యుద్ధమూ- శాంతి!
పాకిస్థాన్ ఉగ్రమూకలపై దాడులు ఏక లక్ష్యంతో సాగాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అవి యుద్ధానికి దారితీయవద్దని భారత్ భావించింది. జనావాసాలు, మిలటరీ స్థావరాలు లక్ష్యంగా పాకిస్థాన్ సైన్యం ప్రతిదాడులు చేసింది. భారత సైన్యం కూడా అందుకు గట్టిగానే బదులిచ్చింది. ‘ఆపరేషన్ సిందూర్’తో జరిగింది ఇది. కాల్పుల విరమణకు పాకిస్థాన్ ముందుకువచ్చింది. భారత్ అంగీకరించింది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత దాయాది దేశంపై భారత్ యుద్ధం చేయాలనే కోపోద్రిక్తమైన ఆలోచన సగటు భారతీయుడిలో ప్రస్ఫుటంగా కనిపించింది. ‘ఆపరేషన్ సిందూర్’ పరిణామాలతో పాక్ వైమానిక స్థావరాలపై కూడా భారత్ వైమానిక దళం విజయవంతంగా దాడి చేయడం భారతీయులకు ఆనందం కలిగించింది. ఇక్కడితో ఆగవద్దు.. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)నైనా తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న భావన సైతం బలపడింది.
కాల్పుల విరమణకు భారత్ అంగీకరించడం సగటు భారతీయుడికి సుతారమూ నచ్చలేదు. ‘ఆపరేషన్ సిందూర్’కు యుద్ధానికి మధ్య తేడా వుందనే విషయం మరుగునపడింది. పాక్ అంతు తేల్చాలన్న ఆవేశం కట్టలు తెంచుకుంది. సోషల్ మీడియాకు కూడా ప్రధాని మోదీ కాల్పుల విరమణకు అంగీకరించడం నచ్చలేదు.
పీవోకేను పాకిస్థాన్ నుంచి లాగేసుకోవాలన్న అభిప్రాయాలకే సోషల్ మీడియా ప్రాధాన్యమిస్తోంది. పాకిస్థాన్‌పై విజయం సాధించామని, ‘ఆపరేషన్ సిందూర్’ ఫలప్రదమైందని భారత నాయకత్వం చెబుతున్న మాటలు అంతగా దేశ ప్రజలను ఆనందపరుస్తున్నట్టుగా కనిపించడం లేదు. పరిణామాలు ఎలావున్నా, పాకిస్థాన్‌పై యుద్ధం చేయాల్సిందేనన్న విపరీత దేశభక్తి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
ఈ సందర్భంలో మోదీ నాయకత్వాన్ని విమర్శస్తున్న గొంతుకలూ వినిపిస్తున్నాయి. ఇక పాకిస్థాన్‌తో చర్చలంటూ జరిగితే ఉగ్రవాద నిర్మూలన, పీఓకే పైనే, పీవోకేను పాకిస్థాన్ ఎప్పుడు ఖాళీ చేస్తుంది? అనే అంశాలపైనే తాము చర్చలకు అంగీకరిస్తామన్న భారత నాయకత్వంలో వచ్చిన విధాన మార్పును ప్రస్తుతానికి స్వాగతించలేమా? అనేది ప్రశ్నగానే వుంది.
కాల్పుల విరమణలో పాకిస్థాన్‌కు ఎందుకు మరో అవకాశమివ్వాలి? అమెరికా మధ్యవర్తిత్వాన్ని మనం ఎందుకు అంగీకరించాలి? భారత్‌కు సీమాంతర ఉగ్రవాద సమస్యను ఇంకా ఎందుకు కొనసాగనివ్వాలి? పాకిస్థాన్ వంటి ‘రోగ్ నేషన్’ ముందు భారత్ శాంతి విధానాలు ఫలిస్తాయా? అనే ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి.
కాల్పుల విరమణకు అంగీకరించడం వెనుక కారణాలు అమెరికా మధ్యవర్తిత్వం వల్లనే భారత్ , పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ చేసిన ప్రకటనపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి దేశ ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది.
ఇదే ఊపులో పీవోకేపై భారత్ దాడులు జరిపితే అది పాకిస్థాన్‌పై యుద్ధమవుతుంది. ఇప్పుడు భారత్‌కు మద్దతిస్తున్న దేశాలు అప్పుడు భారత్‌ను వ్యతిరేకిస్తాయి. పరిస్థితులు ఎంత సత్వరంగా మారుతాయో ఎవరూ ఊహించలేరు. అంతర్జాతీయంగా దాయాది దేశాన్ని ఒంటరి చేయడం, తప్పిదాలకు తగిన మూల్యం చెల్లించుకునేలా చేయడమొక్కటే భారత్ ముందున్న మార్గం.






