calender_icon.png 2 November, 2025 | 6:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిల్స్‌లో వార్!

02-11-2025 01:03:29 AM

ప్రచార యుద్ధంలో అమీతుమీ

హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలూ తమ ప్రచారాన్ని వేగవంతం చేశాయి. ఇటు అధికార పార్టీ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ రంగంలోకి దిగడంతో జూబ్లీహిల్స్ రాజకీయం వేడెక్కింది. ఆయా పార్టీల ఉధృతమైన ప్రచారంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వీధులన్నీ కిక్కిరిసిపోతున్నాయి.

ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి, కేటీఆర్ మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది. అయితే అధికార, ప్రతిపక్ష పార్టీలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2028లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కీలకంగా భావిస్తున్నాయి. ఎలాగైనా ఈ ఉప ఎన్నికను గెలిచి తీరాలనే పట్టుదలతో ఇరు పార్టీలు ప్రచార జోరును పెంచాయి.

గెలుపే లక్ష్యంగా అటు రేవంత్‌రెడ్డి, ఇటు కేటీఆర్ ప్రణాళికలను రచిస్తున్నా రు. రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్స్‌తో జూబ్లీహిల్స్ వీధులన్నీ రద్దీగా మారుతున్నాయి. ప్రచారంలో భాగంగా నాయకుల మధ్య వ్యంగ్యాస్త్రాలు, మాటల యుద్ధాలు, అభివృద్ధి హామీలు తారాస్థాయికి చేరుతున్నా యి. జూబ్లీహిల్స్ ప్రజలు మాత్రం ఈ రాజకీయ రణరంగాన్ని ఆసక్తిగా ఆస్వాదిస్తున్నారు. 

తెరపైకి అజారుద్దీన్..

ప్రస్తుతం జూబ్లీహిల్స్ ప్రచారం రసవత్తరంగా సాగుతున్న నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నాయకుడు అజారుద్దీన్ రేవంత్‌రెడ్డి టీమ్‌కు ‘స్టార్ పవర్’గా మారా రు. ఎన్నికల ప్రచారాల మధ్య అక్టోబర్ 31న అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అజారుద్దీన్ ఇప్పుడు నవీన్‌యాదవ్‌కు మద్దతుగా రేవంత్‌తో పాటు ప్రచారంలో పాల్గొంటున్నారు. సెలబ్రిటీ ప్రభావాన్ని రాజకీయ బలంతో మిళితం చేయాలన్న కాంగ్రెస్ వ్యూహానికి ఆయన ప్రతీకగా నిలుస్తున్నారు.

‘ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్, మంత్రిగా అజారుద్దీన్ ఎల్లప్పుడూ మీకు అండగా నిలుస్తారు’ అని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇస్తున్నారు. జూబ్లీహిల్స్ అభివృద్ధికి నవీన్ యాదవ్, అజారుద్దీన్ బాధ్యులుగా చూపుతున్నారు. అయితే ఈ ప్ర చారం రాజకీయ విమర్శలను దాటి వెళ్తోంది. ఘాటు విమర్శలు, పాత వైరం, ద్వేషం కూడా వెలుబుచ్చే అడ్డాగా మారుతోంది. రేవంత్‌రెడ్డి తన ప్రసంగాల్లో కేటీఆర్‌పై నేరుగా దాడి చేశారు. ‘పది సంవత్సరాలు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ జూబ్లీహిల్స్‌కి ఏం చేశారు,

ఒకసారి కూడా ప్రజా సమస్యలను వినడానికి రాలే దు. పాలకులు రాష్ట్రాన్ని దోచేశారు’ అంటూ మండిపడ్డారు. ‘కేటీఆర్, హరీశ్‌రావు ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టారు, కానీ అదే ఆటోలలో తిరిగి ప్రజలను మోసం చేస్తున్నారు’ అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ నేతలను ‘ముసుగు దొంగ లు, డ్రగ్స్, గంజాయి పెంచి పోషించిన వారు’ అని అభివర్ణించారు. తమ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను రౌడీ కాదు, బస్తీ ప్రజల రక్షకుడిగా ప్రస్తావించారు. ‘నవీన్ యాదవ్‌ను గెలిపిస్తే జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి అంటే ఏమిటో నేను చూపిస్తా’ అని హామీ ఇచ్చారు. 

రాజులా కాదు, సేవకుడిగా ఉండు..

