14 July, 2026 | 7:00 PM

Breaking News

పెచ్చులూడుతున్న పాఠశాల భవనం.. భయాందోళనలో విద్యార్థులు   •   ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుకై సబ్-ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు   •   విద్యార్థుల‌పై శ్ర‌ద్ద చూపండి   •   కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •  

వనదుర్గమ్మకు తీరొక్క మొక్కులు

14-06-2026 02:52 PM

* భక్తులతో కిక్కిరిసిన వనం 

* మంజీరాలో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మ దర్శనానికి బారులు

* వనదుర్గమ్మ నామస్మరనతో మార్మోగిన ఏడుపాయల క్షేత్రం

పాపన్నపేట: వనదుర్గమ్మ వనంలో ఎటు చూసినా జనమే జనం.. అందరిలో భక్తి భావం.. ఆధ్యాత్మిక వాతావరణం.. ప్రతి నోట వనదుర్గమ్మ నామస్మరణ.. దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయంగా.. జనమేజయుని సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత క్షేత్రం ఆదివారం భక్తులతో జనసంద్రమైంది. వారాంతపు సెలవు రోజు కావడంతో ఏడుపాయలకు భక్తులు పోటెత్తారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.

ఆలయ అర్చకులు వేకువజామునే అమ్మవారికి అభిషేకం, అర్చనలు నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించి భక్తులకు వనదుర్గమ్మ దర్శనం కల్పించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు జిల్లాలు, జంట నగరాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో అమ్మ దర్శనానికి తరలివచ్చారు. చెక్ డ్యామ్, అమ్మవారి ప్రధాన ఆలయం ముందున్న మంజీరా నదీ పాయలో పుణ్యస్నానాలు ఆచరించి వనదుర్గాదేవి దర్శనానికి బారులు తీరారు.

అమ్మ దర్శనంతో భక్తులు తన్మయత్వం చెందారు. పలువురు భక్తులు అమ్మవారికి డప్పు చప్పుల్ల మధ్య బోనాలు, ఓడి బియ్యం సమర్పించారు. మరికొందరు భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల జయ జయ ద్వానాల మధ్య ఏడుపాయల వనదుర్గాదేవి క్షేత్రం హోరెత్తింది. చల్లంగా చూడమ్మా.. వనదుర్గమ్మ తల్లి.. అంటూ భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. ఆలయ అర్చకులు పూజలు చేపట్టి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ సిబ్బంది భక్తులకు తగు ఏర్పాట్లు చేశారు.