17 June, 2026 | 1:23 AM

కొత్త రాజకీయ దిశ అవసరం

17-06-2026 12:00 AM

దేశ రాజకీయాల్లో నూతన ప్రత్యామ్నాయాల కోసం అన్వేషణ కొత్త విషయమేమీ కాదు. పాత పార్టీలపై ప్రజల్లో అసంతృప్తి పెరిగినప్పుడల్లా కొత్త రాజకీయ శక్తులు ఆశాకిరణాలుగా ముందుకు వస్తుంటాయి. అవి రాజకీయ అవినీతిని అంతం చేస్తామని, ప్రజా జీవితంలో నిజాయితీని పునరుద్ధరిస్తామని, సుపరిపాలనను అందిస్తామని హామీ ఇస్తుంటాయి. అయితే గత రెండు దశాబ్దాల రాజకీయ అనుభవం ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతోంది.

కేవలం అవినీతి వ్యతిరేకత, వ్యక్తిగత నిజాయితీ ఆధారంగా నిర్మితమైన రాజకీయాలు దేశంలోని మూల సమస్యలకు పరిష్కారం చూపగలవా? ఒకప్పుడు అవినీతి వ్యతిరేక ఉద్యమం దేశవ్యాప్తంగా అపారమైన మద్దతు సంపాదించింది. ఆ ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన ఒక రాజకీయ ప్రత్యామ్నాయం సాంప్రదాయ పార్టీలకు భిన్నమని చాలామంది విశ్వసించారు. కానీ, కాలక్రమేణా ఆ పార్టీ కూడా ఎన్నికల రాజకీయాల సహజ ఒత్తిళ్లు, అధికార రాజకీయాల వాస్తవాలు, నాయకత్వ వైరుధ్యాల మధ్య చిక్కుకుంది.

ఆ పార్టీ నాయకులపై వచ్చిన ఆరోపణలు న్యాయస్థానాల్లో ఎంతవరకు రుజువవుతాయనేది వేరే ప్రశ్న. అలాగే ఆ పార్టీ పాలనలో కొన్ని రంగాల్లో చేసిన సంస్కరణలను కూడా విస్మరించలేం. అయినప్పటికీ, ఒకప్పుడు ప్రకటించిన ‘మేము పూర్తిగా భిన్నం’ అనే నైతిక ఆధిక్యం మాత్రం గణనీయంగా బలహీనపడిందనేది విస్తృతంగా వినిపిస్తున్న అభిప్రాయం. ఇక్కడ సమస్య ఒక పార్టీ గురించో, ఒక నాయకుడి గురించో కాదు.

అసలు ప్రశ్న అవినీతి వ్యతిరేక రాజకీయాల పరిమితి గురించిది. అవినీతి ఒక సామాజిక- ఆర్థిక వ్యవస్థలో కనిపించే లక్షణం మాత్రమే; అది అన్ని సమస్యల మూలకారణం కాదు. దేశంలో రాజకీయ అధికారాన్ని నిర్ణయిస్తున్న ప్రధాన అంశాలు కులం, వర్గం, భూమి యాజమాన్యం, ఆర్థిక శక్తి, సామాజిక ఆధిపత్య సంబంధాలే. ఈ నిర్మాణాలను ప్రశ్నించకుండా కేవలం అవినీతి వ్యతిరేకతను రాజకీయాల కేంద్రంగా నిలబెట్టడం ద్వారా సమాజంలోని మూల వైరుధ్యాలను పరిష్కరించడం సాధ్యం కాదు. అవినీతి వ్యతిరేక పోరాటం అవసరమే.

అదే సమయంలో పారదర్శక పరిపాలన కూడా అవసరం. ఈ సందర్భంలో నేడు కొత్త ప్రత్యామ్నాయాలుగా ప్రచారం పొందుతున్న రాజకీయ శక్తులకూ ఇదే ప్రశ్న వర్తిస్తుంది. ఒక పార్టీ కొత్తది కావడం వల్లనే అది ప్రత్యామ్నాయం అయిపోదు. ఒక పార్టీ నాయకులు నిజాయితీపరులు కావడం వల్లనే అది భిన్నమైన రాజకీయ శక్తిగా మారిపోదు.

మారకుండా ఉండటానికి అవసరమైన రాజకీయ- సామాజిక కార్యక్రమం ఏమిటి? కుల వ్యవస్థపై దాని వైఖరి ఏమిటి? భూమి, ఆస్తి, ఆర్థిక అసమానతలపై దాని దృక్పథం ఏమిటి? కార్పొరేట్ ఆధిపత్యాన్ని అది ఎలా చూస్తోంది? అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పర్యవేక్షణకు ఎలాంటి వ్యవస్థలను ప్రతిపాదిస్తోంది? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లేకపోతే ఏ కొత్త పార్టీ అయినా చివరికి వ్యవస్థలో భాగమయ్యే ప్రమాదం ఉంటుంది.

వాస్తవానికి దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాల చరిత్ర అన్నది కేవలం అవినీతి వ్యతిరేక ఉద్యమాల చరిత్ర కాదు. అది ఫూలే, అంబేద్కర్, పెరియార్, కాన్షీరాం వారసత్వంతో పాటు కమ్యూనిస్టు, విప్లవ, బహుజన ఉద్యమాలు నిర్మించిన సామాజిక న్యాయ పోరాటాల చరిత్ర కూడా. కానీ, నేడు రాజకీయ చర్చల్లో ఈ సంప్రదాయాల ప్రస్తావన క్రమంగా తగ్గిపోతోంది. వ్యక్తిగత నిజాయితీని గౌరవిస్తూ, సామాజిక మార్పు కోసం జీవితాలను అంకితం చేసిన రాజకీయ సంప్రదాయాలను విస్మరించే ధోరణి పెరుగుతోంది.

ఫలితంగా రాజకీయాలు నిర్మాణాత్మక మార్పు లక్ష్యాన్ని కోల్పోయి, పరిపాలనా సంస్కరణలకే పరిమితమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. నిజానికి దేశ రాజకీయాల ముందున్న ప్రధాన సవాలు కొత్త పార్టీని కనుగొనడం కాదు; కొత్త రాజకీయ దిశను నిర్మించడం. అవినీతి వ్యతిరేకత, సుపరిపాలన, వ్యక్తిగత నిజాయితీ కూడా అవసరం. కానీ, ఇవే సరిపోవు. కులాధిపత్యం, వర్గ దోపిడీ, ఆర్థిక అసమానతలు, సామాజిక అన్యాయాలను ప్రశ్నించే కార్యక్రమంతో ఇవి కలిసినప్పుడే ప్రజల జీవితాల్లో మౌలిక మార్పు తీసుకురాగలవు.

అందువల్ల దేశ రాజకీయాల భవిష్యత్తు గురించి చర్చించేటప్పుడు ‘ఎవరు నిజాయితీపరులు?’ అనే ప్రశ్నతో పాటు ‘ఎవరు సామాజిక- ఆర్థిక అసమానతల మూలాలను సవాలు చేస్తున్నారు?’ అనే ప్రశ్నను కూడా అడగాలి. లేకపోతే కొత్త పేర్లు వస్తాయి, కొత్త జెం డాలు వస్తాయి, కొత్త నినాదాలు వస్తాయి; కానీ పాత వ్యవస్థ మాత్రం కొత్త రూపంలో కొనసాగుతూనే ఉంటుంది. అందుకే ఈ దేశంలో కొత్త పార్టీలు కాదు, కొత్త రాజకీయ దిశ కావాలి.

పాపని నాగరాజు