3 August, 2026 | 4:39 PM

6 కోట్ల ఉద్యోగాలిచ్చాం

21-05-2024 02:38 AM

దేశంలో నిరుద్యోగం లేదు

ప్రతిపక్షాల విమర్శలు అబద్ధం

ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, మే 20: దేశంలో ఉద్యోగాల కల్పనలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ప్రధాని మోదీ దీటుగా సమాధానం ఇచ్చారు. గత ఆరేడేళ్ల వ్యవధిలో ఏకంగా 6 కోట్ల ఉద్యోగాలు సృష్టించామని మోదీ వెల్లడించారు. తమ ప్రభుత్వం ఎన్నో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిందని పేర్కొన్నారు. ‘ఇంత పని చేయాలంటే మానవ వనరులు లేనిదే సాధ్యం కాదు. కేవలం డబ్బులు ఖర్చు పెట్టినంత మాత్రాన రోడ్లు వేయలేం.. కరెంటు, రైల్వే లైన్లు నిర్మించలేం కదా. వాటన్నింటికీ మనుషులు కావాలి.

అంటే వారందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లే కదా.. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని మాత్రం చెప్పగలను’ అని మోదీ వివరించారు. రాచరికపు పార్టీలకు దేశ యువత అవసరాలు అర్థం కావని మోదీ దుయ్యబట్టారు. 2014కు ముందు వందల సంఖ్యలోనే స్టార్టప్స్ ఉండేవని, ఇప్పుడు అవి ఏకంగా 1.25 లక్షల వరకు ఉన్నాయని చెప్పారు. వాటిని దేశంలోని యువతీ యువకులు నెలకొల్పారని పేర్కొన్నారు. ఇక 100కు పైగా యూనికార్న్ కంపెనీలు ఉన్నాయని, వాటి విలువ ఏకంగా రూ.8 లక్షల కోట్లు ఉంటుందని వివరించారు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం దేశంలో నిరుద్యోగిత ఏకంగా సగానికి తగ్గిందని గుర్తు చేశారు.

పురీ ఆలయంలో మోదీ పూజలు

ఒడిశాలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంతకు ముందు ప్రముఖ పురీ జగన్నాథ్ ఆలయంలో ఆయన పూజలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని బీజేడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీజేడీ ప్రభుత్వం హయాంలో జగన్నాథ్ ఆలయ ం సురక్షితంగా లేదని మోదీ విమర్శించారు. ఆలయంలోని రత్న భాండాగారం తాళం చెవులు గత ఆరేళ్లుగా కనిపించట్లేదని గుర్తు చేశారు.