21 July, 2026 | 9:30 AM

అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలి

20-07-2026 08:48 PM

యాదగిరిగుట్టలో ముగిసిన మూడు రోజుల రాష్ట్ర శిక్షణ తరగతులు

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దానిని తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది. ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) ఇచ్చిన పిలుపులో భాగంగా, ఈ నెల 22న రాష్ట్రవ్యాప్తంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీల దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాగం హెమంతరావు,ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ పిలుపునిచ్చారు.

యాదగిరిగుట్ట పట్టణంలోని మున్నూరు కాపు కల్యాణ మండపంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు సోమవారం ఉత్సాహపూరిత వాతావరణంలో ముగిశాయి. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించి తీర్మానాలు ఆమోదించారు. ముగింపు సమావేశంలో పశ్య పద్మ మాట్లాడుతూ అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను పూర్తిగా ఎత్తివేస్తే దేశీయ రైతాంగం కోలుకోలేని దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఈ ఒప్పందాన్ని వెనక్కి తీసుకునే వరకు ఢిల్లీ నుంచి గల్లీ దాకా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు ఈ నెల 28, 29 తేదీల్లో జాతీయ స్థాయిలో ఎస్కేఎం ఆధ్వర్యంలో రైతు, కార్మిక సంఘాలతో సంయుక్త కన్వెన్షన్ నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. 'నీట్' (NEET) పేపర్ లీకేజీని నిరసిస్తూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని  అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు బాగం హేమంతరావు, రాష్ట్ర నాయకులు గోదా శ్రీరాములు, కొల్లూరి రాజయ్య, దొడ్డ వెంకటయ్య, డి.జి. నరేందర్ ప్రసాద్, ఎం. ప్రభులింగం, కొండపర్తి గోవిందరాజు, వర్ల వెంకటయ్య, కంజర భూమయ్య, నర్ల వెంకటయ్య, ఏషాల అశోక్, లక్ష్మయ్య, ఎస్. రవి, దొండపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.