టెహ్రాన్ గజగజ
- ఇరాన్‌పై విరుచుకుపడిన అమెరికా, ఇజ్రాయెల్
- కొన్ని గంటల పాటు వైమానిక దాడులు
- 34 మంది మృతి.. వందలాది మంది క్షతగాత్రులు
టెహ్రాన్, ఏప్రిల్ 6: ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా పలు నగరాలను టార్గెట్ చేస్తూ సోమవారం అమెరికా, ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. ఏకధాటిగా వైమానిక దాడులకు పాల్పడ్డాయి. బాంబుల మోతతో ఆయా నగరాలు దద్దరిల్లాయి. వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. టెహ్రాన్ సమీపంలోని ఇస్లాంషహర్, నగరం కోమ్ ప్రాంతాల్లో ౩౪ మంది ఇరానీయన్లు మృతిచెందారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉండటం అంతర్జాతీయ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దాడిలో వందలాది మంది క్షతగాత్రులయ్యారు. టెహ్రాన్‌లోని ప్రఖ్యాత షరీఫ్ యూనివర్సిటీపైనా బంకర్ బస్టర్ బాంబులతో దాడులు జరిగాయి.
దాడుల్లో మూడు విమానాశ్రయాలు దెబ్బతిన్నాయి. డజన్ల కొద్దీ విమానాలు, హెలికాప్టర్లు సహా సైనిక మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. అస్లూయె ప్రాంతంలోని ఇరాన్ అతిపెద్ద పెట్రోకెమికల్ ప్లాంట్ ‘అసలుయె’ను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ పెట్రోకెమికల్ ఉత్పత్తిలో 50 శాతం వాటా ఉన్న ఈ ప్లాంట్ దెబ్బతినడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బతగిలింది. ఈ దాడులను ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ధ్రువీకరించారు.తమ దాడి కారణంగా ఇరాన్‌లోని ఎన్నో పెట్రోకెమికల్ యూనిట్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని వెల్లడించారు.
ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ మృతి
అమెరికా -ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన క్షిపణి దాడుల్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ క్రాప్స్ (ఐఆర్జీసీ) ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ ఖదేమీ మృతిచెందారు. ఖదేమీ మరణాన్ని ఐఆర్జీసీ సైతం ధ్రువీకరించింది. అక్కడి అధికారిక ప్రభుత్వ మీడియా సంస్థ సైతం ఖదేమీ మృతిపై అనేక కథనాలు ప్రసారం చేసింది. ఖదేమీ గడిచిన ఐదేళ్ల నుంచి ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ విభాగానికి చీఫ్‌గా సేవలందిస్తున్నారు. ఇరాన్‌లోకి విదేశీ శక్తుల చొరబాట్లను అరికట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.




