాలకు సరిపోని కంకర, మట్టి కలిసిన అగ్రిగేట్లు వాడటం వల్ల రహదారి ప్రాథమిక బలం పూర్తిగా క్షీణిస్తుంది.
నిర్మాణ సమయంలో చేసే ఇటువంటి స్వల్ప లాభా ల ఆశ, భవిష్యత్తులో ప్రజలపై వందల రెట్ల ఆర్థిక భారంగా మారుతుంది. దీనికి తోడు రహదారి పొరల మందాన్ని తగ్గించి అక్రమాలకు పాల్పడటం వల్ల కాగితాలపై రోడ్డు పూర్తయినట్లు కనిపిస్తున్నా, వాస్తవానికి అది కొన్ని నెలల్లోనే గుంతలమయమవుతుంది. రోడ్డుకు అతిపెద్ద శత్రువైన వర్షపు నీరు నిలవకుండా వెంటనే వెళ్లిపోయేలా సరైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడం మరో పెద్ద లోపం.
రహదారి నిర్మాణ శాఖ, డ్రైనేజీ నిర్వహణను చూసే శాఖల మధ్య సమన్వయం లోపం వల్ల నీరు పొరల్లోకి చేరి రోడ్డంతా కుంగిపోయేలా చేస్తుంది. అలాగే, ప్రతి రహదారిని ఒక నిర్దిష్ట బరువు సామర్థ్యంతోనే రూపకల్పన చేసినప్పటికీ, నిబంధనల అమలులో ఉన్న బలహీనతల వల్ల పరిమితికి మించి ఇసుక, గ్రానైట్, సిమెంట్ లోడ్లతో వెళ్లే భారీ వాహనాల నిరంతర ప్రయాణంతో రోడ్లు త్వరగా దెబ్బతింటున్నాయి. భారతదేశంలో అత్యంత విచిత్రమైన సమస్య ఏమిటంటే ఒకరోజు కొత్త రోడ్డు వేస్తే, మరుసటి రోజు తాగునీటి పైపులు, విద్యుత్ కేబుళ్లు, ఫైబర్ ఆప్టిక్ లైన్ల కోసం దానిని పదే పదే తవ్వడం.
ప్రభుత్వ టెండర్ల విధానంలో అత్యల్ప ధర పలికిన సంస్థలకే పనులు అప్పగించ డం వల్ల, కాంట్రాక్టర్లు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి నాణ్యత విషయంలో రాజీ పడుతున్నారు. దీనివల్ల తాత్కాలికం గా ప్రభుత్వం నిధులు ఆదా చేసినట్లు అనిపించినా రెండేళ్లలోనే మళ్లీ మరమ్మతులు చేయాల్సి రావడం వల్ల రెట్టింపు ఖర్చు అవుతోంది. ఈ పరిస్థితిలో కాంట్రాక్టర్ ముందుగా నాణ్యతను కాదు, నష్టాన్ని పూడ్చుకోవడానికే ప్రయత్నిస్తాడు.
జపాన్, జర్మనీ, నార్వే, అమెరికా వంటి దేశాలు మన కంటే ఎక్కువగా ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటాయి. అయినప్పటికీ వారి రహదారులు నిలబడటానికి కారణం కఠినమైన ప్రమాణాలు, స్వతంత్ర థర్డ్ పార్టీ నాణ్యత తనిఖీలు, లోపాలపై కఠిన చట్టపరమైన చర్యలు, సమయానికి నిర్వహణ. వారు చిన్న పగులు కనిపించిన వెంటనే మరమ్మతు చేస్తారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం, నిరంతర నిర్వహణ కరువవడం వల్ల ప్రజాధనం వృథా కావడంతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తెలంగాణలో ఫ్లైఓవర్లు, ఎస్‌ఆర్డీపీ ప్రాజెక్టులతో హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి ఐటీ నగరంగా తీర్చిదిద్దుతున్నప్పటికీ, చిన్నపాటి వర్షానికే మాదాపూర్, గచ్చిబౌలి వంటి కీలక ప్రాంతాల రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ వంటి జిల్లాలు, గ్రామీణ రహదారులు కూడా ప్రణాళికాలోపం వల్ల దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో రహదారుల నిర్మాణమే కాకుండా, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని పెం చుతూ, గ్రామీణ రోడ్ల నాణ్యత, వాటి నిరంతర సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అత్యంత అవసరం.
