calender_icon.png 2 February, 2026 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వికసిత్ ఎక్స్‌ప్రెస్

02-02-2026 02:24:30 AM

  • పన్నుల పటాకుల్లేవ్..
  • ప్రజాకర్షక పథకాల్లేవ్..

కేంద్ర బడ్జెట్ 2026

బడ్జెట్ కేటాయింపులు

రక్షణ రంగం: 7,84,678 కోట్లు

రవాణా (రైల్వేలు, రహదారులు): 5,98,520 కోట్లు

వ్యవసాయం, అనుబంధ రంగాలు: 1,62,671 కోట్లు

గ్రామీణాభివృద్ధి: 2,73,108 కోట్లు

  1. మౌలిక సదుపాయాలు, ఏఐ డేటా సెంటర్లు, పెట్టుబడులకు పెద్దపీట
  2. మూడు ప్రధాన కర్తవ్యాలు, ఆరు దశల ఆచరణ

ఏడు హైస్పీడ్ రైల్వే కారిడార్లు..

పుణె--హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు,

హైదరాబాద్-చెన్నై, ముంబై-పుణె, చెన్నై--బెంగళూరు,

బెంగళూరు-వారణాసి, వారణాసి-సిలిగురి

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. కేటాయింపుల్లో రక్షణ రంగానికి అగ్రతాంబూలమిచ్చారు. మూలధన వ్యయం 12.2 లక్షల కోట్లను ప్రధానంగా రైల్వేలు, జాతీయ రహదారులు, ఓడరేవులు, పట్టణ మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించనున్నారు. యువత అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం మూడు కర్తవ్యాలు, ఆరు దశల ప్రక్రియ అవలంబిస్తుందని స్పష్టంచేశారు.

మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చేలా పాత ఆదాయపు పన్ను చట్టం స్థానంలో ‘ఇన్‌కం టాక్స్ యాక్ట్ 2025’ను తీసుకురానున్నట్లు ప్రకటించారు. పన్ను చెల్లింపు ప్రక్రియను సరళతరం చేస్తూ ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని తెలిపారు. ప్రాణాపాయ వ్యాధులకు సంబంధించిన 17 రకాల మందులపై కస్టమ్స్ డ్యూటీని రద్దుచేస్తున్న ట్లు ప్రకటించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా టైర్--2, టైర్--3 పట్టణాలు, నగరాలపై ప్రత్యేక దృష్టి సారించామని వివరించారు.

మౌలిక వసతులకు హర్దశ 

అంతర్గత జల రవాణాకు ఊతం

అంతర్గత జల రవాణాకు ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో వెసులుబాటు కల్పించింది. రానున్న ఐదేళ్లలో 20 కొత్త జాతీయ జలమార్గాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా ఒడిశాలోని ‘నేషనల్ వాటర్ వే 5’ ద్వారా ముఖ్యమైన పారిశ్రామిక కారిడార్లను నేరుగా ఓడరేవులతో అనుసంధానించనుంది. భారీగా ఖనిజ సంపద కలిగిన ప్రాంతాలను ఓడరేవులను కలపడం వల్ల ఎగుమతులు మరింత వేగవంతం అవుతాయనేది కేంద్ర ప్రభుత్వ అంచనా. వారణాసి, పాట్నా వంటి నగరాల్లో అంతర్గత జలమార్గాల నౌకల మరమ్మతు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

2047 నాటికి సముద్ర తీర సరుకు రవాణా వాటాను ఇప్పటికంటే రెట్టింపు చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. ప్రైవేట్ పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచేందుకు ’ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిస్క్ గ్యారెంటీ ఫండ్’ ప్రవేశపెట్టింది. దీని ద్వారా ప్రాజెక్టుల నిర్మాణ దశలో తలెత్తే ఆర్థిక నష్టాల నుంచి బ్యాంకులు, రుణదాతలకు భరోసా కల్పించనుంది. పాక్షిక క్రెడిట్ గ్యారెంటీలను అందించడం ద్వారా భారీ ప్రాజెక్టులకు నిధుల సేకరణ సులభతరం అవుతుంది. మౌలిక సదుపాయాల పరికరాల తయారీని దేశీయంగా ప్రోత్సహించేందుకు సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. అగ్నిమాపక పరికరాలు, లిఫ్టులు, టన్నెల్ బోరింగ్ యంత్రాల తయారీకి ఈ పథకం ఊతమిస్తుంది.

