6 July, 2026 | 2:17 AM

పంట విస్తీర్ణానికి అనుగుణంగా యూరియా బుకింగ్ చేసుకోవాలి

06-07-2026 01:15 AM

కలెక్టర్ అంకిత్

భద్రాద్రి కొత్తగూడెం జూలై 5, (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యూరియా ఎరువుల సరఫరాను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు యూరియా బుకింగ్ యాప్లో పలు మార్పులు చేసినట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ ఒక ప్రకటనలో తెలిపారు. సవరించిన ఈ మార్గదర్శకాలు నేటి నుంచి జరిగే అన్ని యూరియా బుకింగ్లకు అమల్లోకి వస్తాయని చెప్పారు. యూరియా బుకింగ్ను పంట విస్తీర్ణానికి అనుగుణంగా దశలవారీ  విధానంలో నిర్వహించేలా ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ తెలిపారు. రెండు ఎకరాల వరకు సాగు చేసే రైతులు తమ పంటకు అవసరమైన మొత్తం యూరియాను ఒకేసారి  బుక్ చేసుకుని పొందవచ్చని అన్నారు .

రెండు ఎకరాలకు పైగా ఐదు ఎకరాల వరకు సాగు చేసే రైతులు పంట అవసరానికి అనుగుణంగా యూరియాను రెండు విడతలుగా  బుక్ చేసుకోవాలని సూచించారు. ఐదు ఎకరాలకు పైగా సాగు చేసే రైతులకు యూరియా మూడు విడతలుగా 40 శాతం, 30 శాతం, 30 శాతం నిష్పత్తిలో బుకింగ్ అయ్యే విధంగా యాప్లో మార్పులు చేసినట్లు తెలిపారు. రెండు యూరియా  బుకింగ్ల మధ్య కనీసం 20 రోజుల వ్యవధి తప్పనిసరిగా ఉండేలా నిబంధన అమలు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.