6 March, 2026 | 2:36 AM

ప్రాథమిక పాఠశాల కుటుంబం

15-05-2025 12:00 AM

నేడు ప్రపంచ కుటుంబ దినోత్సవం :

పుట్టిన ప్రతిమనిషి ప్రాథమిక పాఠశాల కుటుంబం. తల్లి లాలన, తండ్రి పాలనలోనే పిల్లలు ఒక్కొక్కటి నేర్చుకుంటారు. అందుకే తల్లిదండ్రులే తొలి ఉపాధ్యాయులు. అలాగే అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముల్లే తొలి స్నేహితులు. ఒక సమాజం బాగుండా లంటే, ఆయా ప్రాంతంలోని కుటుంబాలు సుఖశాంతులతో వర్ధిల్లాలి. కు టుంబ విలువలే ఒక సమాజాన్ని ముందుకు నడిపిస్తాయి.

అందుకే ఐక్యరాజ్యసమితి 1994లో మొదటి సారి ప్రపంచ కుటుంబ దినోత్సవాన్ని ప్రకటించింది. ఏటా మే 15న కుటుంబ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించింది. అందుకు కారణం ఆ సంవత్సరంలో ప్రపంచంలో వేగవంతమైన మార్పులు వచ్చాయి. పట్టణీకరణ, వలసలు పెరిగాయి. దేశాలపై ఆర్థికపరమైన ఒత్తిళ్లు రెండింతలయ్యాయి.  ఈ మార్పుల నేపథ్యంలో కుటుంబ బలం, పరస్పర సహకారం, మద్దతు అవసరమని ఐక్యరాజ్యసమితి గుర్తించి ‘ఫ్యామిలీ డే’ను ప్రతిపాదించింది.

ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనిషికి అండగా నిలబడేది కుటుంబమే కాబట్టి.. ప్రతిఒక్కరూ కుటుంబం పట్ల ప్రేమతో, బాధ్యతతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేసింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా అనేక స్వచ్ఛంద సంస్థలు కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని వర్తమాన తరంతో పాటు భవిష్యత్తు తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో  కమ్యూనిటీలు వర్క్‌షాప్‌లు, సెమినార్లు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాయి.

ఇప్పుడు ప్రపంచమంతా డిజిటల్ యుగం నడుస్తున్నది. కారణాలేవైనప్పటికీ సాంకేతిక, వైద్య, సమాచార రంగాల్లో పనిచేస్తున్న వ్యక్తులు అనేక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. వారికి కుటుంబ సభ్యులే ఉండాలి. వారిని దగ్గరికి తీసుకోవాలి. కుటుంబ విలువలను ఒక్క ఈ తరానికే కాదు భవిష్యత్తు తరాలకు కూడా అందించాలి. ఈ ఏడాది నవంబర్‌లో ఖతార్‌లోని దోహాలో రెండో ప్రపంచ సామాజిక అభివృద్ధి శిఖరాగ్ర సదస్సు జరుగనున్నది. 

ఈ సదస్సుకు ప్రాతినిధ్యం వహించే ప్రతినిధులు ‘సుస్థిర అభివృద్ధికి కుటుంబ ఆధారిత విధానాలు’ అనే అంశంపై యావత్ ప్రపంచానికి సందేశమివ్వనున్నారు. ప్రస్తుతం వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యం పెరుగుతున్న క్రమంలో సదస్సుకు కుటుంబ బంధా లు, కుటుంబ సభ్యుల మధ్య మద్దతు అంశం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

నేడు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సందర్భంగా ఒక్కసారి ఐక్యరాజ్యసమితి ఎంపిక చేసిన ‘ఫ్యామిలీ డే’ చిహ్నం గురించి కూడా తెలుసుకుందామా.. చిహ్నం ఆకుపచ్చ వలయంతో ఉంటంది. దానిలో ఎరుపు గుండె. అంటే ఒక ఇల్లు అని అర్థం. ఆ ఇల్లు కుటుంబమని, అది సమాజానికి కేంద్ర బిందువు అనేది చిహ్నం ఉద్దేశం.

 డాక్టర్ కృష్ణకుమార్ వేపకొమ్మ, 

విశ్రాంత ప్రిన్సిపాల్, హైదరాబాద్