పట్టాలెక్కని బుల్లెట్
నాలుగు ఏండ్లుగా ఊరిస్తున్న బుల్లెట్ రైలు
నేటికీ పట్టాలెక్కని ప్రాజెక్టు
జిల్లాలో అవసరమైన భూమి 124.43 హెక్టార్లు సేకరణ
ఈ ప్రాంత వాసులు కోల్పోనున్న ప్లాట్లు 532
ఐదు మండలాలు, 39 గ్రామాలను కలుపుతూ రైలు మార్గం
వికారాబాద్, మే 15 (విజయక్రాంతి): హైస్పీడ్ రైలుమార్గం నాలుగు ఏండ్లుగా వికారాబాద్ ప్రజలను ఊరిస్తుంది. ఇటీవల ఎన్నికల ప్రచారానికి వికారాబాద్‌కు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన ప్రసంగంలో బుల్లెట్ రైలు ప్రస్తావన తేవడంతో మరోసారి ఆశలు చిగురించాయి. వికారాబా ద్ మీదుగా హైదరాబాద్ ముంబాయి బులెట్ ట్రైన్ లైన్ నిర్మిస్తామని 2020లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు 2021 చివర్లో ప్రజాభిప్రాయ సేకరణ సైతం నిర్వహించి, రైల్వేలైన్ నిర్మాణం కోసం సర్వే కూడా చేపట్టారు. రైల్వే లైన్‌లో భూములు కోల్పోతున్న రైతులతో జిల్లా అధికారులతో కలిసి రైల్వే అధికారులు ప్రజాభిప్రాయాన్ని సేకరించారు.'
ప్రస్తుత మార్కెట్ విలువ చెల్లిస్తే తమ భూములు ఇచ్చేందుకు సిద్ధమని రైతులు పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారం ఇంతటితో ఆగిపోయింది. గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో హైదరాబాద్ బుల్లెట్ రైలు మార్గాన్ని ప్రతిపాదించిన ప్రభుత్వం వికారాబాద్ మీదుగా నిర్మిస్తామన్న బుల్లెట్ రైలుమార్గం ఊసెత్తలేదు. నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు వెళ్లే ఈ మార్గంలో బుల్లెట్ మార్గం గురించి ఇక్కడి ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడంతో నే బుల్లెట్ రైలు ప్రస్తావనను కేంద్రం పక్కన పెట్టిందనే విమర్శలు ఉన్నాయి.
అయితే ఇటీవల లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి వికారా బాద్‌కు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన ప్రసంగంతో బుల్లెట్ రైలు ప్రస్తావన చేయడంతో పాటు, వికారాబాద్‌లో మొదటి రైల్వేస్టేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆయన ప్రకటనతో జిల్లా వాసుల్లో బుల్లెట్ రైలు ఆశలు మల్లి చిగురించాయి. జూన్ 4 తరువాత కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాడితే బుల్లెట్ రైలు తప్పక పట్టాలు ఎక్కుతున్నదని నమ్ముతున్నారు.
వికారాబాద్ బుల్లెట్ రైలే వైజాగ్ పోయిందా?
హైదరాబాద్ ముంబై బుల్లెట్ ట్రైన్ నే హైదరాబాద్ వైజాక్‌కు తరలించారా అనే అనుమానం ఇక్కడి ప్రజల్లో ఉంది. ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో అధికారులు 2016 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తామని చెప్పారు. కొందరు రైతులు తాము ఇచ్చే భూములకు మార్కెట్ రేటుకు మించి చెల్లిస్తే ఇస్తామని చెప్పడం, మరికొందరు ఉన్న భూములు పోతే తామెలా బతకాలని భూమికి బదులుగా భూమి ఇవ్వాలని డిమాండ్ చేయడం, ఉపాధితో పాటు ఉద్యోగాలు ఇవ్వాలని మరికొందరు కోరడం ఈ ప్రాజెక్టుకు నిర్మాణానికి కొంత అవరోదంగా మారిందనే చెప్పవచ్చు.
