శాస్త్రజ్ఞానం కన్నా శాస్త్రాచరణే మిన్న
పాలకుర్తి రామమూర్తి :
అంధోరాజా శక్యతే సహాయ సంపదా
యత్ర తత్ర వా పర్యవస్థాపయితుమితి.
చరిత శాస్త్రస్తు శాస్త్రాదన్యథాభినివిష్టబుద్ధిః
అన్యాయేవ రాజ్యామాత్మానం
చోపహంతీతి!
(కౌటిలీయం-8-2)
రాజ్యంలో బాధ్యత గలిగిన మంత్రులు, అమాత్యులు, అధికారులలో ప్రాజ్ఞత మొదలైన గుణ సంపద ఉన్నట్లయితే, అంధుడైన (భౌతికంగా గుడ్డితనమే కాక శాస్త్రజ్ఞానం అనే కన్నులు లేనివాడు) రాజును కూడా ఏ మార్గంలో (మంచి చెడు) నడిపించాలంటే ఆ మార్గంలోనే నడపవచ్చు, లేదా నిలుపవ చ్చు. కానీ, పాలకులు శాస్త్రానికి విరుద్ధంగా మొండి పట్టుదలతో కూడిన బుద్ధిగల చలితశాస్ర్తులైతే (శాస్త్రాలను చదువుకొని కూడా ఆ శాస్త్రీయ మార్గం నుంచి చలించినవాడు) అన్యాయంతో రాజ్యాన్ని నశింపజేస్తాడు, తానూ నశిస్తాడు, అంటాడు, ఆచార్య చాణక్య.
శాస్త్రజ్ఞానం ఉన్నప్పటికీ దానిని పాటించక వ్యక్తిగత అహంకారం, రాగద్వేషాలు, స్వార్థం వల్ల ధర్మమార్గం నుంచి తప్పిపోయి న వాడు, సాధారణ అజ్ఞానికన్నా, భౌతికంగా గుడ్డివాని కన్నా ప్రమాదకరుడు అంటున్నా డు, చాణక్య.
వ్యక్తుల కంటే సంస్థలు ముఖ్యమైనవి. రాజు బలహీనుడైనా, ఉన్నత ప్రజ్ఞ కలిగిన నిర్వహణాధికారులు ఉంటే ఆ రాజ్యం ప్రగతి మార్గంలో నడుస్తుంది. ఆధునిక ప్రజాస్వా మ్య వ్యవస్థలో కూడా ఈ నియమం వర్తిస్తుంది. మంచి పరిపాలనా వ్యవస్థలు, నిపు ణులైన అధికారులు, నిష్పాక్షిక న్యాయవ్యవస్థలు ఉన్నప్పుడు నాయకుడి వ్యక్తిగత లోపా లు చాలావరకు పూరింపబడతాయి. శాస్త్రమనేది నైతిక వర్తనతో కూడిన నియమబ ద్ధమైన విజ్ఞానమే.
అది ధర్మం, రాజనీతి, ఆర్థిక శాస్త్రం, పరిపాలనా నియమాలు, అనుభవగతమైన విధానాలు.. ఇలా పలు అం శాలతో మేళవించిన విజ్ఞానం. దీనిని చక్కగా ఆధ్యయనం చేసిన వ్యక్తులు పాలనా పగ్గాలు చేబడితే ప్రజలకు, రాజ్యానికి ప్రగతి, సుగతి ప్రాప్తిస్తుంది. అలాకాక, పాలకులు అహంకార పూరితులై శాస్త్రాన్ని తెలిసి కూడా, ‘నేనే’ అంతిమం, నా అభిప్రాయమే శాసనం అంటూ మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తే తాను నాశనమవుతాడు, రాజ్యాన్నీ భ్రష్టుపట్టిస్తాడు.