రహదారులు ఇంజినీరింగ్ నిర్మాణాలే కావు, దేశ భవిష్యత్తును మోసే భుజాలు. మొదటి వర్షానికే రోడ్లు కొట్టుకుపోవడం సాంకేతిక వైఫల్యం కాదు, వ్యవస్థ నైతిక పతనానికి ప్రతీక. రహదారి నిర్మాణంలో పర్యవేక్షణ వ్యవస్థ బలహీనత, ప్రతి పొరను తనిఖీ చేయాల్సిన ఇంజినీర్ దస్త్రాలకే పరిమితం కావడం ప్రమాదకరం. రోడ్డు నిర్మాణం అంటే నేలను చదును చేసి డాం బరు పోయడం కాదు. భూగర్భ శాస్త్రం, మట్టి విజ్ఞానం, సివిల్ ఇంజినీరింగ్, జల ప్రవాహ శాస్త్రం, నాణ్యత నియంత్రణ వంటి అనేక శాస్త్ర విభాగాల సమన్వయం.
సబ్‌గ్రేడ్, సబ్‌బేస్, వెట్ మిక్స్ మకాడ మ్, బిటుమినస్ బేస్, వేరింగ్ కోర్స్ వంటి ప్రతి పొరకు నిర్దిష్ట ప్రమాణాలు ఉన్నాయి. కంకర పరిమాణం, బిటుమెన్ నాణ్యత, తేమ శాతం, ఉష్ణోగ్రత ప్రయోగశాల పరీక్షల ద్వారా నిర్ధారించాలి. ఈ ప్రమాణాల్లో ఏ చిన్న లోపం జరిగినా రహదారి భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. రోడ్లు బాగుంటే ప్రయాణ సమయం, ఇంధన వినియోగం తగ్గుతుంది. సరుకుల రవాణా వేగవంతమై పరిశ్రమలు వృద్ధి చెందుతాయి. పెట్టుబడులు పెడతాయి. గ్రామీణ ప్రాంతాలు వృద్ధిలోకి వస్తాయి. పర్యాటకం విస్తరించి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.
ఎన్ని కిలోమీటర్లు నిర్మించామనే గణాంకాల కంటే వర్షం పడ్డాక కూడా ఎన్ని కిలోమీటర్లు సురక్షితంగా నిలిచాయనే ప్రశ్నకు సమాధానం చెప్పగలిగిన రోజే భారత రహదారి వ్యవస్థ నిజమైన అభివృద్ధిని సాధించినట్లవుతుంది. కనుక మన దేశంలో విప్లవాత్మక సంస్కరణలు అవసరం. ప్రతి రహదారి నిర్మాణ వివరాలు, ఖర్చు, వాడిన పదార్థాలు, వారంటీ గడువు ప్రజలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండాలి.
రహదారి ప్రారంభంలో కాంట్రాక్టర్, పర్యవేక్షక ఇంజినీర్ పేర్లు, ఫిర్యాదు నంబర్, నిర్వహణ గడువు స్పష్టంగా ప్రదర్శించాలి. మొత్తం బిల్లును ఒకేసారి చెల్లించకుండా, ఐదేళ్ల పాటు నాణ్యత ఆధారంగా విడతలవారీగా విడుదల చేయాలి. నాసిరకం పనులు చేసే సంస్థలను శాశ్వతంగా నిషేధించాలి. ప్రజలు కూడా గుంతల ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టడమే కాదు, స్థానిక సంస్థలకు ఫిర్యాదు చేయాలి. ఓవర్‌లోడ్ వాహనాలను సహించకూడదు. ప్రజల మౌనమే అవినీతికి అతిపెద్ద రక్షణ కవచం. ప్రశ్నించని సమాజంలో గుంతలు రహదారుల మీద మాత్రమే కాదు, ప్రజాస్వామ్యంపైనా కూడా పడతాయి.
వ్యాసకర్త: 8466827118
దుప్పటి మొగిలి






