22 August, 2026 | 5:15 PM

కార్మిక హక్కుల పరిరక్షణ, ఉద్యమాలకు సిద్ధం కావాలి

22-08-2026 03:36 PM

ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై. ఓమయ్య...

బాన్సువాడ,ఆగస్టు 22 (విజయక్రాంతి): కార్మికుల హక్కులు, చట్టాల పరిరక్షణకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై. ఓమయ్య పిలుపునిచ్చారు. శనివారం బాన్సువాడ పట్టణంలోని నాయిని బ్రాహ్మణ సేవా సంఘంలో ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి దుబాస్ రాములు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా వై. ఓమయ్య హాజరై మాట్లాడారు. 1920 అక్టోబర్ 31న కార్మికుల హక్కులు, చట్టాల కోసం ఏఐటీయూసీ ఆవిర్భవించిందన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి పనిగంటలు, పని భద్రత వంటి హక్కులను సాధించుకున్నామని తెలిపారు.

అనంతరం ప్రభుత్వాలతో పోరాడి పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, కనీస వేతనాలు తదితర అనేక కార్మిక చట్టాలను సాధించుకున్నామని పేర్కొన్నారు.ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం కార్మికులకు అనుకూలంగా ఉన్న చట్టాలను రద్దు చేసి, యజమానులకు అనుకూలంగా లేబర్ కోడ్లను తీసుకొస్తోందని ఓమయ్య విమర్శించారు. కార్మికులు సంఘటితమై తమ హక్కులను కాపాడుకోవాలని సూచించారు.కార్మిక హక్కుల పరిరక్షణ కోసం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 6, 7, 8 తేదీల్లో కరీంనగర్‌లో నిర్వహించనున్న ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. సెప్టెంబర్ 6న జరిగే బహిరంగ సభకు వేలాది మంది కార్మికులు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో కార్మిక సంఘం అధ్యక్షుడు తోట శ్రీనివాస్, నాయకులు చెన్నంగారి సురేష్, ఒల్లెపు గంగాధర్, అబ్రహం, అంజయ్య, ఎస్. రాధ, శ్రీదేవి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.