calender_icon.png 9 November, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.55 వేల కోట్ల ప్రజాధనాన్ని కాపాడాం

09-11-2025 12:24:07 AM

  1. నేటి వరకు 954 కబ్జాలు తొలగించాం

రూ.58.40 కోట్లతో చెరువుల పునరుద్ధరణ

నగరవాసుల మద్దతు మాకు స్ఫూర్తినిచ్చింది 

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 8 (విజయక్రాంతి) : హైదరాబాద్ నగర భవిష్యత్తే లక్ష్యంగా పనిచేస్తున్న హైడ్రాకు అండగా నిలిచిన నగర ప్రజలకు కమిషనర్ ఏవీ రంగనాథ్ కృతజ్ఞతలు తెలిపారు. హైడ్రా వేలాది ఇళ్లను కూల్చివేస్తోందంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న దుష్ర్పచారాన్ని ర్యాలీలు,

ప్రదర్శనల ద్వారా తిప్పికొట్టిన పౌరుల మద్దతు తమలో మరింత స్ఫూర్తిని నింపిందని ఆయన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైడ్రా ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు సుమా రు రూ.55 వేల కోట్ల విలువైన 1,045 ఎకరాల ప్రజా ఆస్తులను కబ్జాదారుల నుంచి కాపాడినట్లు వెల్లడించారు.

చట్టాలను గౌరవిస్తూనే ముందుకు..

రాజ్యాంగం, న్యాయస్థానాలు, చట్టాలపై తమకు అపారమైన గౌరవం ఉందని, వాటి స్ఫూర్తితోనే ప్రకృతి పరిరక్షణకు పాటుపడుతున్నామని రంగనాథ్ స్పష్టం చేశారు. పేదవారిని అడ్డం పెట్టుకుని బడాబాబులు సాగిస్తున్న కబ్జాలను వెలికితీస్తున్నాం. ధనదాహంతో ప్రభుత్వ, ప్రజల ఆస్తులను కొల్లగొ డుతున్న వారు హైడ్రాపై దాదాపు 700 కేసులు, వ్యక్తిగతంగా నాపై 31 కంటెంప్ట్ కేసులు వేశారు.

అయినప్పటికీ, చట్టాలకు లోబడే ప్రజల ఆస్తులను పరిరక్షిస్తాం, అని ఆయన అన్నారు. 2024 జూలైకి ముందు నుంచి నివాసం ఉంటున్న వారి ఇళ్ల జోలికి హైడ్రా వెళ్లదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో తొలగించాల్సి వస్తే, వారికి ప్రత్యామ్నాయం, పరిహారం అందేలా ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇచ్చారు.

దశాబ్దాల వరద సమస్యలకు పరిష్కారం

ఈ ఏడాది భారీ వర్షాలు కురిసినా, ముందుజాగ్రత్త చర్యలతో నగరంలో వరదలను చాలా వరకు నియంత్రించగలిగామని కమిషనర్ తెలిపారు. ఒకప్పుడు 5 సెం.మీ వర్షానికే అమీర్‌పేట మైత్రీవనం మునిగిపోయేది. భూగర్భ పైపుల్లో పూడికను తొలగిం చాక, 15 సెం.మీ వర్షం పడినా సమస్య రాలేదు. దీంతో అంబేద్కర్‌నగర్, యూసుఫ్‌గూడ వంటి బస్తీలకు వరద ముప్పు తప్పిం ది. అదేవిధంగా, 70 అడుగుల ప్యాట్నీ నాలాను 15 అడుగులకు కుదించి కట్టిన ఆక్రమణలను తొలగించడంతో పాయిగా కాలనీ, విమాన్‌నగర్ వంటి అనేక ప్రాంతాల దశాబ్దాల సమస్యకు పరిష్కారం లభించింది, అని వివరించారు.

చెరువుల పునరుద్ధరణతో కొత్త శోభ..

నగరంలో రూ.58.40 కోట్ల వ్యయంతో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టామని, ఇప్పటికే బతుకమ్మకుంట ప్రారం భమైందని, ఈ నెలాఖరుకు తమ్మిడికుంట, కూకట్‌పల్లి నల్ల చెరువు, బమ్‌రుక్ ఉద్ దౌలా చెరువులు సిద్ధమవుతాయని తెలిపారు. చెరువుల ఆక్రమణలు తొలగించడం ద్వారా వాటి మొత్తం విస్తీర్ణాన్ని 105 ఎకరాల నుంచి 180 ఎకరాలకు పెంచగలిగామని, అంటే 75 ఎకరాల భూమి తిరిగి ప్రజల సొంతమైందని హర్షం వ్యక్తం చేశారు.

హైడ్రా సాధించిన విజయాలు..

* నిర్వహించిన డ్రైవ్‌లు: 181

* తొలగించిన కబ్జాలు: 954

* కాపాడిన మొత్తం భూమి: 1,045.12 ఎకరాలు

* ప్రభుత్వ భూములు: 531.82 ఎకరాలు

* చెరువుల కబ్జా: 233.00 ఎకరాలు

* రహదారుల కబ్జా: 222.30 ఎకరాలు

* పార్కుల కబ్జా: 35 ఎకరాలు

* కాపాడిన ఆస్తుల విలువ అంచనా: రూ. 50,000 కోట్ల నుంచి రూ. 55,000 కోట్లు

* వర్షాకాలంలో చేపట్టిన పనులు. 96,972 నాళాలు, క్యాపిట్స్ క్లీనింగ్ మొదలైనవి..