25 July, 2026 | 2:36 AM

ఓటర్లు బీ అలర్ట్..

25-07-2026 01:29 AM

సర్ గడువు పది రోజులే..

రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి

ఫారం సమర్పించకపోతే ఓటరు జాబితా నుంచి పేరు తొలగింపు ముప్పు

రంగారెడ్డి, జులై 24(విజయక్రాంతి): ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వంటి ఓటు హక్కును కాపాడుకునేందుకు ఓటర్లందరూ తక్షణమే స్పందించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సి. నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు.

భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ముగిసేందుకు ఇంకా 10 రోజులు మాత్రమే సమయం ఉందనగా, అర్హులైన ప్రతి ఓటరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.మంగళవారం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి అర్హుడైన ఓటరు తమ ఎన్యూమరేషన్ ఫారాన్ని నిశితంగా పరిశీలించి, పూర్తి చేసి, సంతకం సేకరించిన అనంతరం వెంటనే సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్కు అందజేయాలని సూచించారు.

సమర్పించకపోతే ఓటు తొలగింపు ముప్పు

ఈ ప్రక్రియ ద్వారా ఓటరు పేరు, చిరునామా, కుటుంబ వివరాలను క్షేత్రస్థాయిలో సరిచూసి పారదర్శకమైన తుది ఓటరు జాబితాను రూపొందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. నిబంధనల ప్రకారం గడువులోగా ఫారం సమర్పించని వారి పేర్లను ఓటరు జాబితా నుండి తొలగించే అవకాశం ఉందనగా, ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.ఒక్కసారి జాబితా నుంచి పేరు తొలగిస్తే, మళ్లీ నమోదు చేసుకోవడానికి సుదీర్ఘమైన అదనపు ప్రక్రియ ఎదురుకావడమే కాకుండా, రాబోయే ఎన్నికల్లో అమూల్యమైన ఓటు వేసే అవకాశాన్ని కోల్పోతారని హెచ్చరించారు.

జిల్లాలో నియోజకవర్గాల వారీ పురోగతి..

జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 57.70% ఎన్యూమరేషన్ నమోదైంది.గ్రామీణ నియోజకవర్గాల్లో ప్రజల నుంచి మెరుగైన స్పందన కనిపిస్తోంది.పట్టణ ప్రాంతాల్లో నమోదు ప్రక్రియ మరింత వేగం పుంజుకోవాల్సి ఉంది.పట్టణ ప్రాంత ప్రజలు, యువత ముందుకు వచ్చి తమ వివరాలను వెంటనే నమోదు చేయించుకోవాలని, ప్రజాస్వామ్య బలోపేతానికి ఎన్యూమరేషన్ అత్యంత కీలకమైన మెట్టు.

ఓటుహక్కు ప్రతి  పౌరుడి బాధ్యత 

ఓటు కేవలం హక్కు మాత్రమే కాదని ప్రతి పౌరుడు బాధ్యత అని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి మరోసారి గుర్తు చేశారు.చివరి క్షణం వరకు వేచి చూడకుండా ఈ రోజే మీ ఇంటి ఓటర్ల వివరాలు సరిచూసుకుని బీఎల్వోలకు సమర్పించాలన్నారు.ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎన్యూమరేషన్ ఫారాలను వెంటనే బీఎల్వోలకు అందజేయాలి.ఇంకా కేవలం గడువు 10 రోజులు మాత్రమే సమయం ఉంది. రంగారెడ్డి జిల్లా ప్రస్తుతం సర్ 57.70% నమోదు పూర్తి అయింది.

 కలెక్టర్ నారాయణ రెడ్డి 

జిల్లాలో నమోదైన సర్ ప్రక్రియ శాతం

1)ఇబ్రహీంపట్నం  66.31%       

2)శేరిలింగంపల్లి  50.88%

3)ఎల్.బి. నగర్    45.95%      

4)చేవెళ్ల          76.37%

5)మహేశ్వరం      50.18%      ‘ 

6)కల్వకుర్తి        83.84%

7)రాజేంద్రనగర్   51.94%      

8)షాద్నగర్        81.82%