31 July, 2026 | 5:26 PM

కలగా మిగిలిన కాళోజీ కళాక్షేత్రం

28-05-2024 01:44 AM

దశాబ్దమైనా పూర్తికాని భవనం 

నత్తనడక నిర్మాణ పనులు

నిధుల విడుదలలో గత ప్రభుత్వ నిర్లక్ష్యం 

కాంట్రాక్టర్లు మారినా పురోగతి శూన్యం

అసాంఘిక పనులకు అడ్డాగా మారిన వైనం

హనుమకొండ, మే 27 (విజయక్రాంతి): ‘ప్రజాకవి కాళోజీ విశ్వకవి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన ప్రభావం నాపై ఎంతగానో ఉంది. ఆయన స్ఫూర్తికి చిహ్నంగా వరంగల్ గడ్డపై అద్భుతమైన భవనాన్ని నిర్మించాలని నిర్ణయించాం. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిని తలదన్నేలా వరం గల్‌లో కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మిస్తాం. ఇం దుకు హనుమకొండలోని హయగ్రీవాచారి మైదానంలో మూడున్నర ఎకరాల స్థలం కేటాయించాం. వెంటనే పనులు ప్రారంభించేలా రూ.12 కోట్లు విడుదల చేస్తున్నాం.

రెండేళ్లలో భవనాన్ని పూర్తి చేసి వరంగల్ ప్రజలకు అందుబాటులోకి తెస్తాం’ అని 2014 సెప్టెంబర్ 9న భవనం శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ఇది. శంకుస్థాపన జరిగి పదేళ్లు కావస్తున్నా భవన నిర్మాణ పనులు అసంపూర్తిగానే ఉండటం గమనార్హం.  ఎంతో అట్టహాసంగా మొదలైన కాళోజీ కళాక్షేత్రం భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.

రెండేళ్లలో పూర్తి చేస్తానన్న నిర్మాణం దశాబ్దమైనా పూర్తికాకపోవడం విమర్శలకు తావిస్తోంది. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భవన నిర్మాణ పనులు ప్రారంభించింది. కానీ సకాలంలో నిధులు విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహించిందని, అందుకే ఆలస్యమవుతోందని ఆరోపణలున్నాయి. కాంట్రాక్టర్లు, నిర్మాణ సంస్థలు మారుతున్నప్పటికీ పనుల్లో మాత్రం ఆశించిన మేరకు పురోగతి కనిపించడం లేదనే విమర్శలున్నాయి. దీంతో కాళోజీ అభిమానులు, సాహితీ ప్రియులు, కళాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఆరంభ శూరత్వం..!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అప్పటి సీఎం కేసీఆర్ వరంగల్‌కు చెందిన ప్రజాకవి కాళోజీ స్మారకార్థం ఆయన పేరిట భవనాన్ని నిర్మించాలని తలపెట్టారు. హయాగ్రీవాచారి మైదానంలో మూడున్నర ఎకరాల స్థలాన్ని కేటాయించారు. స్వయంగా కేసీఆర్ ఆ భవనానికి శంకుస్థాపన చేశారు. ఆ భవన నిర్మాణానికి రూ.50 కోట్లు బడ్జెట్‌లో కేటాయించి తొలి విడత రూ.15 కోట్లు విడుదల చేశారు. నాలుగు అంతస్తుల భవనంలో కాళోజీ మ్యూజియం, లైబ్రరీ, ఆఫీస్, లాబీతో పాటు వెయ్యి మందికి పైగా సమావేశం నిర్వహించుకునేందుకు ఆడిటోరియం నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. రెండేళ్లలో భవనాన్ని పూర్తి చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు అంకితమిస్తామన్నారు. కానీ కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా పనులు పూర్తికాలేదు. 

ఎందుకీ నిర్లక్ష్యం?

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళోజీ కళాక్షేత్రం భవనాన్ని పూర్తి చేయడంలో ఆలస్యానికి నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు ఉన్నాయి. మొదట్లో భవన నిర్మాణానికి రూ.33 కోట్లతో టెండర్లు ఆహ్వానిం చింది. ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్న హైదరాబాద్ కంపెనీ.. వరంగల్‌కు చెందిన మరో కాంట్రాక్టర్‌కు భవన నిర్మాణ పనులు అప్పగించింది. మొదట్లో ప్రభుత్వం రూ.12 కోట్ల నిధులు విడుదల చేయగా పనులు చకాచకా కొనసాగాయి. కానీ తర్వాత బిల్లుల చెల్లింపులో జాప్యం చేసింది. దీంతో ఆ కాంట్రాక్టర్ పనులు చేయలేనంటూ చేతులెత్తేశాడు.

ఈ మేరకు నిర్మాణ బాధ్యతలు టూరిజం శాఖ చేపట్టింది. కొంతకాలం సజావుగా పనులు సాగినప్పటికీ బడ్జెట్ లేని కారణంగా టూరిజం డిపార్ట్‌మెంట్ సైతం నో చెప్పింది. ఆ తర్వాత కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా)కు కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులు అప్పగించింది అప్పటి సర్కార్. దీంతో పనులు ప్రారంభించి గత ఏడాది సెప్టెంబర్‌లోనే భవనాన్ని ప్రారంభిస్తామని హడావుడి చేసింది. అంతేకాకుండా అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా కాళోజీ భవనాన్ని ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. కానీ భవనం అసంపూర్తిగా ఉన్న కారణంగా ఆ కార్యక్రమాన్ని రద్దు చేసింది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది.  

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా..

కాళోజీ కళాక్షేత్రం భవనం నిర్మాణ పను లు అసంపూర్తిగా మిగలడంతో ఆ ప్రాంతం అసాంఘిక కార్యాకలాపాలకు అడ్డాగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాత్రి అయితే ఆయా పరిసరాలు మందు బాబులతో నిండిపోతున్నట్లు తెలుస్తోంది. భవనం పరిసరాలు నిర్మానుష్యంగా ఉండటంతో కొంతమంది యువకులు వారి వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం భవన నిర్మాణ పనులపై దృష్టి సారించాలని సాహితీ ప్రియులు కోరుతున్నారు. అంతేగాకుండా త్వరితగతిన నిధులు మంజూరు చేసి కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేసి ఓరుగల్లు సాహితీ ప్రియులు, కళాకారులకు అందుబాటులోకి తేవాలని కాళోజీ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.