5 August, 2026 | 8:09 PM

వాగులో గల్లంతైన వ్యక్తి మృతదేహం వెలికితీత

05-08-2026 07:05 PM

పలిమెల,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం సర్వాయిపేట వాగులో చేపల వేటకు వెళ్లిన వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పలిమెల ఎస్సై సాయి శశాంక్ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం సర్వాయిపేట గ్రామానికి చెందిన కుమ్మరి అంకయ్య, కుమ్మరి బక్కయ్య తో కలిసి గ్రామ సమీపంలోని వాగులో చేపలు పట్టేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు అంకయ్య నీటిలో మునిగి గల్లంతయాడని, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు ప్రారంభించగా చీకటి పడటంతో గాలింపు చర్యలు ఆగిపోయాయని తెలిపారు.

మహదేవపూర్ సిఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎస్సై శశాంక్, ఆర్ఎస్ఐ అజహార్, డి ఆర్ ఎఫ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, పంకెన మత్స్యకారులు మరియు గజ ఈతగాళ్ల సమన్వయంతో తిరిగి బుధవారం గాలింపు చర్యలు చేపట్టగా వ్యక్తి మృతదేహం లభ్యమైందని ఆయన వివరించారు. ప్రతికూల వాతావరణంలో సైతం మృతదేహాన్ని వెలికి తీసిన అధికారులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది వరద ప్రవాహం పెరిగిందని చేపల వేటకు వెళ్లేవారు, పశువుల కాపర్లు , ప్రజలు ఎవరు గోదావరి తీరం వద్దకు వెళ్ళవద్దని అధికారులు చెప్పే సూచనలను పాటించి ప్రాణాలను కాపాడుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.