యూరియాను పాత పద్ధతిలోనే అందించాలి
మొబైల్ యాప్ విధానాన్ని రద్దు చేయాలి
సిద్దిపేట, జూన్ 17 (విజయక్రాంతి): ప్రభుత్వం అమలు చేస్తున్న యూరియా కొనుగోలు పంపిణీ మొబైల్ యాప్ విధానం చిన్న, సన్నకారు రైతులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. రైతుల అవసరాలు, గ్రామీణ ప్రాంతాల వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా అమలు చేస్తున్న విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత విధానంలోనే యూరియాను అందించాలని రైతు రక్షణ వేదిక అధ్యక్షులు అందె ప్రవీణ్ డిమాండ్ చేశారు.
రైతులందరికీ స్మార్ట్ఫోన్లు లేవనీ, స్మార్ట్ఫోన్లు ఉన్న రైతులకు కూడా యాప్ వినియోగంపై పూర్తి స్థాయి అవగాహన లేకపోవడంతో నమోదు ప్రక్రియలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయనీ, యాప్లో బుకింగ్ చేసిన రైతులు ఫర్టిలైజర్ దుకాణాలకు చేరుకునేలోపే యూరియా నిల్వలు పూర్తవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంటల ఎదుగుదలకు అత్యంత అవసరమైన యూరియా సకాలంలో అందకపోతే దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. రైతులకు సాంకేతిక అవరోధాలు లేకుండా, సులభతరంగా యూరియా అందే విధంగా పంపిణీ వ్యవస్థను ప్రభుత్వం పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జక్కుల రాజయ్య, నిమ్మ నితిన్, దారా స్వామి, శంకర్, రాజు తదితరులు పాల్గొన్నారు.