కేంద్ర బడ్జెట్‌లో 12.2 లక్షల కోట్లు కేటాయింపు

గతేడాదితో పోలిస్తే నిధులు 11.4 శాతం మేర పెంపు

తూర్పుతీరం -పడమర తీరాన్ని కలిపేలా కొత్త ఫ్రైట్ కారిడార్ ఏర్పాటు

దేశవ్యాప్తంగా 20 కొత్త జాతీయ జలమార్గాల అభివృద్ధి

టైర్ -2, టైర్ నగరాల ప్రగతికి ప్రత్యేక నిధుల కేటాయింపు

రవాణా రంగానికి 5,98,520 కోట్లు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి ౧: కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల రంగానికి పెద్దపీట వేసింది. దేశాభివృద్ధికి చోదక శక్తిగా నిలిచే మూలధన వ్యయాన్ని గ తంలో ఎన్నడూ లేని విధంగా రూ.12.2 లక్షల కోట్లకు పెంచింది. పదేళ్ల క్రితం కేవలం రూ.2 లక్షల కోట్లు ఉన్న ఈ వ్యయం 2026కు ఆరు రెట్లు పెరగడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల్లో మౌలిక వసతులకు 11.2 లక్షల కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్ ఆ మొత్తం 11.4 శాతం మేర పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అనిశ్చితులు నెలకొన్న వేళ దేశ ఆర్థిక వ్యవస్థను వేగం ముందుకు తీసుకెళ్లేందుకు పెట్టుబడి తోడ్పడుతుందని కేం ద్రప్రభుత్వం భావిస్తున్నది.

దేశ జీడీపీలో ఈ మూలధన వ్యయం 4.4 శాతానికి సమా నం. ఈ పెట్టుబడులు తయారీ రంగం, ఉ ద్యోగ కల్పనకు గొప్ప ఊతం ఇవ్వనున్నా యి. రవాణా వ్యవస్థలో భాగమైన రైల్వే, ర హదారులు, ఓడరేవుల అభివృద్ధికి బాటలు పడనున్నాయి. దీనిలో భాగంగానే కేంద్ర ప్ర భుత్వం తూర్పుతీరం నుంచి పశ్చిమ తీరంలోని సూరత్ వరకు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడా ర్ ఏర్పాటు చేయనుంది. ఈ కారిడార్‌తో స రుకు రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. కేంద్రం ఈసారి పర్యావరణ హితమై న రవాణాకు ప్రాధాన్యమిచ్చింది. సరుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా సజావుగా గమ్యస్థానాలకు చేరేవిధమైన కనెక్టివిటీకి ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడనుంది.

నగరాల అభివృద్ధికి కొత్త వ్యూహం

నగరాల అభివృద్ధి కోసం కేంద్రం సరికొత్త వ్యూహాన్ని ప్రకటించింది. 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న టైర్ టైర్ -3 నగరాలను ఆర్థిక వృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దేలా ప్రణాళిక రూపొందించింది. దీనిలో భాగం గా ప్రతి సిటీ ఎకనామిక్ రీజియన్ (సీఈఆర్)కు ఐదేళ్ల కాలానికి రూ.5,000 కోట్ల చొప్పున నిధులను కేటాయించనుంది. పట్టణీకరణ వల్ల కలిగే ప్రయోజనాలను చిన్న నగరాలకూ చేరవేయడమే కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది. పెద్ద నగరాలు రూ.వెయ్యికు పైగా మున్సిపల్ బాండ్లు జారీ చేస్తే, తక్షణం రూ.100 కోట్ల మేర ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రణాళికలు రూపొందించింది. 

రవాణా రంగానికి 5,98,520 కోట్లు

కేంద్ర ప్రభుత్వం రవాణా రంగానికి పెద్దపీట వేసింది. ఏకంగా రూ.5,98,520 కోట్ల నిధులుకేటాయించింది. ఈ నిధుల్లో రవా ణా, జాతీయ రహదారుల విభాగానికి రూ.3.10 లక్షల కోట్లు, ఎన్‌హెచ్‌ఏఐకు రూ.1.87 లక్షల కోట్లు, అలాగే కేంద్ర రైల్వేశాఖకు రూ. 2.93 లక్షల కోట్లు కేటాయించింది. గతేడాది ఈ శాఖకు రూ. 2.78 లక్షల కోట్ల నిధులు దక్కగా, ఈసారి 10.3 శాతం పెరిగాయి.

