27 June, 2026 | 2:23 AM

‘గెజిటెడ్’ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

27-06-2026 01:30 AM

‘ప్రమాద బీమా’ ప్రారంభించినందుకు సీఎంకు కృతజ్ఞతలు

డిమాండ్లు నెరవేర్చకుంటే భవిష్యత్ కార్యాచరణ తప్పదు: రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు

కడ్తాల్, జూన్ 26 (విజయక్రాంతి): తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీజీవో) సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగం డిలోని ఎంఆర్జీ గార్డెన్స్లో నిర్వహించారు.

రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రామారావు అధ్యక్షతన జరిగిన ఈ ప్రతిష్టాత్మక సమావేశానికి రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి గెజిటెడ్ అధికారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉద్యోగుల హక్కులు, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సర్వీస్ సమస్యలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.ఈ సందర్భంగా టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివా సులు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గెజిటెడ్ అధికారుల డిమాండ్లను పరిష్కరించకుంటే హక్కుల సాధనకు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ప్రకటించారు.

సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు:

ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయాన్ని అసోసియేషన్ ఏకగ్రీవంగా స్వాగతించింది. ప్రభుత్వ ఉద్యోగుల భద్రత కోసం నూతనంగా ‘ప్రమాద బీమా పథకం‘ ప్రారంభించినందుకు గాను తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి సంఘం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.