17 June, 2026 | 1:04 AM

ఆ ‘మీడియా’ వద్దు!

17-06-2026 12:00 AM

పిల్లల భవిష్యత్తుపై సోషల్ మీడియా ప్రభావం గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్న తరుణంలో బ్రిటన్ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయంతో ముందుకురావడం ముదావహం. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుడా బ్రిటన్ ప్రభుత్వం నిషేధం విధించడాన్ని అందరూ స్వాగతించాల్సిందే. పిల్లలకు వారి బాల్యాన్ని తిరిగి ఇవ్వాల నే భావనతోనే ఈ చర్య చేపడుతున్నట్టు బ్రిటన్ ప్రధాని కీవ్ స్టార్మర్ ప్రకటించడాన్ని బట్టి చిన్నారులపై సోషల్ మీడియా ఎంత ప్రభావం చూపుతున్నదో అర్థం చేసుకోవచ్చు.

స్నాప్‌చాట్, టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్) వంటి ప్రముఖ యాప్‌లను పిల్లలు వాడకుండా తీసుకొస్తున్న ఈ ఆంక్ష లు 2027లో అమల్లోకి రానున్నాయి. యూట్యూబ్‌ను నిషేధించినప్పటికీ, విద్యాపరమైన అంశాల్లో యూట్యూబ్ కిడ్స్ వెర్షన్‌ను వాడుకోవచ్చని వెలుసుబాటు కల్పించారు. అయితే, పిల్లలు సోషల్ మీడియా వాడటాన్ని నిషేధిం చడం కొత్త విషయమేమీ కాదు. ఈ దిశగా నిర్ణయం తీసుకున్న తొలి దేశం ఆస్ట్రేలియా కాగా; ఫ్రాన్స్, స్పెయిన్ దీన్ని పరిశీలిస్తున్నాయి.

బ్రిటన్ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా దీనిపై మరోసారి చర్చ ఊపందుకున్నది. ఇక మన దేశం విషయానికి వస్తే, 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని కర్ణాటక ఇప్పటికే నిషేధించింది. ఏపీ సర్కార్ ఒక అడుగు ముందు కువేసి 13 ఏళ్లలోపు పిల్లలకు పూర్తిస్థాయి నిషేధం, 16 ఏళ్లలోపు వారికి నియంత్రిత వినియోగం దిశగా చట్టపరమైన అంశాలను పరిశీలిస్తున్నది.

రెండువైపులా పదునున్న కత్తి లాంటి సోషల్ మీడియాను సక్రమంగా వినియోగించని ఫలితంగా ఇప్పటికే అనేక దుష్పరిణామాలను మనం చూస్తు న్నాం. పిల్లలు గంటల తరబడి స్క్రీన్‌కు అతుక్కుపోవడం, చదువుపై ఆసక్తి తగ్గడం, నిద్రలేమి వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాకుండా ఇతరులతో పోల్చుకోవడం వల్ల ఆత్మన్యూనతాభావం, నిస్పృహ వంటి మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి.

ముఖ్యంగా వయసుకు మించిన అంశాల ప్రభావం చిన్నారులపై పడుతుండటం ఆందోళనకరం. గ్రామీణ ప్రాంతాలకూ పాకిన ఈ జాఢ్యాన్ని మొగ్గ దశలోనే తుంచివేయాల్సిన ఆవశ్యతక ఉంది. అయితే, డిజిటల్ విద్య ప్రాధాన్యం సంతరించుకున్న ప్రస్తుత తరుణంలో సాంకేతికతను బాధ్యతాయుతంగా వినియోగించడంపై పిల్లలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులదే. అంతిమంగా సాంకేతికతను పూర్తిగా దూరం చేయడం సాధ్యంకాని నేపథ్యంలో కొంతవరకు నిషేధం విధించాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.