calender_icon.png 2 November, 2025 | 6:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తర డిస్కంలో స్కాం!

02-11-2025 01:18:13 AM

100 కోట్ల అక్రమ వడ్డింపులు

నిబంధనలు గాలికొదిలి.. గ్రామీణ విద్యుత్తు సబ్ స్టేషన్లలో స్కాడా ఏర్పాటుకు టెండర్లు 

గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పడని రింగ్ సిస్టం.. అయినా స్కాడా వైపే మొగ్గు 

ఇప్పటికే 500 సబ్‌స్టేషన్లకు సంబంధించిన స్కాడా సామగ్రిని స్టోర్స్‌లో డంప్ చేసిన కాంట్రాక్టు కంపెనీ.. మరో 1000 సబ్ స్టేషన్ల పనుల అప్పగింతకు రంగం సిద్ధం 

రూ. లక్ష లోపు ఉండే ప్యానల్ ధరను.. రూ. 1.74 లక్షలకు కోట్ చేసిన కంపెనీ 

తెరవెనుక ప్రముఖ కంపెనీ మాజీ ఉద్యోగి కీలక పాత్ర 

ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదుచేసిన మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ

* వడ్డించే వాడు మనోడైతే చాలు.. బంతిలో ఎక్కడ కూర్చు న్నా ఫరవాలేదనేది విద్యుత్తు సంస్థ ఉత్తర డిస్కం (ఉత్తర ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ-ఎన్‌పీడీసీఎల్) మరోసారి రుజువు చేసింది. విద్యుత్తు రంగ నిపుణులు కాదు, కూడదంటున్నా.. నాణ్యతలేని సాంకేతికతను ఏర్పాటు చేయాలని తలచారు.. సొంత విద్యుత్తు సంస్థలోని ఇంజనీర్లే అవసరం లేదన్న గ్రామీణ ప్రాంతంలో ఆ సాంకేతికతను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు..

అసలు గ్రామీణ ప్రాంతాల్లోని సబ్ స్టేషన్లలో పరిస్థితులపై ఎలాంటి అధ్యయనమూ చేయలేదు.. మల్టీ నేషనల్ కంపెనీల (ఎంఎన్‌సీ)లను కాదని.. ఏమాత్రం అనుభవం లేని, సాంకేతికత అందుబాటులోలేని, ఉత్పత్తి చేయలేని.. చిన్న కంపెనీకి రూ. వందల కోట్ల విలువైన టెండర్‌ను కట్టబెట్టారు. ఎందుకంటే.. అంతా వడ్డించేవాడు చూసుకుంటాడులే అనే నమ్మకం..

ఆ నమ్మకం నిజమైంది.. అనర్హతలను పట్టించుకోకుండా.. పరికరాలను, సాంకేతికతను ఉత్పత్తి చేయని కంపెనీకి ఏకంగా టెండర్‌నే కట్టబెట్టడం వెనుక.. కచ్చితంగా వారికి సంబంధించిన అధికారులే వడ్డించారనేది స్పష్టమవుతోంది. ఇదంతా ఎన్‌పీడీసీఎల్‌లో జరిగింది. ఇంకా జరుగుతోంది.. రూ.100 కోట్లు అక్రమంగా వడ్డించిన వివరాలు ఇలా ఉన్నాయి..!

హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): విద్యుత్తు సరఫరా, పంపిణీలో సబ్ స్టేషన్ల వారీగా, బ్రేకర్లవారీగా ఎలాంటి సాం కేతిక సమస్యలు తలెత్తినా.. క్షణాల్లో దానిని గుర్తించి పరిష్కరించడం తో పాటు, దీనికి సంబంధించిన సమాచారాన్ని (డాటా) ను పొందుపర్చడం, విశ్లేషించడం లాంటివి చేం దుకు వీలుగా స్కాడా (సూపర్‌వైజరీ కంట్రో ల్ అండ్ డాటా అక్విజిషన్ సిస్టం) వ్యవస్థలను నెలకొల్పుతా రు. అయితే ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని హైదరాబాద్ లాంటి నగరాల్లో 1999 నుంచే ఏర్పాటు చేశారు.

అప్పట్లో 120-127 సబ్‌స్టేషన్లలో మొదలుపెట్టి.. ఇప్పుడు 229 సబ్‌స్టేషన్లకు దానిని విస్తరించారు. అయితే స్కాడా లాంటి సాంకేతికతను ఏర్పాటుచేయడానికి ముఖ్యమైనది విద్యుత్తు రింగ్ ఏర్పాటు చేయడం. అంటే హైదరాబాద్‌లో ఒక ప్రాంతంలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడితే.. వెం టనే ఇంకో వైపు నుంచి విద్యుత్తును అం దించి సమస్యను పరిష్కరిస్తారు. హైదరాబాద్‌లో విద్యుత్తును ఒక రింగ్‌లాగా ఏర్పాటు చేశారు.