ఆర్థికవృద్ధి, ఉపాధి కల్పనే లక్ష్యం

బయోఫార్మా రంగం అభివృద్ధికి రూ.10,000 కోట్లు

ఆరోగ్య మంత్రిత్వ శాఖకు 10శాతం అధికంగా రూ.1.06 లక్షల కోట్లు

దేశవ్యాప్తంగా లక్ష మంది అనుబంధ ఆరోగ్య నిపుణుల సృష్టికి ప్రతిపాదన

సాంకేతిక ఆధారిక వృద్ధి, మౌలిక సదుపాయాలన కల్పనకు ప్రణాళికలు

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను నిలపడమే ధ్యేయం

బడ్జెట్‌పై మీడియా సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1 :  దేశ ఆర్థిక వృద్ధిని వేగిరం చేయడం.. అన్ని రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను  ప్రోత్సహించడమే లక్ష్యంగా 2026- కేంద్ర బడ్జెట్‌ను రూపొందించినట్లు  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. సంస్కరణల ద్వారా స్థిరమైన ఆర్థిక వృద్ధి సాధించేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందని, ఉత్పాదకతను మెరుగుపరచడం, ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని వివరించారు.

ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్‘ స్ఫూర్తితో 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ఈ బడ్జెట్.. మార్గం సుగమం చేస్తుందని ఆమె చెప్పారు. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు వంటి ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు బడ్జెట్‌లో ప్రత్యేక ప్రాధాన్యత ఎందుకు ఇవ్వలేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు, నిర్మలా సీతారామన్ చమత్కరిస్తూ.. ‘ప్రభుత్వం ఏ మార్గంలో వెళ్లినా విమర్శలు తప్పవు కదా‘ అని సమాధానమిచ్చారు.

కేటాయింపులే కాదు.. ఉత్పాదకతను పెంచేందుకు..

ఈ బడ్జెట్ కేవలం కేటాయింపులకు పరిమితం కాలేదని, దేశ ఉత్పాదకతను పెంచేందుకు నిర్మాణాత్మక సంస్కరణలతో కూడిన ఒక పటిష్టమైన వ్యవస్థను నిర్మించడంపై దృష్టి సారించిందని నిర్మలా సీతారామన్ వివరించారు. ‘స్థిరమైన ఆర్థిక విస్తరణ ద్వారా వృద్ధి వేగాన్ని కొనసాగించేలా ఈ బడ్జెట్‌ను తీర్చిదిద్దాం. టెక్నాలజీ ఆధారిత, సమ్మిళిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించాలన్న ప్రభుత్వ నిబద్ధత ఇందులో ప్రతిబింబిస్తుంది,‘ అని ఆమె తెలిపారు.

సాంకేతికతను చేరువ చేసేలా..

21వ శతాబ్దం పూర్తిగా టెక్నాలజీ ఆధారితంగా నడుస్తోందని, అందువల్ల సాంకేతికతను సామాన్యుడిగా కూడా అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుందని అన్నారు. ఈ దిశగా టైర్ 2, టైర్ 3 నగరాల అభివృద్ధికి ఏటా రూ.1,000 కోట్ల చొప్పున కేటాయిస్తున్నాయని చెప్పారు. ఈ నిధులు ముఖ్యంగా సాంకేతిక ఆధారిక వృద్ధి, మౌలిక సదుపాయాలన కల్పన, పట్టణ ప్రణాళికను బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయని చెప్పారు. తద్వారా ఈ నగరాలు వేగవంతమైన ఆర్థికాభివృద్ధిని సాధిస్తాయని చెప్పారు. 

