వివేక్ వెంకటస్వామికి మంత్రివర్గంలో చోటుపై హర్షం
సంస్థాన్ నారాయణపూర్ (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సామాజిక న్యాయం పాటించి మంత్రివర్గ విస్తరణలో ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి(MLA Gaddam Vivek Venkataswamy)కి మంత్రి పదవి ఇవ్వడాన్ని స్వాగతిస్తూ నారాయణపురం మండల మాల మహానాడు ప్రధాన కార్యదర్శి కట్ట గాలిభ్ రోషన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మాలలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించడాన్ని స్వాగతిస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణలో మాల జాతి సామాజిక వర్గానికి పెద్దదిక్కై ముందుండి సామాజిక వర్గాన్ని చైతన్యపరిచి, మాలలకు అండగా నిలిచిన వివేక్ వెంకటస్వామి రానున్న రోజుల్లో మాల సామాజికవర్గన్ని విద్య, వైద్యం, రాజకీయాల్లో అండగా నిలవాలని కోరారు. ప్రభుత్వంలో ఉండి కూడా మాల జాతికి అన్యాయం జరిగిన రోజున ప్రశ్నించే గొంతుకై, యుద్ధానికి సిద్ధమై లక్షలాది మంది మాలలను ఏకతాటిపైకి తెచ్చిన గొప్ప నేత వివేక్ వెంకటస్వామి అని గుర్తు చేశారు.
త్వరలోనే మంత్రి గడ్డం వివేక్ ని మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన సభను సంస్ధాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఏర్పాటు చేసి ఘనంగా సన్మానం చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో మాలలకు జరిగిన అన్యాయాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకు వెళ్లి అర్హులకు, ఇండ్లు లేని మాలలకు ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా ఉద్యమిస్తామని, న్యాయం జరిగే వరకు పోరాడుతామని తెలిపారు.






