24 May, 2026 | 3:08 AM

ప్రతి భావోద్వేగ క్షణాన్ని పెద్దికి అంకితం చేశాం

24-05-2026 01:47 AM

భోపాల్ మ్యూజికల్ ఈవెంట్‌లో రామ్‌చరణ్

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. జూన్ 4న విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తోంది. ఇందులో భాగంగా శనివారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో ‘పెద్ది కి ఆవాజ్’ పేరుతో మ్యూజికల్ ఈవెంట్‌ను ఏర్పాటుచేశారు. ఇదే వేదికపై ఈ సినిమాలోని థర్డ్ సింగిల్ ‘హల్లల్ల ల్లో’ని లాంచ్ చేశారు.

అనంతరం సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన బృందంతో కలిసి నిర్వహించిన ప్రత్యక్ష సంగీత విభావరి.. భారీ సంఖ్యలో హాజరైన ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఇక ఈవెంట్‌లో హీరో రామ్‌చరణ్ మాట్లాడుతూ.. “నమస్కార్ భోపాల్.. నా మనసు లో మీ అందరికీ ప్రత్యే క స్థానం ఉంది. ‘పెద్ది’ ప్రమోషన్స్‌ను భోపాల్ నుంచి ప్రారంభించడం నాకు చాలా ఎమోషనల్‌గా అనిపిస్తోంది. ప్రతి భావోద్వేగం, ప్రతి కష్టం, ప్రతి క్షణాన్ని ఈ సినిమా కోసం అంకితం చేశాం.

ఈ నగరం ఎంత అందంగా ఉందో, ఇక్కడి ప్రజల మనసులు అంతకంటే అందంగా ఉన్నాయి. జూన్ 4న మీ హృదయాల్లో మా సినిమాకు ఒక స్థానం కల్పించాలని కోరుకుంటున్నా. రవికిషన్ ఈ సినిమా గురించి ఎంతో గొప్పగా మాట్లాడా రు. ఆయనకు నా ధన్యవాదాలు. ‘పెద్ది’ తన గుర్తింపు కోసం పోరాడే ఒక వ్యక్తి కథ. ఆ పోరాటం మీ హృదయాలను తాకుతుంది. మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది, స్ఫూర్తినిస్తుంది. సినిమా చూసిన తర్వాత మళ్లీమళ్లీ చూడాలనిపించే అనుభూతిని కలిగిస్తుంది.

నా కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ, నా ఫిల్మ్ లైబ్రరీలో ‘పెద్ది’ నంబర్ వన్‌గా నిలుస్తుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రానికి ఎంత ప్రేమ చూపించారో, అదే ప్రేమను ‘పెద్ది’కి కూడా అందిస్తారని ఆశిస్తున్నా” అన్నారు. కథానాయకి జాన్వీకపూర్ మాట్లాడుతూ.. “పెద్ది’లో చాలా గొప్ప సందేశం ఉంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌తో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టం, గౌరవంగా భావిస్తు న్నా. మనందరం రామ్‌చరణ్ అభిమానులమే. ఈ సినిమా కోసం ఆయన చూపిం చిన అంకితభావం స్ఫూర్తిదాయకం.

ఏఆర్ రెహమాన్ వంటి ప్రపంచ స్థాయి సంగీత దర్శకుడితో కలిసి పనిచేయడం చాలా ప్రత్యేకమైన అనుభూతి. ఆయన సంగీతం ఈ సినిమాకు మరింత ప్రాణం పోసింది. బుచ్చిబాబు విజన్ ఈ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది” అని తెలిపింది.  నిర్మాత వెం కట సతీశ్ కిలారు మాట్లాడుతూ.. “ఉద్యోగం కోసం భోపాల్‌లో ఐదేళ్లు గడిపా. అందుకే మధ్యప్రదేశ్‌ను మా రెండో ఇల్లుగా భావిస్తా. ‘పెద్ది’ అన్ని కమర్షియల్ అంశాలతో కూడిన గొప్ప స్పోర్ట్స్ డ్రామా” అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో మంత్రి విశ్వాస్ సారంగ్‌తోపాటు రవికిషన్, దివ్యేందు శర్మ పాల్గొన్నారు.