31 July, 2026 | 4:01 PM

వైభవంగా 10 ఏళ్ల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు ఉత్సవాలు

28-05-2024 01:51 AM

రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పులు 

తెలంగాణ ఉద్యమం ప్రతిబింబించేలా ఉండాలి 

చిత్రకారుడు రుద్ర రాజేశంకు సీఎం సూచనలు 

జయ జయహే గేయానికి తుది మెరుగులు 

జూన్ 2న ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ 

రాష్ట్ర అవతరణ వేడుకలకు చురుగ్గా ఏర్పాట్లు

పరేడ్‌గ్రౌండ్‌లో ఏర్పాట్లు పరిశీలించిన సీఎస్ శాంతికుమారి

హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి): రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నది. అదే సమయంలో రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు చేస్తూ కొత్త చిహ్నానికి తుది మెరుగుతు దిద్దుతున్నది. ప్రముఖ చిత్రకారుడు రుద్ర రాజేశం బృందం అధికార చిహ్నాన్ని తీర్చి దిద్దుతోంది. చిహ్నంలో మార్పులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం రుద్రరాజేశంతో చర్చించారు.

సుమారు 12 నమూనాలను రూపొందించగా, వాటిలో ఒకదాన్ని సీఎం ఫైనల్ చేశారు. ఎంపికచేసిన దానిలో కొన్ని మార్పులు సూచించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూపొందించిన చిహ్నంలో చార్మినార్, కాకతీయ తోరణం ఉన్నాయి. అవి రాజరికాన్ని తలపిస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి గతంలోనే విమర్శించారు. వాటి స్థానంలో ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమాన్ని ప్రతి బింబించే చిహ్నాలను ఉంచాలని భావిస్తున్నారు.

రాష్ట్ర గేయంగా ఖరారు చేసిన జయ జయహే తెలంగాణకు తుది మెరుగులు దాదాపు పూర్తయ్యాయి. సీఎం సూచనలతో భావం, భావోద్వేగం మారకుండా రెండు నిమిషాల నిడివికి కవి అందెశ్రీ మార్పులు చేశారు. సీఎం, అందెశ్రీ సూచనలకు అనుగుణంగా సంగీత దర్శకుండు ఎంఎం కీరవాణి స్వరకల్పన చేశారు. వీటితో పాటు తెలంగాణ తల్లి రూపం కూడా కొలిక్కి వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తెలంగాణ కోడ్‌గా టీఎస్ స్థానంలో టీజీని అమలు చేస్తున్నారు. 

వైభవంగా అవతరణ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. జూన్ 2న ఉదయం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమర వీరులకు సీఎం రేవంత్‌రెడ్డి నివాళులర్పించి, అక్కడినుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు.

అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో శాంతికుమారి సోమవారం సమీక్ష నిర్వహించారు. పరేడ్ గ్రౌండ్ కార్యక్రమంలో సీఎం రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించి, ప్రజలకు సందేశం ఇస్తారని తెలిపారు. సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్యాంక్‌బండ్‌పై వివిధ కళారూపాలతో పెద్ద ఎత్తున కార్నివాల్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శిక్షణ పొందుతున్న 5 వేల మంది పోలీస్ అధికారులు బ్యాండ్‌తో ఈ ప్రదర్శనలో పాల్గొంటారని చెప్పారు. 

ట్యాంక్‌బండ్‌పై ప్రత్యేక స్టాళ్లు

ట్యాంక్‌బండ్‌పై దాదాపు 80 స్టాళ్లను ఏర్పాటు చేసి హస్తకళలు, చేనేత, స్వయం సహాక బృందాలు తయారు చేసిన పలు వస్తువులతోపాటు నగరంలోని పేరొందిన హోటళ్ల ఆధ్వర్యంలో ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే చిన్నారులకు పలు క్రీడలతో కూడిన వినోదశాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్నివాల్‌కు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశమున్నందున ఏ విధమైన ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

ట్యాంక్‌బండ్‌పై సాంస్కృతిక ప్రదర్శనల అతనంతరం ఆకర్షణీయమైన పటాసుల ప్రదర్శనతోపాటు లేజర్‌షో ఉంటుందని చెప్పారు. రాష్ట్ర అవతరణ సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని సూచించారు. సమీక్షా సమావేశంలో డీజీపీ రవి గుప్తా, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శులు దానకిషోర్, శైలజా రామయ్యర్, శ్రీనివాసరాజు, జీఏడీ కార్యదర్శి రఘునందన్‌రావు, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్

రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లను సీఎస్ శాంతికుమారి సోమవారం పరిశీలించారు. పరేడ్ గ్రౌండ్‌ను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. సభా ప్రాంగణంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా కార్యక్రమం సజావుగా సాగేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. స్టేజ్ ఏర్పాట్లు, బారికేడింగ్, విద్యుత్, మంచినీటి సరఫరా, మైక్ సిస్టం, ఎల్‌ఈడీ ్రస్క్రీన్ల ఏర్పాట్ల వివరాలను అడిగి ఆమె తెలుసుకున్నారు. బందోబస్తు, ట్రాఫిక్, పార్కింగ్, వీఐపీ రాకపోకలకు అంతరాయం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.