కన్నప్పలో విష్ణు కూతుళ్లు
హీరో విష్ణు మంచు నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. 2025, ఏప్రిల్ 25న విడుదల కానుంది. ముఖేశ్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంబంధించి ప్రతి సోమవారం ఓ అప్డేట్ ఇస్తామని మేకర్లు ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగానే విష్ణు మంచు కుమార్తెలు అరియానా మంచు, వివియానా మంచు ఫస్ట్‌లుక్‌లను విడుదల చేశారు. సోమవారం విష్ణు కవల తనయల పుట్టినరోజు కావడం యాదృచికం.
ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో పిల్లలిద్దరూ గిరిజన వేషధారణలో ఆకట్టుకుంటున్నారు. సినిమాలో శ్రీకాళహస్తి పురాణ కథ ప్రాముఖ్యతను చాటి చెప్పే పాటలో కనిపించనున్నారు. ఈ మేరకు విష్ణు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘పుట్టినరోజు సందర్భంగా నా కుమార్తెల ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ఈ క్షణంలో నా హృదయం గర్వంతో ఉప్పొంగుతోంది’ అని పేర్కొన్నారు. మరోవైపు ఈ విషయమై మోహన్ బాబు సైతం సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
“కన్నప్ప’తో నా మనవరాళ్లు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నందుకు ఆనందంగా ఉంది. నటనపై వాళ్లకు ఉన్న అభిరుచి చూసి నాకెంతో గర్వంగా అనిపించింది. వారికి మంచి గుర్తింపు రావాలని.. ఎంతో మందిలో స్ఫూర్తి నింపాలని కోరుకుంటున్నా” అని పేర్కొన్నారు. అయితే విష్ణు కుమార్తెలు.. ఆయన నటించిన ‘జిన్నా’ చిత్రంలో ‘ఫ్రెండ్‌షిప్’ పాటను ఆలపించారు. నటించడం మాత్రం ఇదే తొలిసారి. మోహన్‌బాబు ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. మంచు విష్ణు తిన్నడు పాత్రలో నటిస్తుండగా.. ‘బాల తిన్నడు’గా ఆయన కొడుకు అవ్రామ్ పోషిస్తున్నారు.