ఒక చోట విద్యుత్తు సరఫరాలో అం తరాయం కలిగితే స్కాడా సాంకేతిక వ్యవస్థ కారణంగా కేవలం 3 సెకన్లలోనే తిరిగి పునరుద్ధరిస్తారు. అప్పుడుకూడా విఫలమైతే 5 సెకన్లలో పునరుద్ధరణ జరుగుతుంది. అదికూడ ఫెయిల్ అయితే 7 సెకన్లలో విద్యుత్తును పునరుద్ధరిస్తారు. చివరగా అదికూడా విఫలమైతే.. మాన్యువల్‌గా సమస్యను కనుక్కుని పునరుద్ధరిస్తారు. అంటే స్కాడా వల్ల 3 సెకన్లు, 5 సెకన్లు, 7 సెకన్లలోనే విద్యుత్తును పునరుద్ధరించే అవకాశం ఉంటుంది.   

అధ్యయనం చేయకుండానే..

హైదరాబాద్‌లో విద్యుత్తు సరఫరాకు ఎలాంటి విఘాతం కలగకుండా ఏర్పాటుచేసిన రింగ్ వ్యవస్థ అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయలేదు. కానీ.. ఎన్‌పీడీసీఎల్ మాత్రం ఎందుకో.. డిస్కం పరిధిలోని సుమారు 1700 సబ్‌స్టేషన్ల పరిధిలో స్కాడా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకుంది. కనీసం స్కాడా ఏర్పాటుచేయడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయా, సాంకేతిక ఇబ్బందులు, విద్యుత్తు వ్యవస్థను బలోపేతం చేయడానికి కావాల్సిన ఏర్పాట్లపై ఎలాంటి అధ్యయనం చేయలేదు. ఇదంతా లేకుండానే గ్రామీణ ప్రాంతంలోని విద్యుత్తు సబ్‌స్టేషన్లకు స్కాడా సాంకేతికను ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. ఇందులో భాగంగా ఒక్కో సబ్‌స్టేషన్ పరిధిలో సుమారు 10 బ్రేకర్లకు దీనిని అందించి, సాంకేతికతను దీనితో అనుసంధానించాలి.

చిన్న కంపెనీకి అందలం..

వాస్తవానికి స్కాడా లాంటి సాంకేతిక వ్యవస్థలను నెలకొల్పాలంటే దీనిని ఉత్పత్తి చేసే కంపెనీలతోనే నేరుగా కాంట్రాక్టు చేసుకోవాలనే మార్గదర్శకాలను పలువురు ఇంజ నీర్లు, విద్యుత్తు రంగ నిపుణులు ఉటంకిస్తున్నారు. గతంలో హైదరాబాద్‌లో స్కాడా ఏర్పాటు చేసినప్పుడు ఈ సాంకేతికతను, పరికరాలను ఉత్పత్తి చేసే ఏబీబీ లాంటి మల్టీ నేషనల కంపెనీ (ఎంఎన్‌సీ) లాంటివి చేపట్టాయి. పైగా ఈ సాంకేతికతలో ముందున్న సీమెన్స్ లాంటివికూడా ఉన్నాయి.

అయితే ముందుగానే పథకం ప్రకారం ఈ టెండర్లలో నిబంధనలను బూచిగా చూపెట్టి.. ఏబీబీ, సీమెన్స్ లాంటి సంస్థలకు రాకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు బలంగా వినపడుతు న్నాయి. దీనితో వైటల్ అనే చిన్న కంపెనీకి ఈ టెండర్లను కట్టబెట్టారు. ఈ వైటల్ కంపెనీ ఏర్పడి దాదాపు రెండేండ్లే అయ్యింది. పైగా ఈ కంపెనీ మాన్యుఫ్యాక్చరర్ కాదు. ఒక కంపెనీ వద్ద కొనుగోలు చేసి.. వేరే కంపెనీకి అమ్ముకునే సంస్థ. అలాంటి వైటల్ కంపెనీకి ఇంతటి కీలకమైన టెండర్లను కట్టబెట్టారు.

రూ.100 కోట్లకు ఎసరు..?

