నా భర్త.. విజయ్ దేవరకొండ!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి గురువారం ఉదయం 10.10 గంటలకు జరిగింది. ఉదయం తెలుగు సంప్రదాయంలో, సాయంత్రం కొడవ పద్ధతిలో రెండు సార్లు పెళ్లి జరిగిందని సన్నిహితుల ద్వారా తెలిసింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను నవ దంపతులు రష్మిక అభిమానులతో పంచుకున్నారు. రష్మికను జీవిత భాగస్వామిగా ఎందుకు ఎంచుకున్నారో ఇన్‌స్టాపోస్టు ద్వారా తెలిపారు విజయ్..
“ఒకరోజు, నేను ఆమెను మిస్ అయిన. ఆమె ఉంటే నా రోజు బాగుండేదని నాకు అనిపించేలా ఆమెను మిస్ అయిన. ఆమె నా ఎదురుగా కూర్చుంటే నా భోజనం మరింత రుచిగా ఉంటుండె. ఆమె నాతో కలిసి చేస్తుంటే నా వ్యాయామాలు మరింత సరదాగా అనిపిస్తుండె.. ఎప్పటిలా కాకుండా తక్కువ కష్టంగా అనిపిస్తుండె. నేను ఎక్కడున్నా, ఆ ఇంటి అనుభూతిని, ప్రశాంతతను అనుభవించడానికి ఆమె నాకు అవసరం. కాబట్టి, నేను నా ప్రాణ స్నేహితురాలిని.. నా భార్యను చేసుకున్నా” అని పేర్కొన్నారు.
ఇక రష్మిక కూడా సుదీర్ఘమైన పోస్టు చేశారు.. “హాయ్ మై లవ్స్.. నా భర్త మిస్టర్ విజయ్ దేవరకొండను మీకు పరిచయం చేస్తున్నా. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నేర్పిన వ్యక్తి.. ప్రశాంతంగా ఉండటం ఎలా ఉంటుందో నేర్పిన వ్యక్తి.. మన కలలు, లక్ష్యాలు పెద్దగా, గొప్పగా ఉండాలని రోజూ నాకు చెప్పే వ్యక్తి.. నేను అనుకున్నది సాధించగలనని నిత్యం ప్రోత్సహించే వ్యక్తి.. నాలోని శక్తి సామర్థ్యాలను నిరంతరం గుర్తుచేసే వ్యక్తి.. నా భావాలను నిరభ్యంతరంగా వ్యక్తపరిచినప్పుడు.. ఎప్పుడూ అడ్డు చెప్పని వ్యక్తి.. స్నేహితులతో కలిసి ప్రయాణం చేయడం ఎంత గొప్పగా ఉంటుందో నేర్పిన వ్యక్తి. నన్ను నమ్మండి నేను ఈ వ్యక్తి గురించి ఒక పుస్తకం రాయగలను” అంటూ అభిమానులతో సంతోషాన్ని పంచుకుంది.
ఇక విజయ్‌ను ఉద్దేశించి.. “విజ్ఞూ.. నేను ఒక మహి ళగా కలలు కంటూ ఉంటే, వాటిని సాకారం చేసి నువ్వు ఈ స్థాయిలో నిలబెట్టావు.. నేను నిజంగా అదృష్టవంతురాలిని. నీ పట్ల నాకున్న నాలోని భావాలను వ్యక్తం చేయడానికి మాటలు సరిపోవు. ఈ విషయాన్ని నీకు పదేపదే చెప్తూనే ఉంటా. జీవితంలో అనుకోకుండా వచ్చే విజయాలు, కష్టాలు, సంతోషాలు, విచారాలు, ఆనందం, జీవితం అన్నీ నీకు తెలుసు. ఇకపై ప్రతిదీ చాలా అర్థవంతంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు.. నేను నీతో ఉన్నా. నువ్వు నా జీవితంలో అన్నింటిలో అతిపెద్ద భాగం. నేను నీ భార్యగా ఉండటానికి, కావడానికి, నీతో అలా పిలిపించుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నా. ఇది పార్టీ చేసుకునే సమయం. పద మనం కలిసి అత్యుత్తమ జీవితాన్ని జీవిద్దాం. ఐ లవ్ వ్యూ” అని పేర్కొంది రష్మిక.