ఆరోగ్య రంగానికీ సమాన ప్రాధాన్యం

బడ్జెట్లోని కీలక ప్రతిపాదనలను వివరిస్తూ, బయోఫార్మా రంగంలో భారత్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకునేందుకు రాబోయే ఐదేళ్లలో రూ.10,000 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. ఇది ఈ రంగంలో మన దేశ నాయకత్వాన్ని సుస్థిరపరుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా, ఈసారి బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కూడా సమాన ప్రాధాన్యత ఇచ్చామని, ముఖ్యంగా మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు కేటాయింపులను గత ఆర్థిక సంవత్సరం (2025 సవరించిన అంచనాల కంటే దాదాపు ఈసారి 10 శాతం బడ్జెట్‌ను పెంచి రూ.1,06,530.42 కోట్లకు చేర్చినట్లు తెలిపారు.

దేశవ్యాప్తంగా మరిన్ని అత్యవసర, ట్రామా సెంటర్లు

ఆరోగ్య రంగంలో మానవ వనరులను బలోపేతం చేసేందుకు రాబోయే ఐదేళ్లలో ఆప్టోమెట్రీ, రేడియాలజీ, అనస్థీషియా వంటి 10 విభాగాల్లో లక్ష మంది అనుబంధ ఆరోగ్య నిపుణులను  తీర్చిదిద్దనున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు, దేశవ్యాప్తంగా మరిన్ని అత్యవసర, ట్రామా సెంటర్లు, నిమ్హాన్స్ వంటి మానసిక ఆరోగ్య సంస్థలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వృద్ధుల సంరక్షణ కోసం 1.5 లక్షల మంది కేర్గివర్లను కూడా సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. బడ్జెట్లో కొత్తగా ప్రతిపాదించిన రేర్ ఎర్త్ కారిడార్ల విజయంపై ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో ఏర్పాటు చేసిన డిఫెన్స్ కారిడార్ల విజయాన్ని ఈ సందర్భంగా ఉదాహరణగా చూపారు.

రైల్వే బడ్జెట్ ౨.౭౮ లక్షల కోట్లు

కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, గేజ్ మార్పిడికి నిధుల వినియోగం

ఏడు హైస్పీడ్ రైల్వే కారిడార్లకు ౨.౯౩ లక్షల కోట్లు అదనంగా కేటాయింపు

చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ కనెక్టివిటీకి ‘దక్షిణ త్రిభుజం’ ఏర్పాటు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి ౧: కేంద్ర బడ్జెట్‌లో రైల్వేశాఖకు రూ.2,78,030 కోట్ల కేటాయింపులు జరిగాయి. ఈ నిధులతో రైల్వేశాఖ కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, గేజ్ మార్పిడి, రైల్వే కమ్యూనికేషన్, నెట్‌వర్క్, డబ్లింగ్ పనులను వేగంగా పూర్తి చేయనుంది. ప్రయాణికులకు భద్రత కల్పించే అంశానికి ప్రాధాన్యమిస్తూ, అందుకు అవసరమైన సాంకేతికతను సమకూర్చుకోనుంది. అలాగే మరో రూ.2,93,030 కోట్ల అదనంగా కేటాయించి దేశవ్యాప్తంగా రైల్వే కనెక్టివిటీని పెంచేందుకు ఏడు కొత్త హైస్పీడ్ రైల్ కారిడార్లు ఏర్పాటు చేయనుంది. పలు ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల ద్వారా నిధులను సమీకరించేందుకు ప్రత్యేక ‘రీట్స్’ విధానాన్ని అమలు చేయనుంది.

అలాగే కేంద్రం రాష్ట్రాల మౌలిక వసతుల కల్పనకు రూ.1.5 లక్షల కోట్ల మేర 50 ఏళ్ల కాలపరిమితి గల వడ్డీ లేని రుణాలు కేటాయించనుంది. ఈ నిధులను సద్వినియోగం చేసుకుని రాష్ట్రప్రభుత్వాలు తమ రాష్ట్రాలను ప్రగతిబాట పట్టించవచ్చు. దక్షిణ భారత్‌లో ప్రధాన నగరాలైన చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాలను కలుపుతూ ఒక ‘దక్షిణ రైల్వే త్రిభుజం’ కనెక్టివిటీ ఏర్పాటు చేయనుంది. అలాగే నిర్భయ నిధి పేరిట రూ.200 కోట్లు కేటాయించింది.

పత్తా లేని పన్ను మినహాయింపు

కీలక నిర్ణయాలు..

