16 May, 2026 | 1:47 AM

26లోపు వీడియో క్లిప్పింగ్స్ తొలగించాలి

16-05-2026 12:42 AM
  1. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశం
  2. బండి భగీరథ్ కేసులో నా పేరును ఎక్కడా వాడొద్దని కేంద్రమంత్రి సంజయ్ పిటిషన్

హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): తన కుమారుడిపై నమోదైన పోక్సో కేసుకు సంబంధించి తన పేరు తో ప్రసారం అయిన వీడియోలను, ప్రచురించిన పత్రికా కథనాలను  తొలగించాలని, భవిష్యత్తులో తన పేరును వాడకుండా నిలువరించాలని కోరుతూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో శుక్రవారం కేంద్ర మంత్రి బండి సంజయ్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై.. ఈనెల 26లోపు వీడియో క్లిప్పింగులను, పత్రికా కథనాలను, పోస్టర్లను తొలగించా లని కోర్టు తీర్పు ఇచ్చింది.

తన కుమారుడిపై నమోదైన పోక్సో కేసుకు సంబంధించి భవిష్యత్తులో మీడియా, సోషల్ మీడియాలో తన పేరు వాడకుండా నిలువరించాలని బండి సంజయ్ హైదరా బాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఇప్పటివరకు తన పేరుతో ప్రసారం అయిన వీడియోలను కూడా తక్షణమే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

తన కుమారుడిపై నమోదైన కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఈ వివాదంలో తన పేరును ఎక్కడా ఉపయోగించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై స్పందించిన కోర్టు.. బండి భగీరథ్ కేసులో బండి సంజయ్‌ను లక్ష్యంగా ప్రసారం చేసిన వీడియో క్లిప్పింగులను, పత్రికా క్లిప్పింగులను, డిజిటల్ కంటెంట్, వాల్ పోస్టర్లను తొలగించాలని ఉత్తర్వులు జారీచేసింది. ఈనెల 26లోపు తొలగించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది. 

బాలిక వివరాలు వెల్లడించిన వారిపై కేసులు..

బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో బాలిక వివరాలు సోషల్ మీడియాలో ప్రసారం చేసిన వారిపై పేట్ బషీరాబాద్ పోలీసులు శుక్రవారం కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాలో బాలిక ఫొటోలు, వీడియోలు, ఆమె తల్లిదండ్రుల వివరాలు వెల్లడించిన నిర్వాహకులపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. మేడ్చల్ జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్ ఫిర్యాదు మేరకు మైనర్ల గుర్తింపును బహిర్గతం చేసినందుకు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

అయితే బాలిక, ఆమె కుటుంబ వివరాలు బహిర్గతం చేసిన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఖాతాల ఐడీలు, సం  బంధిత యూఆర్‌ఎల్‌ల ద్వారా ఖాతాలను నిర్వహిస్తున్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. కాగా పోక్సో కేసుల్లో బాధితులుగా ఉన్న మైనర్‌లు, వారి కుటుంబ సభ్యు ల వివరాలను, ఫొటోలను బయటకు వెల్లడించకూడదని, అలా చేస్తే నేరమని పోలీసులు హెచ్చరి స్తున్నారు.