విషం వ్యాపించకుండా మనం అడ్డుకోవాలి
కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది ఇండియా స్టోరీ: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్’. జీ స్టూడియోస్ సమర్పణలో ఎంఐజీ ప్రొడక్షన్, స్టూడియోస్‌తో కలిసి రూపొందుతున్న ఈ చిత్రానికి చేతన్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. సాగర్ బీ షిండే కథ అందిస్తూ, నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం జూలై 24న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ శుక్రవారం విడుదల చేశారు. రోజువారీ ఆహారంలోకి చేరుతున్న విషపూరిత రసాయనాలు, ముఖ్యంగా యువత ఆరోగ్యంపై చూపుతున్న తీవ్ర ప్రభావాన్ని టీజర్ ఆవిష్కరించింది. ‘హిందుస్థాన్‌లోని ప్రతి ఇంటి కథ ఇది. ఈ విషం వ్యాపించకుండా మనం అడ్డుకోవాలి’ అంటూ టీమ్ సోషల్ మీడియా వేదికగా ఈ టీజర్‌ను పంచుకుంది.
ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. “ది ఇండియా స్టోరీ’ బలమైన సామాజిక సందేశంతో రూపొందిన సినిమా. ఒక తల్లిగా ఈ కథ నాకు చాలా వ్యక్తిగతంగా కనెక్ట్ అయింది. నేటి తల్లిదండ్రులందరిలో ఉన్న ఆందోళనలు, భయాలను ఇది ప్రతిబింబిస్తుంది” అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి నిశాంత్ భగవత్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, మంగేశ్ ధాక్డే సంగీతం సమకూరుస్తున్నారు. ఆశిష్ మాథ్రే ఎడిటర్‌గా, షకీల్ ఆజ్మీ గీత రచయితగా పనిచేస్తున్నారు.






