18-02-2026 12:38:17 AM
- బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జి.వి. రామకృష్ణారావు
కరీంనగర్ క్రైం, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జి.వి. రామకృష్ణారావు అన్నారు. మంగళవారం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన నియోజకవర్గ పరిధిలో హుజురాబాద్, హుస్నాబాద్, జమ్మికుంట, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి వంటి మున్సిపాలిటీల్లో బీజేపీని గెలిపించలేకపోయిన నాయకుడని అన్నారు.ఇప్పుడు ఒకే ఒక్క మేయర్ విజయం మీద అహంకార రాజకీయాలు చేస్తున్నారన్నారు.
కరీంనగర్ అభివృద్ధి గురించి మాట్లాడాల్సింది పోయి కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం కుట్ర అంటూ కల్పిత కథలు చెప్పడం రాజకీయ పరిపక్వత కాదని ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. గిఫ్ట్ టు మోదీ అంటే ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ ఎక్కడ అని ప్రశ్నించారు. మేయర్ పదవి మోదీ, అమిత్ షాలకు గిఫ్ట్ అంటున్నారు అలా అయితే కరీంనగర్ ప్రజలకు అభివృద్ధి రూపంలో రిటర్న్ గిఫ్ట్ తేవాలన్నారు. నిజానికి బండి సంజయ్ స్వయంగా ఒక మాస్టర్ ప్లాన్ రూపంలో కుట్రను రూపొందించాడని ఆరోపించారు. కరీంనగర్లో మరో శక్తికేంద్రం ఏర్పడకూడదనే ఉద్దేశంతో బీజేపీ మేయర్ ఏర్పాటుపై బండి సంజయ్ ఆసక్తి చూపలేదన్నారు.
స్వతంత్ర కార్పొరేటర్లను ఉద్దేశపూర్వకంగా సమీకరించలేదని, బీజేపీలో చేరేందుకు ముందుకు వచ్చిన నలుగురు స్వతంత్ర కార్పొరేటర్లను తిరస్కరించారన్నారు. కాంగ్రెస్ కు పరోక్షంగా సహాయం చేయడానికి అన్ని రాజకీయ డ్రామాలు చేసి, తన శిబిరంలో ఉన్న ఇద్దరు కార్పొరేటర్లను విడుదల చేశాడని, ఇది అతని కుట్రకు స్పష్టమైన సాక్ష్యమని పేర్కొన్నారు. దాని ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని అతను భావించాడని, కానీ బీఆర్‌ఎస్ అది జరిగేలా చేయలేదని జీవి రామకృష్ణారావు తెలిపారు.