ఇలా ఎన్‌పీడీసీఎల్ పరిధిలోని 1700 సబ్ స్టేషన్లకు సంబంధించి బ్రేకర్లను ఏర్పాటుచేసి స్కాడా సాంకేతికతతో అనుసంధా నించాలి. దీని ప్రకారం చూసుకున్నా.. ప్యాన ల్ ధరలో వ్యత్యాసమే సుమారు రూ.75 వేల వరకు ఉంటుందని నిపుణుల అంచనా. ఈ లెక్కన ఒక్క ప్యానల్‌ల ద్వారానే సుమారు రూ.80 కోట్ల వరకు కొల్లగొట్టేందుకు పథకం వేసినట్టుగా ఎన్‌పీడీసీఎల్ ఉద్యోగులే చర్చించుకుంటున్నారు. ఇక మిగతా పరికాలన్నీ కలుపుకుంటే.. సుమారు రూ.100 కోట్ల వర కు స్కాడా పేరుతో స్కాం జరిగిందనే చెప్పుకుంటున్నారు.

ఇప్పటికే సుమారు 700 సబ్ స్టేషన్లు.. 

టెండర్లను తమకు అనుకూలమైన వైటల్ కంపెనీకి కట్టబెట్టిన తరువాత.. 2025 జనవరిలో మొదటి దఫా 100 సబ్ స్టేషన్లకు సంబంధించి స్కాడా సాంకేతికతను ఏర్పాటుచేయడానికి వీలుగా రూ.17.92 కోట్ల పరికరా ల విలువ, రూ. 1.80 కోట్ల లేబర్, ఇతర ఛార్జీలు, రూ.18 శాతం జీఎస్టీగా రూ.3.55 కోట్లను కలుపుకుని మొత్తం.. రూ.23.27 కోట్ల పనులను సదరు కంపెనీకి అప్పగించారు. ఆపై మరో 600 సబ్ స్టేషన్ల పనులను అప్పగించినట్టు సమాచారం.

ఇందులో 100 సబ్ స్టేషన్లకు సంబంధించిన పనులను పూర్తిచేసి కమిషనింగ్ చేసిన సదరు వైటల్ కంపెనీ .. మిగిలిన సబ్‌స్టేషన్లకు సంంబంధించిన పరికరాలు, కేబుళ్లు, ప్యానెళ్లను స్టోర్‌కు తరలిం చారు. దీనితో కాంట్రాక్టులో పేర్కొన్నట్టుగా 70 శాతం నిధులను మంజూరు చేశారు. ఇదిలా ఉండగా.. మరో 1000 సబ్ స్టేషన్లు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. త్వరలోనే  ఈ పనులుకూడా సదరు కంపెనీకి అప్పజెప్పే కార్యక్రమంలో అధికారులు నిమగ్నమైనట్టు తెలుస్తున్నది.

జీవితకాలం ఆధారపడాల్సిందే..

ఇదిలాఉండగా.. ఇప్పుడు సరఫరా చేసిన పరికరాలు, ప్యానెళ్లు, కేబుళ్లు, సాంకేతిక విషయంలో కేవలం ఒకే కంపెనీ వద్ద లభిస్తుండ టంతో.. ఇక భవిష్యత్తులో మొత్తంగా ఈ కాంట్రాక్టరుపైనే ఆధారపడాల్సిన అవసరం ఉంది. అంటే ఎక్కువ ధరకు కొనడమేకాదు.. ఏకంగా జీవిత కాలం మొత్తం అదే కంపెనీపై ఆధారపడి ఆ స్కాడా వ్యవస్థలను నడిపించుకోవాలన్నమాట. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మళ్ళీ ఛార్జీలు.. గట్రా ఉండనే ఉంటాయి. ఇక నిధుల మంజూరు విషయంలోనూ మరో లొసుగును ఏర్పాటు చేశారు.

30 శాతం పనులు పూర్తిచేసి వ్యవస్థను పనిచేసేలా (కమిషనింగ్) చేస్తే... మిగిలిన 70 శాతం పనులకు సంబంధించిన మెటీరియల్ సరఫరా చేస్తే చాలు.. మొత్తం నిధులు ఇచ్చే లా వెసులుబాటు కల్పించారు. ఇదే అదనుగా సదరు వైటల్ కంపెనీ కేవలం 100 సబ్ స్టేషన్లకు సంబంధించిన పనులన పూర్తిచేసి.. మిగి లిన సుమారు 600 సబ్ స్టేషన్లకు సంబంధించిన పరికరాలు, ప్యానెళ్లు, కేబుళ్లను ఉత్తర ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎన్‌పీడీసీఎల్) స్టోర్‌లో డంప్ చేసింది. తనకు రావాల్సి న 70 శాతం నిధులను రాబట్టుకుంది.

అధికారులకు నజరానాలు..