భారతంలో ధృతరాష్ర్టుడు జాత్యంధుడే కానీ, శాస్త్రజ్ఞాన సంపన్నుడు. భీష్మద్రోణ కృపులు, విదురుడు లాంటి ఉత్తమ నీతికోవిదులు, ధర్మాధర్మ మర్మజ్ఞులు అతనికి అన్ని విధాలుగా సహకారాన్ని అందించారు. అయినప్పటికీ ‘శాస్త్రాదన్యథాభినివిష్టబుద్ధిః’ అన్న ట్లుగా తాను అధ్యయనంతో సాధించిన శాస్త్రజ్ఞానాన్ని కాదని మోహంతో కలుషితమైన మనసు నడిపించిన మార్గంలో నడిచాడు. పెద్దల బోధలు అతని చలిత శాస్త్రజ్ఞతను మార్చలేకపోయాయి.
తనకు ధర్మం పాండవుల పక్షాన ఉందని తెలుసు. అయినా పుత్ర వ్యామోహం, ‘నేను, నాద’నే మమకారం కౌరవుల పక్షాననే నిలిపింది. శాస్త్రాధ్యయనం ప్రసాదించిన వివేకవంతమైన మార్గాన్ని కాదని పుత్రవ్యామోహంతో బలోపేతమైన రాజ్యలోభం నడిపించిన మార్గాన్ని అనుసరించాడు.
విదురుడు చెప్పిన ధర్మమార్గాన్ని కాక కణికుని కుటిలనీతి మార్గాన్ని ఎంచుకొ ని పాండవులను లక్కయింటిలో కాల్చాలనే కుట్రకు సమ్మతించాడు. ధృతరాష్ర్టుడి వ్యక్తిత్వాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అతనిలో దురు ద్దేశం కన్నా బలహీనతలు ఎక్కువగా కనిపిస్తాయి. అహంకారం కన్నా మమకారం అధి కంగా కనిపిస్తుంది.
సాధారణంగా అజ్ఞానానికి (అవగాహనాలోపం) వెలుగు బాట కనిపించదు. కానీ విజ్ఞుల బోధలను ఆలకించిన అజ్ఞాని, తన అజ్ఞానాన్ని గుర్తించి వినయాన్ని సంతరించుకుంటే నేర్చుకునే అవకాశం ఉంటుంది.. అవగాహనా లోపాన్ని అధిగమించగలడు. తెలిసీ తప్పుడు మార్గంలో నడిస్తే రాజ్యానికి ప్రమాదకారిగా మారుతాడన్న దానికి ధృతరాష్ర్టుడు ఉదాహరణగా నిలుస్తాడు. ధృత రాష్ర్టుని అధర్మ వర్తనకన్నా, అధర్మాన్ని అడ్డుకోలేకపోయిన అసమర్థతే కౌరవ వంశాన్నీ, రాజ్యాన్నీ వినాశనానికి గురిచేసింది.
ఇలాంటి వారి గురించి కౌటిల్యుడు, చలితశాస్ర్తుడు ‘రాజ్యమాత్మానం చోపహంతి’ అన్నాడు. ధృతరాష్ర్టుని సమస్య అంధత్వంలో లేదు. ధర్మాన్ని అమలు చేయలేని దుర్బల సంకల్పంలో ఉన్నది. కౌటిల్యుడు చెప్పిన ‘అంధరాజు’ కంటే ‘చలితశాస్ర్తుడు’ అనే భావనకు దగ్గరగా నిలుస్తాడు, ధృతరాష్ర్టుడు.
మహాభారతంలో దుర్యోధనుడు ‘జానా మి ధర్మం నచమే ప్రవృత్తిః, జానామ్యధర్మం నచమే నివృత్తిః, కేనేమి దేవేన హృదిస్థితేన యథా నియుక్తేస్తి తథాకరోమి’! అంటాడు. నాకు ధర్మం ఏమిటో తెలుసు, కానీ దానిని ప్రవృత్తిగా స్వీకరించలేకపోతున్నాను. అలాగే అధర్మం ఏమిటో నాకు తెలుసు కానీ దాని నుంచి బయటకు రాలేకపోతున్నాను. ఏదో దైవం నా హృదయంలో తిష్టవేసి ఎలా నడిపిస్తున్న దో అలాగే నడుస్తున్నాను.
