29 July, 2026 | 2:34 AM

నిజం రాస్తే కక్ష సాధింపు!

29-07-2026 01:28 AM
  1. అవినీతినీ బయటపెట్టిన బెల్లంపల్లి, మందమర్రి పాత్రికేయులపై బెదిరింపులు
  2. విలేకరుల ఇంటికి విద్యుత్ కనెక్షన్ కట్ 
  3. మందమర్రి జీఎం నియంత పోకడలు

బెల్లంపల్లి, జూలై 2౮ (విజయక్రాంతి): సింగరేణిలో నిజాలను నిగ్గుతేల్చడం పెద్ద నేరమైపోయింది. కార్మికులు ఎదుర్కొంటు న్న సమస్యలపై, జరుగుతున్న అవినీతిపై వార్తా కథనాలు రాయడం పాత్రికేయుల ప్రధాన విధి. నిక్కచ్చిగా వాస్తవాలు రాసిన వారిపై సింగరేణి అధికారుల కక్ష సాధింపు చర్యలు నియంత పోకడలను మరిపిస్తున్నా యి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సింగరేణి ప్రాంతంలో ఇదే తరహా పోకడ కనిపిస్తున్న ది.

బెల్లంపల్లి పట్టణం ఇంక్లున్ బస్తీలో విజయక్రాంతి దినపత్రిక బెల్లంపల్లి విలేకరి ఉప్పులేటి లక్ష్మణ్ ఇంటికి విద్యుత్ కనెక్షన్ కట్ చేసి అధికారులు తమ రాక్షసానందాన్ని చాటుకున్నారు. ఇటీవల ‘శాంతిఖని గనిలో ఊపిరాడటం లేదు!’ శీర్షికన విజయక్రాంతిలో వచ్చిన కథనానికి జీఎం రాధాకృష్ణ ప్రతీకారం తీర్చుకున్నారు. మందమర్రిలో అధికారుల అక్రమాలపై అక్కడి పాత్రికేయుడు పార్వతి రాజేష్ రాసిన కథనాలు మింగుడు పడటం లేదు.

సదరు పాత్రికేయుని నివాసానికి సైతం కరెంట్ తొలగించారు. ఇలా నిజాలు రాసే పాత్రికేయులపై జీఎం రాధాకృష్ణ పత్రికా స్వేచ్ఛను అడ్డుకునే దుస్సాహసానికి ఒడిగట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీఎం రాధాకృష్ణ తన నియంత పోకడలపై నిరసన వెల్లువెత్తుతున్నది. జీఎం ఆఫీసులో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు తమపై సాగుతోన్న వేధింపులను  సాక్షాత్తు గుర్తింపు సంఘం ఏఐటియూసీ ఆఫీస్‌కి వెళ్లి తమగోడు వెళ్లబుచ్చడం కూడా స్థానికంగా కలకలం రేపింది.

సింగరేణిలో, అందులోనూ మందమర్రి ఏరియాలో నిజాం ముష్కరులను ప్రస్తుత అధికారులు మరిపిస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. పాత్రికేయులపై జరుగుతున్న దాడులను కార్మిక సంఘాలు తిప్పి కొట్టకపోతే ఈ వరుసలో ఏదో ఒక రోజు వారు కూడా ఉంటారని విశ్లేషకులు అంటున్నారు. పత్రిక స్వేచ్ఛపై కత్తులు దూస్తున్న నియంత అధికారుల పోకడలు సింగరేణి మనుగడకు ప్రతిబంధకమనే విషయాన్ని సింగరేణి యాజమాన్యం గుర్తించాలి. సింగరేణి సంస్థకు, కార్మికులకు వారధిగా పనిచేస్తున్న పాత్రికేయులపై అధికారుల తీరు జర్నలిస్టుల్లో ఆగ్రహం రేపుతున్నది.