సదాలక్ష్మి విగ్రహం ప్రతిష్టించి సీఎం హామీ నిలబెట్టుకోవాలి
రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తల డిమాండ్
ముషీరాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానం ప్రకారం తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమ నాయకురాలు, పేద, దళితుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేసిన ధీర వనిత, మాజీ మంత్రి టి.ఎస్. సదాలక్ష్మి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై లేదా ఇందిరాపార్క్ వద్ద ప్రతిష్టించాలని పలువురు వక్తలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రిలే నిరాహార దీక్షలతో పాటు ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధమేనని హెచ్చరించారు.
ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో దళిత సేన జాతీయ అధ్యక్షుడు జేబీ రాజు, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, బీజేపీ నేతలు చింతా సాంబమూర్తి, డాక్టర్ వంశతిలక్, ప్రముఖ గాయకుడు మాస్టార్జీ, ఫ్రంట్ చైర్మన్ నల్లా సూర్యప్రకాష్ రావు, కార్మిక నేత గొల్లపల్లి దయానందరావు, టీపీసీసీ కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొని మాట్లాడా రు.
ప్రతి ఏడాది సదాలక్ష్మి జయంతి, వర్ధంతిలను రాష్ట్ర ప్రభుత్వ మే అధికారికంగా నిర్వహించాలని, ఆమె పేరుమీద ప్రముఖులకు అవార్డులను ప్రదా నం చేయాలని డిమాండ్ చేశారు. ఏదైనా విశ్వ విద్యాలయంకు ఆమె పేరు పెట్టాలన్నారు. సదాలక్ష్మి కాలం చేసి 21 ఏళ్ళు గడిచిందని, ఇంతవరకు ఆమె విగ్రహన్ని ఏర్పాటు చేయడానికి వస్తున్న ఆటంకాలు ఏంటని వారు ప్రశ్నించారు.
విగ్రహ ఏర్పాటుకు సీఎం వాగ్దానం చేసి ఏడాది గడిచిం దని, కాని అమలు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లను కలసి వినతి పత్రాలను సమర్పిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి చక్రపాణి, తదితరులు పాల్గొన్నారు.