రహదారి ప్రమాదాల పరిహారం వడ్డీపై పన్ను తొలగింపు

విదేశీ యాత్రలపై టాక్స్ తగ్గింపు

చదువులు, వైద్యంపై టీసీఎస్ 5 నుంచి 2 శాతానికి తగ్గింపు

చిన్న పన్ను చెల్లింపుదారుల కోసం ప్రత్యేక పథకం వర్తింపు

ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి

సవరించిన పన్ను రిటర్ను దాఖలు గడువు పెంపు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర బడ్జెట్‌లో ఈసారి పన్ను రేట్లకు సంబంధించి ఎలాంటి మార్పులు లేకపోవడం ట్యాక్స్ పేయర్లకు నిరాశ కలిగించిందని చెప్పొచ్చు. అయితే  ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ పు పన్ను చట్టం అమల్లోకి రానున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 1961 పన్ను చట్టాన్ని ఈ కొత్త పన్ను చట్టం భర్తీ చేయనుంది. దీనిని గతంలోనే ప్రకటించినప్పటికీ తాజాగా కొన్ని కీలక మార్పులు చేసి నోటిఫై చేశారు. ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్న కొత్త ఆదాయపు పన్ను చట్టం నిబంధనలు అందరికీ అర్థమయ్యేలా సులభంగా ఉండనున్నాయి. సామాన్యులు కూడా సులభంగా ఐటీఆర్ ఫైల్ చేసేందుకు వీలు కల్పించనుంది.

మరో అంశం ఏమిటంటే.. సవరించిన పన్ను రిటర్నుల దాఖలు గడువును కూడా పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టాక్స్ పేయర్లకు ఆదాయపు పన్నుకు సంబంధించి కొన్ని విధాన పరమైన అంశాల్లో కాస్త ఊరట లభించింది. ఐటీ రిటర్న్స్ ఐటీఆర్ ఫైలింగ్‌కు సంబంధించి ఈ ఏడాది జూలై 31 వరకు గడువు కల్పించారు. కాగా కొత్త పన్ను విధానంలో ప్రస్తుతం వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్ రూ. 75 వేలుగా ఉంది. ఈసారి స్టాండర్డ్ డిడక్షన్ పెంచకపోవడంతో నిరాశే ఎదురైంది. 

వికసిత్ భారత్ లక్ష్యం దిశగా: కేఎస్ అయ్యర్ అండ్ కో

వికసిత్ భారత్ దార్శనికతకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ 2026 ఉందని కేఎస్ అయ్యర్ అండ్ కో చార్టడ్ అకౌంటంట్స్ తమ విశ్లేషణలో అభిప్రాయపడింది. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి, పౌరుల సామర్థ్యాలను పెంపొందించడానికి, సమ్మిళిత అభివృద్ధిని నిర్ధారించడానికి ‘త్రి కర్తవ్య’ చట్రం అసమని పేర్కొంది. 12.2 లక్షల కోట్ల రికార్డు మూలధన వ్యయం, జీడీపీలో 4.3 శాతం ఆర్థిక లోటు, వ్యూహాత్మక తయారీ, మౌలిక సదుపాలు, గ్రీన్ ఎనర్జీలో చొరవలను ప్రత్యేకంగా చూపించింది. 2016 నుంచి 2025 వరకు బడ్జెట్లలో ఎన్డీయే సర్కార్ మేక్ ఇన్ ఇండియా సంస్కరణలపై దృష్టి సారించింది. ఈ ఏడాది బడ్జెట్‌లో సాంకేతిక స్వావలంబన, పట్టణ క్లస్టరింగ్, స్థిరత్వం వైపు వెళ్లింది. ఈసారి గ్రామీణపథకాలకు నిధులను భారీగా కేటాయించింది.

