2 August, 2026 | 1:39 AM

ప్యాసింజర్ ఆటోలో కొత్త తరహా దోపిడీ

24-08-2024 02:34 AM
  1. ప్రయాణికుల ముసుగులో లగేజీల్లోని వస్తువుల తస్కరణ 
  2. నలుగురు నిందితుల అరెస్టు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 23 (విజయక్రాంతి): ప్యాసింజర్ ఆటోలో కొత్త తరహా దోపిడీకి పాల్పడుతున్న ఓ అంతరాష్ట్ర దొంగల ముఠాను శుక్రవారం నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ టీం, బేగంపేట పోలీసులు కలిసి అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ వై సుధీం ద్ర తెలిపిన వివరాలు.. బస్ల్, రైల్వే స్టేషన్ల వంటి రద్దీ ప్రాంతాల్లో ఈ దోపిడీ ముఠా పక్కాప్లాన్‌తో ప్రయాణికులను దోచుకుంటుందన్నారు. ‘ముఠా సభ్యు ల్లోని ఒకడు ఆ యా స్టేషన్ల వద్ద ఆటోడ్రైవర్‌గా ఉంటూ ప్రయాణీకులను ప్యాసింజర్ ఆటోలో కూర్చొబెట్టుకుంటాడు. అప్పటికే వెనక సీట్లో మరోఇద్దరు ప్రయాణికులుగా కూర్చుంటారు.

కొద్ది దూరం ప్రయాణం తర్వాత మరో వ్యక్తి ప్రయాణికుడిగా అదే ఆటోలో ఎక్కుతాడు. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత ప్రయాణికులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి లగేజీ బ్యాగులను వెనక సీట్లో పెట్టాలని డ్రైవర్ చెబుతాడు. అనంతరం ముఠాలోని ఓ సభ్యుడు చాకచక్యంగా సదరు ప్రయాణికుడి లగేజీ బ్యాగ్‌లను ఓపెన్ చేసి అందులో ఉన్న విలువైన వస్తువును తస్కరించి బ్యాగ్‌ను ఎప్పటి మాదిరిగా పెడతాడు. నిందితుల పని పూర్తయిన తర్వాత కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఆటో చెడిపోయిందని ప్రయాణికులంతా వేరే ఆటోల్లో వెళ్ల్లమని చెబుతాడు.

ఈ క్రమంలో బుధవారం ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బేగంపేట పోలీసులు చోరీలకు పాల్ప డుతున్న నలుగురు నిందితులు (ముఠా నిర్వాహకుడు) ఢిల్లీకి చెందిన ఇర్ఫాన్(49), బోరబండకు చెందిన మహమ్మద్ ఫెరోజ్ (38), యూపీకి చెందిన దంపతులు షకీర్(30), రుబీ(23)ను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.8.82 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ఒక ఆటో, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు టాస్క్‌ఫోర్స్ డీసీపీ వై.సుధీంద్ర తెలిపారు.