శ్రీకాంత్ అయ్యంగార్ వ్యాఖ్యలపై దుమారం
శ్రీకాంత్ అయ్యంగార్ ఉరఫ్ శ్రీకాంత్ భరత్ తీరు మరోమారు వివాదాస్పదమైంది. గాంధీ జయంతి సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో యునైటెడ్ ఎన్జీఓ’స్ అసోసియేషన్, సేవాలాల్ బంజారా సంఘం సభ్యులు శ్రీకాంత్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు, మహాత్మా గాంధీని ఉద్దేశిస్తూ శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు శ్రీకాంత్‌పై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
‘అరి’ సినిమా ఫ్లెక్సీల కాల్చివేత
ఇదిలా ఉండగా శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ‘అరి’ సినిమాకు నిరసన సెగ తగిలింది. దర్శకుడు జయశంకర్ తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలై, పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో సందడి చేస్తోం ది. ఇదిలా ఉండగా, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు హైదరాబాద్‌లోని క్రాస్‌రోడ్స్‌లో సప్తగిరి థియేటర్‌లో ‘అరి’ సినిమా ఫెక్సీలను చించివేశారు. శ్రీకాంత్ అయ్యంగార్ ఫొటోలతో ఉన్న పోస్టర్లు, ఫెక్సీలను తగలబెట్టారు. ఆయన దిష్టిబొమ్మతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
గతంలోనూ ఇదే తీరు..
శ్రీకాంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే కొత్త కాదు. గతంలోనూ పలుమారు వివిధ రంగాల వ్యక్తులపై ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. సినీ క్రిటిక్స్‌ను దుర్భాషలాడుతూ వీడియో పెట్టడం.. క్షమాపణలు చెప్పడం జరిగిపోయాయి. ఇంకోసారి మూవీ రివ్యూవర్లపై బూతుల దండకం చదివాడు.
శ్రీకాంత్ అయ్యంగార్ చేసిన వ్యాఖ్యలివీ..
శ్రీకాంత్ అయ్యంగార్ అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా ఓ వీడియోను సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు. తానే స్వయంగా ఎక్స్‌లో పోస్ట్ చేసిన శ్రీకాంత్.. ఆ వీడియోలో రాయలేని భాషలో దుర్భాషలాడాడు. గాంధీజీ స్త్రీలోలుడని, ఎంతో మంది అమ్మాయిలను లైంగికంగా వేధించాడని ఆరోపించాడు. ఆ వీడియోపై కొందరు కామెంట్ చేసి ట్రోల్ చేయడంతో మరో వీడియో షేర్ చేస్తూ ఇంకాస్త రెచ్చిపోయాడు. “నమస్కారం.
నేను శ్రీకాంత్ భరత్. నేను ఏ పోస్టు పెట్టినా కామెంట్స్ బాగా వస్తున్నాయి. అయినా పెద్దగా పట్టించుకోను. కానీ అక్టోబర్ 2న ఓ పోస్టు పెడితే చాలా బూతులు తిట్టారు. నేను కామెంట్ చేసిన వ్యక్తి గురించి మీకు ఏం తెలుసురా? తన నిగ్రహాన్ని పరీక్షించుకునేందుకు 16 ఏళ్ల అమ్మాయిని నగ్నంగా పడుకోబెట్టాడు.
వాడు మహాత్ముడా.. ఆయన జాతిపిత ఏంటి? గాంధీ స్వాతంత్యం తెచ్చాడన్నది అబద్ధం. సుభాష్ చంద్రబోస్, భగత్‌సింగ్ లాంటి వాళ్లు లక్షల మంది ప్రాణాలు అర్పిస్తే స్వాతంత్య్రం వచ్చింది. మేం భరతమాత బిడ్డలం. ఆయన జాతిపిత అయితే నేను బాస్టర్డ్ సిటిజెన్” అంటూ రెచ్చిపోయాడు శ్రీకాంత్.