టార్గెట్.. అరుదైన ఖనిజాల సమృద్ధి

‘నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్’కు రూ.౩౪,౩౦౦ కోట్లు

ఖనిజాల కోసం చైనాపై ఆధారపడకుండా స్వయం సమృద్ధిపై దృష్టి

ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరంలో రేర్ ఎర్త్ కారిడార్లు

రీసైక్లింగ్‌కు ప్రోత్సాహం.. ఈ -వేస్టేజీ నుంచి ఖనిజాల సేకరణ 

అందుకు 1,500 కోట్లతో ప్రత్యేక పథకం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి ౧: ఆర్థిక స్వయం సమృద్ధి సాధనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. కేంద్ర బడ్జెట్‌లో క్రిటికల్ మినరల్స్ (అరుదైన ఖనిజాల) సముపార్జనకు కొత్తగా ‘నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్’ను ప్రకటించింది. మిషన్‌లో భాగంగా ఏడేళ్ల కాల పరిమితి విధించుకుని రూ.34,300 కోట్ల నిధులను కేటాయించింది. ఈ నిర్ణయంతో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్లు, సెమీ కండక్టర్లు, రక్షణ పరికరాల తయారీకి అవసరమయ్యే ఖనిజాల సమీకరణకు బాటలు పడతాయి. ఈ ఖనిజాల సేకరణ విషయంలో ప్రస్తుతం భారత్ 45 శాతానికి పైగా చైనాపైనే ఆధారపడుతున్నది. దీర్ఘకాలం చైనాపై ఆధారపడకుండా, స్వయం సమృద్ధి సాధించే దిశగా భారత్ అడుగులు వేయనుంది. ఆ ఖనిజాల తవ్వకాలు, ప్రాసెసింగ్‌పై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించనుంది. దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిశా, తమిళనాడులో ‘రేర్ ఎర్త్ కారిడార్లు’ ఏర్పాటు చేయనుంది.

ఆయా రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో అపారమైన మోనజైట్, థోరియం, నియోడైమియం తదితర ఖనిజ నిక్షేపాలను వెలికితీయనుంది. వెలికితీసిన ఖనిజ నిక్షేపాలను నిల్వ చేసేందుకు యూనిట్లు నెలకొల్పనుంది. ప్రాసెసింగ్ ప్లాంట్లనూ ఏర్పాటు చేయనుంది. అక్కడి నుంచి వాటిని ఓడరేవులకు రవాణా చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయనుంది. కేవలం ఖనిజాల సేకరణపైనే కాకుండా రీ సైక్లింగ్‌కూ పెద్దపీట వేసింది. పాత ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, పారిశ్రామిక తుక్కు (ఈవే నుంచి తిరిగి ఖనిజాల రికవరీ చేసే యూనిట్లకు రూ.1,500 కోట్ల నిధులను కేటాయించింది. 2026 31 వరకు ఈ స్కీం అమలవుతుంది’. ఈసమగ్ర వ్యూహం ద్వారా వచ్చే ఐదేళ్లలో సుమారు 50,000 మందికి ఉపాధి కల్పించే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది.

వ్యవసాయానికి ఊతం

బడ్జెట్‌లో 1.62 లక్షల కోట్లు కేటాయింపు

వీబీ జీ రామ్ జీకి 95 వేల కోట్లు

గతేడాదితో పోలిస్తే 7.12 శాతం అదనం

కొబ్బరి, గంధం, కోకా ఉత్పత్తులపై దృష్టి

గ్రామీణాభివృద్ధికి 2.73 లక్షల కోట్లు 

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర బడ్జెట్ 2026 భాగంగా వ్యవసాయ రంగానికి మొత్తం రూ. 1, 62, 671 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. గతేడాదితో పోలిస్తే వ్యవసాయ రంగంలో 7.12 శాతం అదనంగా నిధులు కేటాయించడం జరిగింది. 2025 బడ్జెట్‌లో ఇదే వ్యవసాయ రంగానికి రూ. 1,51, 853 కోట్లు కేటాయించినట్లు గుర్తుచేశారు. గ్రామీణ జీవనోపాధి ఎంపికలను విస్తృతం చేసే దిశగా బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి ప్రాధాన్యం కల్పించినట్లు తెలిపారు. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అనే దార్శనికత వికసిత్ భారత్ వైపు అడుగులు వేయిస్తుందని తెలిపారు. ఈసారి బడ్జెట్‌లో చిన్న, సన్నకారు రైతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు వివరించారు. ఉత్పాదకత పెంపుదల, వ్యవస్థాపకత ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడాన్ని  కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. అంతేకాదు గ్రామీణ ఆదాయాలను వైవిధ్యపరచడంతో పాటు సంప్రదాయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించడానికి అనేక చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు.

