23 లక్షల టన్నుల ధాన్యం కొన్నాం
- రైతుల ఖాతాల్లో 3,166.31 కోట్ల జమ
- సివిల్ సప్లయ్ శాఖ కమిషనర్ స్టీపెన్ రవీంద్ర వెల్లడి
హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి): 23 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.3166.31 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 8 లక్షల టన్నుల సన్నరకం, 15 లక్షల టన్నుల దొడ్డురకం ధాన్యాన్ని సేకరించినట్లు శనివారం ఆయన ప్రకటనలో తెలిపారు. అన్ని జిల్లాల్లో మొత్తం 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచినట్లు చెప్పారు.
పీఏసీఎస్ ఆధ్వర్యంలో నడిచే 4,350 కేంద్రాలు, ఐకేపీ ద్వారా 3,563 కేంద్రాలు, ఇతర సహాయక సంస్థల ద్వారా 662 కేంద్రాలు ఉన్నాయన్నారు. ఎలాంటి జాప్యం లేకుండా కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యాన్ని నేరుగా మిల్లులకు పంపుతున్నామన్నారు. 2025- -2026 సంవత్సరానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 10 లక్షల టన్నుల బాయిల్ రైస్ కేటాయించిందని వెల్లడించారు.






