2 May, 2026 | 1:58 PM

ఓట్ల బస్సులు ఫుల్

11-05-2024 01:13 AM

22 రైళ్ళకు అదనపు బోగీలు

ఓటేయడానికి ఆంధ్రా బాట

విజయవాడ రహదారిపై వాహనాల రద్దీ

హైదరాబాద్, మే 10/ యాదాద్రిభువనగిరి (విజయక్రాంతి): వరుస సెలవులు, ఎన్నికల నేపథ్యంలో నగరంలో నివసిస్తున్న తెలంగాణలోని పలు ప్రాంత వాసులే కాకుండా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు కూడా అధిక సంఖ్యలో స్వస్థ లాలకు వెళ్లేందుకు శుక్రవారం క్యూ కట్టారు. లోక్‌సభకు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల నాలుగో విడత పోలింగ్ తెలంగాణ, ఏపీలో ఈనెల 13వ తేదీన జరుగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం లోక్‌సభతోపాటు శాసనసభకు జమిలిగా పోలింగ్ జరుగనుంది.

అక్కడి ప్రధాన రాజకీయ పార్టీలకు  ఈ పోలింగ్ ప్రతిష్టాత్మకంగా మారింది. పోల్‌మేనేజ్‌మెంట్ లో భాగంగా ఉద్యోగ ఉపాధికోసం హైదరాబాద్ నగరానికి వలస వచ్చిన ఏపీ ఓటర్లను తరలించే ప్రక్రియను మూడు రోజుల ముందు నుంచే  ప్రారంభించారు. తమ తమ అభ్యర్థులకే ఈ ఓటర్ల మద్దతును కూడగట్టుకోవడానికి వారివారి స్వస్థలాలకు బయలుదేరే ఏర్పాటు చేశారు. దీంతో సీబీఎస్, జేబీఎస్ బస్‌స్టేషన్‌లు ప్రయాణీకులతో కిటకిట లాడాయి. 

ప్రయాణీకుల రద్దీతో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు టీఎస్ ఆర్టీసీ పెద్ద సంఖ్యలో ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఏపీకి ఇప్పటికే ప్రకటించిన బస్సుల్లో సీట్లన్నీ రిజర్వు అయిపోయాయి. దీంతో టీఎస్‌ఆర్టీసీ అదనంగా మరో 160 సర్వీసులను ఆన్‌లైన్‌లోపెట్టింది. తెలంగాణ జిల్లాలకు వెయ్యికి పైగా బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.  శుక్ర, శని, ఆదివారం  ఈ మూడు రోజుల్లో తెలంగాణ జిల్లాలకు 1400 సర్వీసుల్ని  సిద్ధం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

హైదరాబాద్, ఎంజీబీఎస్‌లతో పాటు, జేబీఎస్, ఆరాంఘర్, ఉప్పల్, ఎల్‌బీనగర్ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు బయల్దేరే విధంగా ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నారు. నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్ తదితర జిల్లాలకు డిమాండ్‌కు అనుగు ణంగా బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. ఆర్టీసీలో గతంతో పోలిస్తే బస్సుల సంఖ్య తక్కువగా ఉంది. దీంతో ఉన్నవాటినే ప్రజల ప్రయాణాలకు అనుగుణంగా సర్దుబాటు చేస్తూ ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రణాళికలు తయారు చేసింది.

బస్సులు  చాలకపోవడంతో సిటీ, మెట్రో, ఎక్స్‌ప్రెస్ బస్సులను కూడా దూర ప్రాంతాలకు నడిపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సిటీ ఆర్డినరీ బస్సులను కూడా జిల్లాలకు నడిపే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.  ఏపీలోని పలుప్రాంతాలకు టీఎస్‌ఆర్టీసీ రోజుకు 300 బస్సులను నడుపుతోంది. ఈ బస్సుల్లో రిజర్వేషన్లు పూర్తయ్యాయి. ప్రత్యేక బస్సుల్లోనూ టికెట్లు వేగంగా రిజర్వ్ అవుతున్నాయి. ఈ నెల 11న 150, 12న 130 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. వీటిని అమలాపురం, విశాఖ, కాకినా డ, రాజమహేంద్రవరం, పోలవరం, కందుకూరు, కనిగిరి, ఉదయగిరి, ఒంగోలు వైపు ఎక్కువగా నడిపిస్తున్నారు. తిరుగు ప్రయాణంలో 13,14 తేదీల్లో ఏపీ నుంచి వచ్చేందు కు ఆర్టీసీ బస్సులను సిద్ధం చేస్తోంది.

