వసూల్ రాజాకు హరీశ్‌రావును విమర్శించే హక్కు లేదు
మున్సిపల్ ఎన్నికల్లో బుల్లెట్ దించినా బుద్దిరాలేదా ?
అభివృద్ధి నినాదం మాది.. అవినీతి చరిత్ర నీది..
గజం భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే బహిరంగ విచారణకు సిద్ధం
మైనింగ్ కేసులపై పూర్తి వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి
పటాన్చెరు, మార్చి 31: తాను గజం భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే బహిరంగ విచారణకు సిద్ధమని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గల్లీకో కలెక్షన్ ఏజెంట్ను పెట్టి వసూలు చేస్తున్న చరిత్ర నీదైతే...ప్రజల కోసం వందల ఎకరాలు అమ్ముకున్న చరిత్ర నాదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.
సోమవారం కాంగ్రెస్ పార్టీ నేత కాట శ్రీనివాస్గౌడ్ చేసిన ఆరోపణలపై మంగళవారం ఎమ్మెల్యే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసి ప్రజల మన్ననలు పొందిన బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీష్రావును విమర్శించే స్థాయి నీకుందా అంటూ ప్రశ్నించారు. మైనింగ్ పేర అక్రమాలకు పాల్పడుతున్నామని అసత్య ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు.
2012 లో పటాన్చెరు మండల రెవెన్యూ పరిధిలోని లకడారం గ్రామంలో సర్వే నంబర్ 738 లో సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్ సప్లై పేరుతో నం.439/QL/2010 ప్రభుత్వ ప్రొసీడింగ్స్ తో 2012 లో 15 సంవత్సరాల లీజుతో ప్రారంభించడం జరిగిందన్నారు.మా సంస్థకు క్వారీ కేటాయించిన భూమిలో అప్పటికే ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ జాతీయ రహదారి కోసం పెద్ద ఎత్తున మైనింగ్ చేయడం జరిగింది. అప్పట్లోనే ఈ విషయాన్ని సంబంధిత మైనింగ్ శాఖ అధికారుల సైతం తెలపడం జరిగిందన్నారు.
అనంతరం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా క్వారీని నడపడం జరిగింది.2023 సంవత్సరంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2024 లో కేవలం రాజకీయ కక్షతో అనుమతికి మించి మైనింగ్ చేస్తున్నారంటూ నిబంధనలకు విరుద్ధంగా సీజ్ చేయడం జరిగింది. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 520 కి క్రషర్ క్వారీలకు సైతం నోటీసులు అందించారు. కేవలం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడి క్వారీ అన్న కక్షతో నిబంధనలను తుంగలో తొక్కి.. క్వారీ ప్రతినిధులు లేకుండానే.. అడ్డగోలుగా సర్వే నిర్వహించి 300 కోట్ల రూపాయల జరిమానా కాంగ్రెస్ ప్రభుత్వం విధించిందని ఎమ్మెల్యే దుయ్యబట్టారు.
ఈ అంశంపై ఫిజికల్ గా రీ సర్వే నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టుకి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సైతం విజ్ఞప్తి చేయడం జరిగింది.రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం రీ సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేసినా నేటి వరకు రీ సర్వే చేయలేదంటే దాని వెనక ఎవరు ఉన్నారో ప్రజలు అర్థం చేసుకోవచ్చన్నారు. 1974 సంవత్సరంలో వెంకటేశ్వర్లు అనే స్వాతంత్ర సమరయోధుడికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర సమరయోధుని కోటా కింద పోచారం పరిధిలోని సర్వే నంబర్ 62లో 5 ఎకరాలు కేటాయించడం జరిగిందన్నారు.
1997 సంవత్సరంలో వెంకటేశ్వరరావు తన ఐదు ఎకరాలను శంకర్ లాల్ అనే వ్యక్తికి విక్రయించడం జరిగిందని, 1998 నుండి శంకర్ లాల్ ఐదు ఎకరాలను వివిధ వ్యక్తులకు విక్రయించడం జరిగిందన్నారు. ఈ భూమికి సంబంధించి మాకు గాని మా కుటుంబ సభ్యులకు గానీ ఎటువంటి సంబంధం లేదన్నారు. మరోసారి ఈ అంశంపై వివాదాస్పద ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ నేతలు ఆదర్శ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