ఇలా ఎన్‌పీడీసీఎల్ పరిధిలో స్కాడా సాంకేతిక ఏర్పాటు పేరుతో టెండరు దక్కించుకోవడం, తనకు అనుకూలంగా ఉండేలా నిబంధనలు, వెసులుబాటును రూపొందించి.. నిధులను విడుదల చేయడంలో కీలక పాత్ర పోషించిన పలువురు డిస్కం అధికారులకు సదరు కంపెనీ  నజరానాలు అందించినట్టు ఎన్‌పీడీసీఎల్ ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు. పైగా కొందరు కీలక అధికారులను సదరు కంపెనీ విదేశీ పర్యటనలకుకూడా తీసుకెళ్లినట్టు చర్చించుకుంటున్నారు. మరికొందరికి బంగారంకూడా బహుమానంగా ఇచ్చినట్టు సమాచారం. అయితే ఇంత జరుగుతున్నా.. ఎన్‌పీడీసీఎల్ ఉన్నతాధికారులు.. విదేశీ పర్యటనలకు ఎలా అనుమతించారనేది ఇప్పుడు ఉద్యోగులన వేధిస్తోన్న ప్రశ్న. 

తెరవెనుక పథకం..

అయితే ఈ నిర్ణయం వెనుక కొన్ని పెద్ద తలకాయలు పనిచేశాయని సమాచారం. అసలు అధ్యయనం చేయకుండా నే ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక.. పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని కొల్లగొట్టాలనే పథకం నడిచిందని డిస్కం అధికారుల్లోనే చర్చించుకుంటున్నారు. ఈ పథకానికి ఒక పెద్ద కంపెనీలోని మాజీ ఉద్యోగి ఒకరు కీలక పాత్ర పోషించగా.. దీనికి ఉత్తర డిస్కంలోని కొందరు ఉన్నతాధికారులు సహకరించారని, స్కాడా ఏర్పాటుకోసం టెండర్లు ఎలా పిలవాలి, ఎలాంటి నిబంధనలు పెట్టాలనేదానిలోనూ అందరూ కలిసి నిర్ణయించారని, ఈ తెరవెనుక పథ కం మొత్తం వైటల్ అనే కంపెనీ కేంద్రంగా సాగాయనే ఆరోపణలు వినవస్తున్నాయి.

అత్యధిక ధరలకు అమోదం..

ఇక టెండర్లలో పేర్కొన్న ధరలుకూడా బయటి మార్కెట్లో లభించే ధరలకన్నా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఉదాహరణకు ప్యానల్‌ను  రూ.1.74 లక్షలకు సరఫ రా చేయాలని నిర్ధారించారు. వాస్తవానికి ఈ ప్యానల్ బహిరంగ మార్కెట్లో రూ. లక్షల లోపే లభిస్తోంది. అలాగే రిలే ధరకూడా కేవలం రూ.30 వేలకే లభిస్తోంది. ఈ లెక్కన ప్యానల్ విషయంలోనే రూ. కోట్లు నొక్కేసే కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టినట్టు అర్థమవుతోంది.

ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు..

ఎన్‌పీడీసీఎల్ పరిధిలో జరిగిన, జరుగుతున్న స్కాం.. భారీగా ప్రజా ధనాన్ని కొల్లగొట్టడంపై ప్రభుత్వం దృష్టి సారించి, విచారణ చేయాలని కోరుతూ రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు అందింది. మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ ఈ స్కాంపై ఫిర్యాదు చేస్తూ లోతుగా విచారణ చేపట్టాలని ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి ఇచ్చిన ఫిర్యాదులో కోరారు. ఈ స్కాంలో కీలకంగా వ్యవహరించిన అధికారులు, కాంట్రాక్టు సంస్థలపై చర్యలు తీసుకోవాలనికూడా అందులో విజ్ఞప్తి చేశారు. ఈ స్కాంకు సంబంధించిన కొంత సమాచారాన్ని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదులో పొందుపర్చారు.

ఇదిలా ఉండగా.. గ్రామీణ సబ్ స్టేషన్లలో స్కాడా పేరుతో రూ.100 కోట్లకుపైగా జరిగిన స్కాంలో వాస్తవాలు బయటకు రావా లంటే.. సీఐడీతోగానీ, విజిలెన్స్ విభాగంతోకానీ విచారణ చేయిస్తేనే ఇందులో పాత్రధా రులు, పెద్ద తలకాయలు బయటకు వస్తాయని, నిపుణులు, ఇంజనీర్లు, సొంత విద్యు త్తు సంస్థల ఉద్యోగులే ఒప్పుకుంటున్నారు. ఇక ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా.. లేదా అనేది వేచి చూడాల్సిందే.

