31 July, 2026 | 4:40 PM

ఓటెత్తిన పట్టభద్రులు

28-05-2024 01:49 AM

ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్

మొత్తం 4,63,839 మంది ఓటర్లకు 3,18,445 మంది ఓటు హక్కు వినియోగం  

నార్కట్‌పల్లిలో స్వతంత్ర అభ్యర్థిపై దాడి.. పోలీసులకు ఫిర్యాదు

హనుమకొండలో ఓటర్లకు డబ్బు పంచుతూ పట్టుబడిన బీఆర్‌ఎస్ నాయకుడు

68.65% : పోలింగ్ నమోదు

హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి): వరంగల్-నల్లగొండ-ఖమ్మం ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉండగా మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. పట్ట భద్రులంతా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. 4 గంటలలోపు క్యూలైన్లలో ఉన్నవారికి ఎన్నికల అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు.

మొత్తం 4,63,839 మంది ఓటర్లకు 3,18,445 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటలకు 11.34 పోలింగ్ శాతం, మధ్యాహ్నం 12 గంటలకు 29.30 శాతం, మధ్యాహ్నం 2 గంటలకు 49.53 శాతం పోలింగ్ నమోదైంది. ఇలా సాయంత్రం పోలింగ్ ముగిసే నాటికి 68.65 శాతం పోలింగ్ నమోదైంది. ఉప ఎన్నికకు రిటర్నింగ్ అధికారి(ఆర్వో)గా నల్లగొండ కలెక్టర్ దాసరి హరిచందన పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. కొత్తగా ఓటు హక్కు వచ్చిన పట్టభద్రులు ఉత్సాహంగా తొలిసారి ఓటు వేశారు. ఓటింగ్ తర్వాత అన్నిజిల్లాల నుంచి బ్యాలెట్ బాక్సులు భద్రతా ఏర్పాట్ల మధ్య  పోలీసులు, ఎన్నికల అధికారులు నల్లగొండలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంకు తరలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ౧౪౪ సెక్షన్ అమలైంది.

ఓటు వేసిన ప్రముఖులు..

వరంగల్‌లో పోలింగ్ కేంద్రాలను బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్‌రెడ్డి హనుమకొండలోని పింగళి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న యాదాద్రి భువనగిరి జిల్లా  తుర్కపల్లి మండల కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి, మఠంపల్లి మండల కేంద్రంలో నల్లగొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, వరంగల్ కాశీబుగ్గలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, నల్లగొండలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన, హనుమకొండ  తేజస్వీ పాఠశాలలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జనగామలోని ప్రిస్టన్ కళాశాలలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వరంగల్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ , భద్రాచలంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కొత్తగూడెంలో ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి  కూనంనేని సాంబశివరావు, యాదగిరి గుట్ట మండల కేంద్రంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, దమ్మపేటలో అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ ఓటింగ్‌లో పాల్గొన్నారు.

ప్రశాంతంగా పోలింగ్..

నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 12 జిల్లాల పరిధిలోని మొత్తం 34 అసెంబ్లీ స్థానాల్లో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. ఎన్నికలకు సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. ఎన్నికల సిబ్బంది, పోలీసుల సహకారంతోనే ఎన్నిక విజయవంతమైంది. 

 దాసరి హరిచందన,

ఎన్నికల రిటర్నింగ్ అధికారి,

నల్లగొండ కలెక్టర్

జిల్లాలవారీగా ఓటింగ్ శాతం ఇలా

జిల్లా మొత్తం ఓటర్లు పోలైన ఓట్లు ఓటింగ్ శాతం 

సిద్దిపేట 4,679 3,267 69.82

జనగాం 23,419 16,767 71.60

హనుమకొండ 43,729 31,141 71.21

వరంగల్ 43,812 31,036 70.84

మహబూబాబాద్ 34,933 24,285 69.52

ములుగు 10,299 7,677 74.54

భూపాలపల్లి 12,535 8669 69.16

భద్రాద్రి కొత్తగూడెం 40,106 27,249 68.08

ఖమ్మం 83,879 54,973 65.64

యాదాద్రి భువనగిరి 34,080 22,988 67.45

సూర్యాపేట 51,149 36,367 70.62

నల్లగొండ 80,871 53,981 66.75

మొత్తం ఓటర్లు 4,63,839 3,18,445 68.65