ఆరు జిల్లాల్లో ఓటింగ్ శాతం ‘సున్నా’

20-04-2024 12:28:09 AM

l నాగాలాండ్‌లో గడప దాటని ఓటర్లు

కొహిమా, ఏప్రిల్ 19: నాగాలాండ్‌కు స్వయం ప్రతిపత్తి కావాలనే డిమాండ్‌తో ఈస్ట్రన్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ (ఈఎన్‌పీఓ) ఎన్నికలను బహిష్కరించాలని ఇచ్చిన పిలుపు మేరకు శనివారం ఆ రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు చెందిన ఓటర్లు గడప దాటలేదు. ఆయా జిల్లాల్లో ఓటింగ్‌శాతం ‘సున్నా’గా నమోదైంది. దీంతో ఎన్నికల సంఘం (ఈసీ) సీరియస్‌గా స్పందించింది. ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరికీ ఓటు హక్కు ఉంటుందని, ఆ హక్కును అడ్డుకునేందుకు యత్నించడం చట్టరీత్యా నేరమని, పోలింగ్‌ను అడ్డుకుంటున్న వారిపై సెక్షన్ 17సీ ప్రకారం కేసులు పెడతామని హెచ్చరించింది.

దీనిపై ఈఎన్‌పీఓ స్పందిస్తూ.. తూర్పు నాగాలాండ్ ప్రాంతంలో అత్యావశ్యక పరిస్థతులు ఉన్నాయని, కల్లోలాలు లేని, అసాంఘిక శక్తులు లేని నాగాలాండ్‌ను సాధించడం తమ లక్ష్యమని తెలిపింది. ప్రజలు ఓటు వేయకూడదని స్వచ్ఛందంగా  భావిస్తున్నా రని, అలాంటి వారిపై కేసులు పెట్టడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఈసీ ఏదైనా అపార్థం చేసుకున్నా, లేదా తప్పుగా భావించినా స్పష్టత ఇచ్చేందుకు ఈఎన్‌పీఓ సిద్ధంగా ఉందని ప్రకటించింది. ఓటు వేయకుండా ప్రజలు తమ ఆకాంక్షలను తెలియపరుస్తున్నారే తప్ప, అది ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించే పని కాదని అభిప్రాయపడింది.