పాతకాలం ప్రోటోకాల్‌తోనే..

వాస్తవానికి టెండరు నిబంధనలను రూపొందించడంలోనే ప్రజాధనాన్ని కొల్లగొట్టాలనే పథకాన్ని పక్కాగా అమలు చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా, అంతర్జాతీయంగా 61850 అనే ప్రోటోకాల్ సాంకేతికతకు గుర్తింపు ఉంది. దీనినే అన్ని మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు తమ ఉత్పత్తుల్లో పొందుపర్చాలనేదికూడా ఉంది. కానీ అధునాతన 61850 ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి.. పాతకాలానికి సంబంధించిన ఐఈసీ 104 ప్రోటోకాల్‌తో కూడిన ఐఈడీ (ఇంటెలిజెంట్ ఎలక్ట్రానిక్ డివైజ్)తో స్కాడా ను ఏర్పాటు చేయాలని టెండర్లలో పొందుపర్చారు.

దీనితో ఏబీబీ, సీమెన్స్ లాంటి మల్టీ నేషనల్ కంపెనీలకు అవకాశం లేకుం డా చేశారు. ఈ సాంకేతికత (ఐఈసీ 104 ప్రోటోకాల్)తో ఉత్పత్తి చేసే ష్నైడర్ అనే కంపెనీకి దక్కేలా ప్రణాళిక వేశారన్నమాట. ఆ ఉత్పత్తులను అందించే ష్నైడర్ కంపెనీకి చెందిన ఉద్యోగి ఒకరు.. టెండర్ల ప్రక్రియ తరువాత.. వైటల్ కంపెనీలో చేరడం దీనికి ఉదాహరణగా ఎన్‌పీడీసీఎల్ ఉద్యోగులే చెప్పుకుంటున్నారు.

ఇదిలాఉండగా.. ఐఈసీ 104 ప్రోటోకాల్ అనేది అంతగా దృవీకరించిన వ్యవస్థ కాదు. ఇందులో వినియోగించే రిలే పరికరాన్ని పరీక్షించినట్టుగా ఎలాంటి సర్టిఫికెట్లు లేవు. పైగా ఈ రిలే పరికరానికి ఎలాంటి డిస్‌ప్లే లేకపోవడంతో.. వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి, ఇతర సాంకేతిక సమస్యలను తెలుసుకోవడానికి ఆస్కారమేలేదని విద్యుత్తు రంగ నిపుణులు చెబుతు న్నారు. అలాగే రిలే పరికరాన్ని సాంకేతికంగా అనుసంధానం చేయడానికి వీలుగా ఆర్‌టీయూ (రిమోట్ టెర్మినల్ యూనిట్) ఉండాలి. కానీ టెండర్లలో నిర్ధారించినట్టుగా ఈ రిలేకు ఆర్‌టీయూ అందుబాటులో లేదనే ఆరోపణలుకూడా ఉన్నాయి.

టెక్నికల్ కమిటీ సిఫారసు చేసిన టెక్నాలజీనే వాడాం..

వచ్చిన ఆరోపణలపై ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డిని ‘విజయక్రాంతి’ ఫోనులో సంప్రదించగా.. ఎక్కడా ఎలాం టి తప్పులు జరగలేదని తెలిపారు. మొదటి సారి ఒకే టెండర్ వస్తే రద్దుచేసి మరోసారి పిలిచాం. అప్పుడు మూడు టెండర్లు వచ్చాయి. వీరితో రెండు సార్లు ప్రీబిడ్ మీటింగ్స్ ఏర్పాటుచేసి చర్చించి ఫైనల్ చేశాం. ఇక టెక్నాలజీ విషయం లో.. టెక్నికల్ కమిటీ ఆరు రాష్ట్రాల్లో అధ్యయనం చేసింది. గ్రామీణ ప్రాంతాలకు ఇదే బెస్ట్ టెక్నాలజీ అని వారు నిర్ధారించిన తరువాతనే ఈ టెక్నాలజీని వాడేందుకు నిర్ణయించాం. ధరలో తేడా ఏమీ లేదు. తాజాగా ఇదే టెక్నాలజీని టాటా పవర్ సంస్థకూడా ఒడిశా రాష్ట్రంలోనూ వాడుతున్నారు. వచ్చిన ఆరోపణలన్నీ తప్పు అంటూ సీఎండీ వరుణ్‌రెడ్డి కొట్టిపడేశారు.

 వరుణ్‌రెడ్డి, సీఎండీ,ఎన్‌పీడీసీఎల్