శ్రీశైలం ప్రాజెక్ట్‌కు మళ్లీ వరద పోటు
నాగర్‌కర్నూల్/ గద్వాల (వనపర్తి), ఆగస్టు 23 (విజయక్రాంతి): ఎగువన భారీవర్షాలు కురుస్తున్నందున శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్లీ వరద పోటు తగిలింది. జూరాల నుంచి 66,112 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు నుంచి 35,655 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 35,832 క్యూసెక్కులు, హంద్రీనివా నుంచి 250 క్యూసెక్కులు.. ఇలా మొత్తంగా 1,37,849 క్యూసెక్కుల వరద శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి వచ్చి చేరుతోంది.
మరోవైపు ప్రాజెక్టు నుంచి ఆంధ్రా పవర్ హౌజ్‌కు 31,250 క్యూసెక్కులు, తెలంగాణ పవర్ హౌజ్ కు 37,882 క్యూసెక్యుల జలాలు దిగువకు వెళ్తున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్ట్ పరిధిలో 211 టీఎంసీల నీరు 884 అడుగుల మేర నిల్వ ఉంది. అలాగే కర్ణాటకలోని నారాయణపూర్ డ్యాం 13 గేట్ల ద్వారా 94 వేల క్యూసెక్యుల వరద జూరాల ప్రాజెక్టుకు విడుదలయ్యాయి. దీంతో ప్రాజెక్టు అధికారులు శుక్రవారం మధ్యాహ్నం 16 గేట్లు ఎత్తి దిగువకు జలాలు వదిలారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318.51 మీటర్లు కాగా ప్రస్తుతం 318.40 మీటర్ల వద్ద నీరు నిల్వ ఉంది.







