2 August, 2026 | 2:45 AM

ప్రముఖుల పేర్లు చెప్పి నిలువు దోపిడీ

24-08-2024 02:32 AM
  1. వంద మందిని నమ్మించి రూ.కోటి వసూలు 
  2. ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు

ఎల్బీనగర్, ఆగస్టు 23: ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తుల పేర్లు చెప్పి, ప్రజలను వివిధ రకాలుగా నమ్మించి రూ.కోటి వరకు వసూలు చేసిన ఆరుగురు ముఠా సభ్యులను రాచకొండ ఎస్‌వోటీ, కీసర పోలీసులు అరెస్టు చేశారు. ఎల్బీనగర్‌లోని రాచకొండ క్యాప్ ఆఫీసులో శుక్రవారం కేసు వివరాలను సీపీ సుధీర్‌బాబు వివరించారు. కుషాయిగూడ శివనగర్‌కు చెందిన అనుగు సురేందర్‌రెడ్డి(34) కుషాయిగూడలో మిడ్ డే మీల్స్ ఏజెన్సీలో క్యాటరింగ్ పనిచేస్తున్నాడు. కీసర మండల నాగారం గ్రామానికి చెందిన మేరీ నా రోజ్(52) గృహిణి. దమ్మాయిగూడకు చెందిన బండ వెంకటేశ్(55) సెక్యూరిటీ గా ర్డుగా పని చేస్తున్నాడు.

కీసర మండలం గోధుమకుంట కృష్ణానగర్‌కాలనీకి చెందిన అనుగు హర్షిణిరెడ్డి(33) ప్రైవేట్ టీచర్‌గా పని చేస్తున్నది. జమ్మిగడ్డ కట్రావత్ గోపాల్(48), పోచారం పరిధిలోని అన్నోజిగూడకు చెందిన బొలుగుల అంజ య్య(34) ఆరుగురు ముఠాగా ఏర్పడి ప్రజలను మోసం చేస్తున్నారు. తాము తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి అనుచరులమని, అతడితో మాట్లాడి కోరుకున్న చోటుకు బదిలీ చేయిస్తామని పలువురు గురుకుల టీచర్ల వద్ద రూ.7లక్షల చొప్పు న వసూలు చేశారు. అనుగు సురేందర్‌రెడ్డి ప్రభుత్వ ఉద్యోగిగా చెప్పుకుంటూ డబుల్ బెడ్‌రూం ఇండ్లు ఇప్పిస్తానని, ఫుడ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి డబ్బు వసూలు చేశాడు.

ఇలా మొత్తం వందమందికి పైగా ఉద్యోగులను, ప్రజలను మోసం చేసి మొత్తం రూ.1.29కోట్లు వసూలు చేశారు. ఆరుగురు నిందితులను మల్కాజిగిరి ఎస్‌వోటీ, కీసర పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సీపీ సుధీర్‌బాబు పర్యవేక్షణలో మల్కాజిగిరి డీసీపీ పద్మజ, ఎస్‌వోటీ డీసీపీ రమణారెడ్డి, అదనపు డీసీపీ నర్సింహరెడ్డి, ఏసీపీ శ్రీకాంత్‌గౌడ్, కీసర ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్లు జానయ్య, ప్రవీణ్, రవికుమార్, చంద్రశేఖర్‌రెడ్డి నిందితులను పట్టుకున్నారు. రూ.1.97 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. 98 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కేటాయింపు నకిలీ పత్రాలు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.