అయితే 17.5 మీటర్ల వెడల్పుతో రైలుమార్గం నిర్మిస్తామని చెప్పిన అధికారులు, అదనంగా 500 మీటర్ల వెడల్పుతో గ్రీన్ ప్రాజెక్టు పేరుతో అభివృద్ధి చేస్తామన్నారు. ఈ 500 మీటర్ల వెడల్పుతో చేపట్టే గ్రీన్ ప్రాజెక్టు ఎలా కడతారు, దీని కోసం కూడా భూమి సేకరిస్తారా...? అభివృద్ధి అంటే ఎలాంటి ప్రాజెక్టులు చేపడతారు అనే దానిపై స్పష్టత ఇవ్వకపోవడంతో రైతుల్లో మరింత గందరగోళం నెలకొంది.
బుల్లెట్ రైలు వస్తే ఎంతో మేలు
హైదరాబాద్ నుంచి ముంబాయికి రహదారి మీదుగా వెలితే 710 కిలోమీటర్లు. 13.15గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం ఉన్న రైల్‌మార్గం ద్వారా ప్రయాణిస్తే 773 కిలోమీటర్లు, 14గంటల సమయం పడుతుంది. విమాన మార్గంలో హైదరాబాద్ 617 కిలోమీటర్లు ఉండగా, 1.30గంటల సమయం పడుతుంది. వికారాబాద్ మీదుగా నిర్మించాలనుకుంటున్న హైస్పీడ్ రైలుమార్గం ప్రకారం 650 కిలోమీటర్లు వస్తుండగా 3 గంటల సమయయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం రహదారులన్నీ రాకపోకల కారణంగా రద్దీగా మారిన నేపథ్యంలో హైస్పీడ్ రైలుమార్గం ఏర్పాటుకు ప్రాధాన్యత సంతరరించుకుంది.
ఈ కారిడార్ ఏర్పాటుతో ప్రయాణ సమయం బాగా తగ్గడంతో పాటు ఇప్పటికే ఉన్న రహదారులపై ట్రాఫిక్ రద్దీ తగ్గించే అవకాశం ఉంది. వాహనాల సముదాయాన్ని తగ్గించడం ద్వారా వాయుకాలుష్యం తగ్గి గాలిలో నాణ్యత పెరిగేందుకు దోహదం చేస్తోంది. ప్రధానంగా కనెక్టివిటీ పెరగడం ద్వారా తక్కువ అభివృద్ధి చెందిన ప్రాంతాలకు బూస్టింగ్ పెరిగి కొత్త ఉత్పత్తి స్థావరాలు, కారిడార్‌లో టౌన్‌షిప్‌ల అభివృద్ధికి దోహదం చేస్తాయి. ముంబాయి పూణే, హైదరాబాద్, గుల్బర్గా, సోలాపూర్, వికారాబాద్ లాంటి నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గి కనెక్టివిటీ పెరగనుంది. హైస్పీడ్ రైలు గంటకు 330 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది.
వికారాబాద్ మార్గంలో 300 కిలోమీటర్ల వేగంతో వెళ్లనుంది. ఈ రైల్వే కారిడార్ మొత్తం పొడవు (మంబాయి నుంచి హైదరాబాద్ వరకు) 649 నుంచి 659 కిలోమీటర్లు ఉండే అవకాశం ఉంది. మొత్తం 8 జిల్లాల మీదుగా వెలుతుంది. వికారాబాద్ జిల్లాలో 68 కిలోమీటర్లు రైలు మార్గం ఉంటుంది. ముంబాయి నుంచి హైదరాబాద్ వరకు మొత్తం 10 రైల్వేస్టేషన్లు డిజైన్ చేయగా తెలంగాణలో వికారాబాద్, హైదరాబాద్ స్టేషన్లు ఉంటాయి. చివరి స్టేషన్ హైదరాబాద్‌ే సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయాలని భావించారు. జిల్లాలో ఐదు మండలాల పరిధిలో 39 గ్రామాల మీదుగా ఈ రైలు మార్గం ఉంటుంది. 750 మంది ప్రయాణికుల సామార్థ్యంతో ఈ రైలును అభివృద్ధి చేయనున్నారు. ఇన్ని సౌలభ్యాలతో కూడిన బుల్ల్‌ట్ రైలు కళ త్వరగా సాకారం కావాలని జిల్లా వాసులు కోరుతున్నారు.




