13-09-2025 10:16:45 AM
నకిరేకల్, (విజయక్రాంతి): నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో ఫెర్టిలైజర్ షాప్ ల వద్ద యూరియా కోసం తెల్లవారుజాము నుండే రైతులు క్యూ లైన్ లో నిలబడి యూరియా దొరుకుతుందో లేదోనన్న ఆందోళనలో సహనం కోల్పోతున్నారు. పాస్ బుక్కులు, చెప్పులు లైన్లో వందలాదిమంది రైతులు సీరియల్ కోసం ఉంచి వేచి చూస్తున్నారు. ఒకరికి ఒకరు తోసు వేసుకుంటున్నారు.
వరి నాట్లు వేసుకుని రెండు నెలలు గడుస్తున్న ఇప్పటివరకు యూరియా కావలసినంత వేయకపోవడంతో పంట ఎదుగుదల లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటి రెండు బస్తాలు ఇస్తే పొలాలకు సరిపోదని రైతులు ప్రశ్నిస్తున్నారు .ఉదయం నుంచి కుటుంబం మొత్తం వచ్చి లైన్లో నిలబడిన యూరియా మాత్రం దొరకటం లేదని వాపుతున్నారు... యూరియా అందకపోతే రైతులుగా తీవ్రంగా ఆర్థికంగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించి రైతులకు కావలసిన యూరియాను సకాలంలో అందించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
పోలీసుల సమక్షంలో యూరియా పంపిణీ
నకిరేకల్ పట్టణంలోని మన గ్రోమోర్ వద్ద రైతులు ఏరియా కోసం రైతులు బారులు తీరడంతో ఒకరికొకరు తోసుకోవడంతో స్థానిక ఎస్సై లచ్చిరెడ్డి , సిబ్బంది ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రైతులను సీరియల్ లో ఉంచి ఒకరి ఒకరిని పిలుస్తూ యూరియా పంపిణీ చేయించారు.