ఇరాన్‌ను మరోసారి హెచ్చరించిన డొనాల్డ్ ట్రంప్
టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) ఇరాన్ కు మరోసారి గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్ లోని సైన్యం, రివల్యూషనరీ గార్డ్స్ ఆయుధాలు వీడాలని ట్రంప్ సూచించారు. ఇరాన్ ను తిరిగి దక్కించుకోవడానికి ఇదే సరైన సమయమని ట్రంప్ స్పష్టం చేశారు. తన మాట వినకుంటే యుద్ధం చేయక తప్పదని ఇరాన్ ను ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోవడం తప్ప ఏమీ మిగలదని అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు.
ఇరాన్‌పై యుద్ధం జరిగిన ఏడవ రోజుకు చేరుకుంది. యునైటెడ్ స్టేట్స్ (United States), ఇజ్రాయెల్ ఇరాన్ లక్ష్యాలపై తీవ్రమైన దాడులను కొనసాగిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇజ్రాయెల్ తో యుద్ధం తీవ్రతరం అవుతుందని, దీర్ఘకాలిక సంఘర్షణకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించింది. ప్రతీకారంగా, ఇరాన్ గల్ఫ్ దేశాలలోని ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై కొత్త క్షిపణి దాడులను ప్రారంభించింది.
ఇరాన్ దాడులను ఇజ్రాయెల్ అడ్డుకుంటుంది. ఇజ్రాయెల్ దళాలు లెబనాన్‌లోని హిజ్బుల్లా(Hezbollah ) స్థావరాలపై కూడా దాడి చేశాయి. ఈ దాడుల్లో ఎనిమిది మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు ఈ ఘర్షణలో ఇరాన్‌లో 1,230 మందికి పైగా, లెబనాన్‌లో 123 మంది, ఇజ్రాయెల్‌లో దాదాపు డజను మంది మరణించగా, ఆరుగురు అమెరికా సైనికులు మరణించారు.
మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రపంచ మార్కెట్లను కుదిపేసింది. చమురు ధరలు పెరిగాయి. హార్ముజ్ జలసంధి(Strait of Hormuz) ద్వారా షిప్పింగ్ మందగించింది. ఇంతలో, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ తదుపరి నాయకత్వాన్ని ప్రభావితం చేయడంలో ఆసక్తిని వ్యక్తం చేశారు. అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. హిందూ మహాసముద్రంలో నౌకలపై దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది.