ఒక విధంగా ఇవి దుర్యోధనుడు తన లోపాలను అంగీకరించి వాటిని అధిగమించ లేని నిస్సహాయ స్థితిని ఒప్పుకున్నాడని అనుకోవచ్చు. దుర్యోధను డు అలా కావడానికి కారణం ‘అధికార దాహం’... నిజానికి వ్యక్తి జీవితాన్ని నిర్ణయించేది కేవలం జ్ఞానం కాదు, ఆ జ్ఞానాన్ని కార్య రూపంలోకి అనువదించే ప్రవృత్తి. దీనినే యోగవాసిష్ఠం... ‘ప్రవృత్తిరేవ ప్రథమం యథా శాస్త్ర విహారిణామ్, ప్రభేవ వర్ణ భేదా నాం సాధనే సర్వకర్మాణామ్’ అంటుంది.
తెలుపు, నలుపు, ఎరుపు పసుపు మొదలైన అన్ని వర్ణముల అభివ్యక్తికి ఎలాగైతే వెలుగే కారణమవుతుందో అలాగే వ్యక్తి ప్రవృత్తియే వివిధ అధికారుల ఫలసిద్ధికి శాస్త్ర విధులననుసరించి కారణమవుతున్నది. అంతేకాదు, ఎవడెట్లు ప్రయత్నించునో అతడట్టి కర్మనే పొందుతాడు, అంటున్నది యోగ వాసిష్ఠం.
ఇక్కడ ప్రవర్తన ఏదైనా ఫలితమే ముఖ్యమనే అధర్మ సిద్ధాంతాన్ని పట్టుకొని, వివేకం లేని కారణంగా, ధర్మదృష్టిని కోల్పోయి అంధుడైన దుర్యోధనుడు, ధర్మాన్ని పక్కకునెట్టి అధర్మంతో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని తహతహలాడడం కారణం గా, పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యంతో పాటుగా, వంశ నాశనానికి కూడా కారణమయ్యాడు.
రామాయణంలో రావణుడు జ్ఞానవంతు డు. వేదవేదాంగాలు నేర్చినవాడు. గొప్ప తపస్వి. రాజనీతి, యుద్ధనీతి లాంటి శాస్త్రాల లో నైపుణ్యం కలిగినవాడు. మారీచుడు, విభీషణుడు, కుంభకర్ణుడు లాంటివారు ఏది ధర్మసమ్మతమో, ఏది అధర్మమో బోధించా రు. అయినా ఆచరణలో పూర్తిగా విఫలుడయ్యాడు. అహంకారం, కామం అతడిని శాస్త్రం చూపిన మార్గం నుంచి దూరం చేశా యి. సీతాపహరణం అధర్మమని మంత్రులు చెప్పినా పెడచెవిని పెట్టడం వల్ల లంక నాశనమైంది, తన వంశం నాశనమైంది, తానూ వినాశాన్ని పొందాడు.
ధృతరాష్ర్టుని పుత్ర మమకారం, దుర్యోధనుని అధికారదాహం, రావణుని అహంకా రం.. ఈ మూడూ శాస్త్రజ్ఞానాన్ని విస్మరించిన కారణంగా కౌటిల్యుడు చెప్పిన చలితశాస్ర్తుడు ‘రాజ్యమాత్మానం చోపహంతి’ అన్న సూక్తికి నిలువెత్తు దర్పణాలుగా నిలుస్తాయి. జ్ఞాన సాధన ఉత్తమోత్తమమే అయినా ఆ జ్ఞాన మార్గంలో ప్రవర్తించగల ఆత్మనిగ్రహం, ధర్మనిష్ఠ, సంకల్పబలం లేకపోతే, ఆచరణలో పెట్టలేని అసమర్థత వ్యక్తినీ, రాజ్యాన్నీ వినాశమనే అథఃపాతాళానికి చేరుస్తాయని వారి జీవితాలు స్పష్టం చేస్తున్నాయి.