22 రైళ్ళకు అదనపు బోగీలు

రైళ్ళలో భారీ వెయింటింగ్ లిస్ట్ ఉన్న నేపథ్యంలో ఏపీకి రానుపోను కలిపి 22 రైళ్ళలో అదనపు బోగీలు ఏర్పాటు చేయాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. కొన్ని రైళ్ళను నేటి నుంచి 13వ తేదీ వరకు, మరికొన్నింటిని శనివారం నుంచి మంగళవారం వరకు అదనపు సౌకర్యాన్ని కల్పించనుంది. ఒక్కో రైలుకు అదనపు బోగీ ఒక్కోటి మాత్రమే ఉండగా, కొన్ని రైళ్ళకు స్లీపర్, మరికొన్నింటికి థర్డ్ ఏసీ ,ఛైర్‌కార్ బోగీ అదనంగా ఉన్నాయి. సికింద్రాబాద్ కాచిగూడ, దర్మవరంనర్సాపూర్, తిరుపతి గుంటూ, హుబ్లీ నర్సాపూర్, కాచిగూడరేపల్లే, బీదర్‌మచిలీపట్నం, తదితర మార్గాల్లో అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నారు.

ట్రావెల్ బస్సులు ఏర్పాటు చేసి.. 

గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠతో పోటాపోటీగా సాగుతున్న ఎన్నికల్లో నగరంలో నివసిస్తున్న ఏ ఒక్క ఓటరు వదిలిపెట్టకుండా పోలింగ్‌బూత్ వరకు చేరవేయడానికి ఏపీలో తలపడుతున్న రెండు ప్రధానపార్టీలు ప్రయాణ సదుపాయాలను సమకూరుస్తున్నారు. దీంతో శుక్రవారం సాయంత్రం నుంచే హైదరాబాద్ నగరానికి, ఆంధ్రప్రదేశ్‌కు అనుసంధానమైన ఎన్‌హెచ్ 65 విజయవాడ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. స్తోమతగల స్థితిమంతులు తమతమ సొంత వాహనాలలో కుటుంబ సభ్యులతో కార్లలో బయలుదేరి వెళ్తున్నారు.

మరికొంత మందిని రాజకీయపార్టీలే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను అద్దెకు మాట్లాడి ఆయా ప్రాంతాల నుంచి మూకుమ్మడిగా వారివారి గ్రామాలకు చేరవేస్తు న్నారు. సోమవారం పోలింగ్‌కు ముందు శని, ఆదివారాలు సెలవులు కావడంతో ఇక్కడ నివసిస్తున్న ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడమే కాకుండా, తమతమ కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడపడానికి సిద్ధమై వెళ్తున్నారు. ఈ విధంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ఓటర్లతో తరలివెళ్తున్న వాహనాల తో విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ నెలకొంటోంది. 

సంక్రాంతి పండుగకు తరలివెళ్లినట్టుగా వాహనాలు బారులు తీరుతుం డటంతో చౌటుప్పల్ శివారులోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద రద్దీ నెలకొంది. పెద్దసంఖ్యలో ట్రావెల్ బస్సులతో పాటు కార్లు, ఇతర వాహనాలలో పెద్దసంఖ్యలో ఓటు వేయడానికి స్వస్థలాలకు తరలివెలుతున్న కారణంగా సాదారణం కంటే రెట్టింపు సంఖ్యలో వాహనాలు వెలుతున్నట్టుగా టోల్‌ఫ్లాజా నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ఈ రద్దీ శనివారం నుంచి మరింత పెరిగి ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి కూడ ఏర్పడవచ్చునని భావిస్తున్నారు.