కొబ్బరి, గంధంపై దృష్టి

వ్యవసాయ ఉత్పత్తులను వైవిధ్యపరచడానికి, ఉత్పాదకతనున పెంచడానికి, రైతుల ఆదాయాన్ని పెంచడానికి మా ప్రభుత్వం ఎప్పుడు ముందు వరుసలో ఉంటుందని సీతారామన్ తెలిపారు. తీర ప్రాంతాల్లో ఎక్కువగా కొబ్బరి, గంధం, కోకో, జీడిపప్పు వంటి అధిక విలువ కలిగిన పంటలను వేసే లా రైతులను ప్రోత్సహిస్తామన్నారు. కొబ్బరి పండించే ప్రధాన రాష్ట్రాల్లో పాత లేదా ఉత్పాదకత లేని చెట్లను కొత్త రకాలతో భర్తీ చేస్తూ కొబ్బరి ప్రోత్సాహక పథకాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. దేశంలో దాదాపు 10 మిలియన్ల మంది రైతులు సహా 30 బిలియన్ల మంది తమ జీ వనోపాధి కోసం కొబ్బరిపై ఆధారపడుతుండడం తో ప్రపంచంలోనే అతిపెద్ద కొబ్బరి ఉత్పత్తిదారుగా భారత్ ఉందని పేర్కొన్నారు. ఈశాన్య ప్రాంతంలో అగర్ చెట్లు, కొండ ప్రాంతాల్లో బాదం, వాల్‌నట్స్, పైన్ గింజల పంటలకు మద్దతు ఇవ్వనున్నట్లు తెలిపారు.

జీడిపప్పు, కోకో ఉత్పత్తి కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రాసెసిం గ్‌లో స్వయం సమృద్ధిగా మార్చడం, ఎగుమ తి పోటీతత్వాన్ని పెంచడం, ప్రీమియం గ్లోబ ల్ బ్రాండ్‌లుగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది.  ఇక కొండ ప్రాంతాల్లోని పురాతన తోటల పునరుజ్జీవనానికి కేంద్రం తోడ్పాటు అందించనుంది. ఇక తెండు ఆకులకు ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ (టీసీఎస్)ను 2 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఈ చర్యలతో రైతు లు, మత్స్యకారులకు పన్ను ఆదా కావడంతో పాటు పెద్ద ఎత్తున నికర లాభాలు చేకూర్చనున్నాయని తెలిపారు. సమ్మిళిత గ్రామీణ వృద్ధిని పెంపొందించే బలమైన సహకార సంస్థలు, స్పష్టమైన నిబంధనలు తీసుకురానున్నామన్నారు. చేపల వనరులను సమర్థవంతంగా సేకరించడం ద్వారా మత్స్యకారులు ప్రయోజనం పొందనున్నారు.

వీబీ జీ రామ్ జీకి పెద్ద పీట

ఈసారి బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధికి రూ. 2,73,108 కోట్లు కేటాయించినట్లు సీతారామన్ తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, గ్రామీణ ఉపాధే లక్ష్యంగా బడ్జెట్‌లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయించినట్లు తెలిపారు. యూపీఏ హాయంలోని మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీనరేగా) స్థానంలో తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్‌గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ (వీబీ జీ రామ్ జీ) పథకానికి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది.

వీబీ జీ రామ్ జీ కోసం బడ్జెట్‌లో 95వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. సంవత్సరానికి 125 రోజలు పనిదినాలు కల్పించేందుకు వీబీ జీ రామ్ జీ పథకం ఉపయోగపడనుంది. 2026 సంవత్సరానికి ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) కోసం రూ. 19 వేల కోట్లు, దీన్‌దయాల్ అంత్యోదయ యోజన గ్రామీణ జీవనోపాధి మిషన్ కోసం రూ. 19,200 కోట్లు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై కోసం ఈ సంవత్సరం బడ్జెట్‌లో రూ. 54,916.70 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. 2026 సంవత్సరానికి భూ వనరుల విభాగానికి 2,654.33 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 

మత్స్య సంపదకు ౫౦౦ చెరువులు

మత్య్స పరిశ్రమకు సంబంధించి మత్య్సకారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఎక్సూక్లూజివ్ ఎకనమిక్ జోన్స్ (ఈఈజెడ్), సముద్రాల్లో  పట్టుకునే చేపలపై ఎటువంటి సుంకం విధించబోమని కేంద్రం స్పష్టం చేసింది.  భారతదేశ ప్రాదేశిక జలాలతో పాటు సముద్ర వనరుల ఆర్థిక విలువలను మత్స్యకారులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి కేంద్ర మద్దతు ఇవ్వడమే ఈ చర్యల లక్ష్యమని తెలిపారు.

