5 July, 2026 | 2:08 AM

చరిత్ర సృష్టించిన వైభవ్

05-07-2026 12:23 AM

సచిన్ రికార్డు బ్రేక్

మాంచెస్టర్, జూలై 4 : చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. మాంచెస్టర్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ రెండో టీ20లో డెబ్యూ చేశాడు. తెలుగుతేజం తిలక్ వర్మ చేతుల మీదుగా తన ఇండియన్ క్యాప్ అందుకున్నాడు. ఈ సందర్భంగా వైభవ్ ఎమోషనల్ అయ్యాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసాడు.

సచిన్ 1989లో 16 ఏళ్ల 205 రోజుల వయసులో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. ఇప్పటి వరకూ అదే రికార్డుగా ఉంది. తాజాగా వైభవ్ 15 ఏళ్ల 99 రోజుల వయసులో ఎంట్రీ ఇచ్చి ఆ రికార్డును బద్దలు కొట్టాడు.  అసోసియేట్ దేశాల తరఫున 14 ఏళ్ల వయసులో ఆడిన క్రికెటర్లు కొందరు ఉన్నా ఐసీసీ పూర్తి సభ్య దేశం తరఫున 15 ఏళ్ల వయసులో టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన తొలి ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. కాగా వైభవ్ సూర్యవంశీ కొంతకాలంగా భారత క్రికెట్ లో సంచలన బ్యాటింగ్ తో దుమ్మురేపుతున్నాడు.

అండర్ 19 క్రికెట్ లోనే అద్భుతమైన ఇన్నింగ్స్ లతో అందరినీ ఆకట్టుకున్న వైభవ్ గత ఏడాది ఐపీఎల్ లోనూ అడుగుపెట్టాడు. ఐపీఎల్ అరంగేట్రంలోనే సెంచరీ బాది సంచలనం సృష్టించాడు. ఈ ఏడాది కూడా ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు. ఈ ప్రదర్శనతోనే ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌లకు వైభవ్‌ను ఎంపిక చేశారు. ఈ మ్యాచ్‌లో రెండు భారీ సిక్సర్లు బాదిన వైభవ్ 14 రన్స్‌కు వెనుదిరిగాడు.