బొగ్గు రంగంలో సంస్కరణలు తెస్తున్నాం
- ప్రభుత్వ సంస్థలు అంకితభావంతో పనిచేస్తే తప్ప వాటిని రక్షించలేరు
- నూతన కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి
- సింగరేణిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష
హైదరాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): బొగ్గు రంగంలో కొన్ని సంస్కరణ లు తీసుకురాబోతున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖమంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇకపై ప్రభుత్వ సంస్థలు పూర్తి అంకితభావంతో పనిచేస్తే తప్ప వాటిని ఎవరూ రక్షించలేరని తెలిపారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని నూతన కార్మిక చట్టాలను అమలులోకి తీసుకొచ్చామని, వీటిని పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. సింగరేణి సంస్థ సుస్థిర మనుగడ కోసం తక్షణమే తన బొగ్గు ధరల తగ్గింపు పైన, నాణ్యత పెంపుదల పైన దృష్టి సారించాలన్నారు.
కొత్త బ్లాకులు సాధించడానికి చొరవ చూపాలని, కార్మిక సంక్షేమంలో ఎలాంటి రాజీ పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ సింగరేణి భవన్‌లో ఆయన శనివారం సింగరేణి సంస్థపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సింగరేణిలో కార్మికుల సంక్షేమం విషయంలో ఎలాంటి రాజీ పడకుండా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో మానవ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.
కొత్త బ్లాకులను సాధించడం కోసం ప్రణాళిక బద్ధంగా పనిచేయాలన్నారు. సింగరేణి సంస్థ ప్రధాన వ్యాపకం బొగ్గు ఉత్పత్తి కాబట్టి బొగ్గు నాణ్యత ప్రమాణాల పెంపుదలకు వాషరీలను ఏర్పాటు చేయాలని, కొత్తగా వచ్చిన డ్రై వాషరీలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. సింగరేణి భవిష్యత్ కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సింగరేణి సంస్థ చైర్మన్, ఎండీ ఎన్.బలరామ్ ముందుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సింగరేణి సంస్థకు సంబంధించిన ఆర్థిక పరిస్థితులు భవిష్యత్తు వ్యూహాలపైన వివరించారు. అంశాల వారీగా పలు సమస్యలపైన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చర్చించారు.
ఈ కార్యక్ర మంలో బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి విక్రమ్ దేవ్ దత్త్, తెలంగాణ ఇంధన శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, బొగ్గు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఎస్.కె. కస్సి, బొగ్గు శాఖ వ్యక్తిగత కార్యదర్శి డా. పంకజ్ జైన్, బొగ్గు శాఖ సీనియర్ టెక్నికల్ అడ్వైజర్ బి.వీరా రెడ్డి, డెరెక్టర్ టెక్నికల్ బీరెంద్రకుమార్ ఠాకూర్, సిఎంపీడీఐఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శంకర్ నాగచారితో పాటు సింగరేణి సంస్థ డైరెక్టర్‌లు ఎల్.వి సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, గౌతమ్ పొట్రు, ఎం.తిరుమల రావు, ఈడి కోల్ మూమెంట్ బి.వెంకన్న, వివిధ విభాగాల జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.