సీఎం రేవంత్‌రెడ్డి చేసిన విమర్శలను కేటీఆర్ అంతే స్థాయిలో తిప్పి కొట్టారు. ‘మీరు రాజులా కాకుండా ప్రజల సేవకుడివని గుర్తుంచుకోవాలి’ అని సూచించారు. కేటీఆర్ శనివారం తన రోడ్‌షోకు ముందు జరిగిన జాయినింగ్ మీటింగ్‌లో రేవంత్‌పై ఘాటు విమర్శలు చేశారు. ‘రేవంత్ ప్రజలపై బెదిరింపులకు దిగుతున్నారు. అధికారమం టే ప్రజలదే’ అని ఆయన మరిచిపోయారని విమర్శించారు. ‘రేవంత్ రాజు లా ప్రవర్తిస్తున్నారు కానీ, అతను ప్రజల డబ్బు కాపాడే సంరక్షకుడు మాత్రమే’ అని కేటీఆర్ మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ లను అమలు చేయకుండా, ‘ఇందిరమ్మ రాజ్యం’ పేరుతో పేదల ఇళ్లు కూల్చివేస్తోందని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీసి, ‘హైడ్రా ఆపరేషన్స్’ పేరుతో పాలకులు పేదలను వేధిస్తు న్నారని, మాగంటి సునీత భర్త మరణంపై ఆమె విచారాన్ని ‘డ్రామా’గా ఎగతాళి చేయ డం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలంటే, జైత్రయాత్ర జూబ్లీహిల్స్ నుంచే ప్రారంభం కావాలి. నవంబర్ 11న కారు గుర్తుకు ఓటేసి, సునీతకు భారీ విజయాన్ని కట్టబెట్టాలి’ అని పిలుపునిచ్చారు. 

భవిష్యత్ కోసం పోరాటం..

ఈ ఉపఎన్నిక కేవలం జూబ్లీహిల్స్‌కు మాత్రమే పరిమితమయ్యే పోటీ కాదు. తెలంగాణ రాజకీయ భవిష్యత్‌కు లిట్మస్ టెస్ట్‌గా నిలుస్తోంది. జూబ్లీహిల్స్‌లో ఉన్న ఉన్నత వర్గాలు, బస్తీ ప్రజల వాతావరణం రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ పరిస్థితులను ప్రతిబింబిస్తుంది. దూకుడైన ప్రచారం ద్వారా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి మరింత బలం చేకూర్చాలని సీఎం రేవంత్‌రెడ్డి చూస్తుంటే, కాంగ్రెస్ ప్రభు త్వ పాలనపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకోవాలని బీఆర్‌ఎస్ పార్టీ చూస్తోంది.

దీంతోపాటు కాంగ్రెస్ వైఫల్యాలను ఆయుధంగా మార్చుకుని తెలంగాణకు బీఆర్‌ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష అని ప్రదర్శించాలనే వ్యూహాన్ని కేటీఆర్ అమలు చేస్తున్నారు. ఘాటైన మాటల తూటాల యుద్ధంలో బీఆర్‌ఎస్ నేతలను ‘బీఎండబ్ల్యూ ఎలైట్‌లు’గా ఎగతాళి చేస్తూ, ‘ఇప్పుడా బీఎండబ్ల్యూ వాళ్లు ఆటోలలో తిరుగుతున్నారు” అని రేవంత్‌రెడ్డి చమత్కరిం చారు. దానికి సమాధానంగా మాగంటి సునీతను ఎగతాళి చేసిన కాంగ్రెస్, సీఎం రేవంత్‌రెడ్డిపై మహిళలే ప్రతీకారం తీర్చుకోవాలని  కేటీఆర్ పిలుపునిచ్చారు. 

ప్రచారంలో మరింత దూకుడు..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ప్రచారంలో ఆయా పార్టీలు స్పీడ్ పెంచాయి. ఇందులో భాగంగా అక్టోబర్ 31న ప్రచార యాత్రలు మొదలుపెట్టాయి. ఉన్నత వర్గాల కాలనీలు, పేద బస్తీల కలగలిపి ఉన్న జూబ్లీహిల్స్‌లో ఇరువురు నేతలు బస్సులలో తిరుగుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున శుక్రవారం బోరబండ, శనివారం ఎర్రగడ్డ ప్రాంతాల్లో వరుసగా కార్నర్ మీటింగ్స్ నిర్వహించారు.

అదేస్థాయిలో కేటీఆర్ కూడా ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తరఫున శుక్రవారం షేక్‌పేట్‌లో, శనివారం రహ్మత్‌నగర్‌లో భారీ రోడ్ షోలు నిర్వహించారు. ఇరు పార్టీల, ఇరువురు నాయకుల హోరాహోరీ ప్రచారాలతో జూబ్లీహిల్స్ రాజకీయం యుద్ధరంగంగా మారింది. ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తల నినాదాల మధ్య ప్రజలు గందరగోళంలో పడుతున్నారు. కేటీఆర్ ఇప్పటికే నవంబర్ 9వ తేదీ వరకు తన ప్రచారానికి సంబంధించిన ప్రణాళికను ప్రకటించారు.

ఆదివారం యూసుఫ్‌గూడలో, సోమవారం బోరబండలో, మంగళవారం సోమాజిగూడ లో, ఈ నెల 5న వేణుగోపాల్ రావునగర్‌లో, 6న ఎర్రగడ్డలో రోడ్ షోలు నిర్వహించనున్నారు. అయితే బీఆర్‌ఎస్ ప్రచారాన్ని 8వ తేదీన షేక్‌పేట్, యూసుఫ్‌గూడ్, రెహమత్‌నగర్‌లో కేటీఆర్ ముగించనున్నారు. ఓటర్ల దృష్టిని ఆకర్షించి, అన్ని డివిజన్లలో ముందంజలో ఉంటూ గెలుపే లక్ష్యంగా కేటీఆర్ ప్రచారం సాగుతున్నది.