గత ఆర్థిక సంవత్సరంలో ఎగమతి చేయబడిన సముద్ర ఆహార ఉత్పత్తుల ఎఫ్‌వోబీ విలువలో నిర్దిష్ట ఇన్‌పుట్‌ల సుంక రహిత దిగుమతుల విలువ పరిమితిని 1 నుంచి 3 శాతానికి పెంచుతున్నట్లు సీతారామన్ స్పష్టం చేశారు. లోతట్టు మత్స్య సంపదను ప్రోత్సహించేందుకు 500 చెరువులు, అమృత్ సరోవర్లను సమగ్రాభివృద్ధి చేపట్టడంతో పాటు, తీర ప్రాంతాల్లో గొలుసుకట్టును బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మార్కెట్ సంబంధాలను బలోపేతం చేయడానికి స్టార్టప్స్ , చేపల పెంపకందారులతో తరచూ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది.

భారత్‌లో గ్లోబల్ బిగ్ క్యాట్ సదస్సు

బడ్జెట్ సందర్భంగా నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పులుల సంరక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది భారత్‌లో తొలిసారి గ్లోబల్ బిగ్ క్యాట్ సదస్సును నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సదస్సుకు 95 దేశాల ప్రభుత్వాధినేతలు, మంత్రులు కలిసి ఒకచోట సమావేశమయ్యి పులుల సంరక్షణ, వాటి పరిరక్షణకు సంబంధించిన వ్యూహాలపై చర్చించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పులల సంరక్షణను బలోపేతం చేయడానికి ప్రపంచ దేశాల సహకారం లభిస్తుందనే కాంక్షతో ఈ శిఖరాగ్ర సమావేశం ఏర్పాటుకు ఒక అడుగులా పనిచేయనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పులులు, సింహాలు, చిరుతలు, మంచు చిరుతలు, జాగ్వార్‌లకు ఆవాలమైన దేశాల మధ్య సహకారాన్ని సులభతరం చేయడానికి గతేడాది అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ కార్యక్రమం జరిగినట్లు  గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యధిక పులుల జనాభాకు కేంద్రంగా ఉన్న భారత్‌లో ప్రాజెక్ట్ టైగర్‌తో పాటు చిరుతల పునరుజ్జీవం లాంటి కార్యక్రమాలు పులుల సంరక్షణకు కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. అంతేకాదు వన్యప్రాణుల సంరక్షణలో అంతర్జాతీయంగా నాయకత్వం వహించాలన్న భారత్ యొక్క అభిమతం కూడా నెరవేరేందుకు ఆస్కారముందని సీతారామన్ వెల్లడించారు. 

పర్వత శ్రేణుల అభివృద్ధి.. 

ఇక కేంద్ర బడ్జెట్ 2026 లో భాగంగా పర్వత శ్రేణుల అభివృద్ధి విషయమై నిర్మలా సీతా రామన్ స్పందించారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్‌లోని పర్వత శ్రేణులు, తూర్పు కనుమల్లోని అరకు లోయ, పశ్చిమ కనుమల్లో పర్యావరణ స్థిరమైన పర్వత మార్గాలను ‘ఎకో మౌంటేన్ రైల్’ పేరుతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. దీనికి అదనంగా ఒడిశా, కర్ణాటక, కేరళలో తాబేళ్ల గూడు ప్రదేశాలను కాపాడడంతో పాటు వాటి పరిరక్షణకు సంబంధించి అభివృద్ధి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.  దీనివల్ల పర్యాటకానికి ఊ తమివ్వడంతో పాటు స్థానికులకు ఉపాధి కల్పించేందుకు అవకాశముంటుందని తెలిపారు.