15 June, 2026 | 4:54 PM

ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం అర్ధాంతరంగా నిలిపివేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి

15-06-2026 03:32 PM

* ప్రజావాణిలో కలెక్టర్‌కు బాధితురాలు సంధ్య ఫిర్యాదు

పాపన్నపేట: మండలంలోని కుర్తివాడ గ్రామానికి చెందిన ఆర్ సంధ్యకు ఇందిరమ్మ పథకం కింద ఇల్లు మంజూరైంది. ఆర్థిక స్థోమత లేకపోవడంతో గ్రామ పెద్దల సూచన మేరకు ఇంటి నిర్మాణ బాధ్యతలను ఒక కాంట్రాక్టర్‌కు అప్పగించినట్లు బాధితురాలు సంధ్య తెలిపారు. కాంట్రాక్టర్ మొదట బేస్‌మెంట్ స్థాయి వరకు నిర్మాణ పనులు పూర్తి చేసినప్పటికీ, అనంతరం నిర్మాణ సామగ్రి సరఫరా నిలిపివేసి పనులను అర్ధాంతరంగా ఆపివేశాడని ఆమె ఆరోపించారు. నిర్మాణ పనులు ఎందుకు నిలిపివేశారని కాంట్రాక్టర్‌ను ప్రశ్నించగా, గ్రామ సర్పంచ్ శ్రీధర్ సూచన మేరకే పనులు ఆపివేశామని సమాధానం ఇచ్చినట్లు సంధ్య పేర్కొన్నారు.

గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో తమ కుటుంబం తనకు ఓటు వేయలేదనే కక్షతో ఇంటి నిర్మాణాన్ని నిలిపివేశారని ఆరోపించారు. ఈ విషయమై పలుమార్లు కాంట్రాక్టర్‌ను సంప్రదించినా సర్పంచ్‌ను కలవాలని సూచించారని, అనంతరం సర్పంచ్‌ను కలిసి సమస్య వివరించగా.. తనను గెలిపించిన 30 మంది అనుమతి ఇస్తేనే ఇంటి నిర్మాణం కొనసాగిస్తానని చెప్పినట్లు సంధ్య తెలిపారు. అంతేకాకుండా పదేపదే తన ఇంటికి రావద్దంటూ హెచ్చరించినట్లు ఆరోపించారు.

ఇప్పటికే బేస్‌మెంట్ పనులు పూర్తవడంతో సంబంధిత బిల్లును కాంట్రాక్టర్‌కు చెల్లించినట్లు బాధితురాలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసి, తమ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తయ్యేలా జోక్యం చేసుకోవాలని కోరారు. అలాగే ఇంటి నిర్మాణాన్ని నిలిపివేసిన సర్పంచ్‌పై తగిన చర్యలు తీసుకోవడంతో పాటు కాంట్రాక్టర్ ద్వారా పెండింగ్ పనులను పూర్తి చేయించి బిల్లులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. తమ కుటుంబ పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని అర్ధాంతరంగా నిలిచిపోయిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించి పూర్తి చేయించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను బాధితురాలు సంధ్య వేడుకున్నారు.

బాధితురాలికి న్యాయం చేయాలి: పద్మా రెడ్డి

ఈ సమస్యపై మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్ రెడ్డి స్పందించారు. బాధితురాలు సంధ్య ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్న ఆమె ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి సమస్యను వివరించారు. ఇందిరమ్మ పథకం కింద మంజూరైన ఇంటి నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా వెంటనే విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ పథకాల ఫలాలను పొందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించి, బాధిత కుటుంబానికి ఇల్లు నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.