ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం
మెదక్ జిల్లాలో 413 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు..
2.17లక్షల ఎకరాల్లో దొడ్డు రకం
52,644 ఎకరాల్లో సన్న రకం
వచ్చే నెల మొదటి వారం నుంచి కొనుగోళ్లు ప్రారంభం..
ఏ గ్రేడ్ కు రూ.2389... సాధారణ రకానికి రూ.2369
మెదక్, మార్చి 29 (విజయక్రాంతి): యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. మెదక్ జిల్లాలో ఏప్రిల్ మొదటి వారం నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే విధంగా పౌరసరఫరాల శాఖ అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. జిల్లాలో యాసంగిలో 2.69 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. వరికోతలకు సమయం అసన్నమవుతున్న క్రమంలో పౌరసరఫరాల శాఖ ధాన్యం కొనుగోలుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు.
మరోవైపు యాసంగిలో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతూ వరి పంటను దక్కించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో రోజు రోజుకు నీటి మట్టాలు తగ్గిపోవడంతో చివరి దశలో వరి పంటను దక్కించుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోయి సాగునీరు అందక దిగుబడిపై రైతులు అందోళన చెందుతున్నారు. మరోవైపు వడగళ్ల వర్షాలు, తెగుళ్లు పంట దిగుబడిపై ప్రభావం చూపుతుందని రైతులు అందోళనలో ఉన్నారు. జిల్లాలో మార్చి నెలాఖరు నుంచి ధాన్యం మార్కెట్కు వస్తుందని అందుకు అనుగుణంగానే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే దిశగా సన్నాహాలు చేస్తున్నారు.
4.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ...
మెదక్ జిల్లాలో యాసంగి సీజనల్లో 2.69 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో 2.17లక్షల ఎకరాల్లో దొడ్డు రకం, 52,644 ఎకరాల్లో సన్న రకం వేశారు. ఈ సారి 4.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఏప్రిల్ మొదటి వారం నుంచి ధాన్యం కొనుగోలు చేయనున్నారు. కొనుగోలు చేసి కాంటా పెట్టిన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించేందుకు లారీల సరఫరాల కోసం టెండర్లు పూర్తి చేశారు.
413 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు..
జిల్లాలో రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని గ్రామాల్లోని రైతులకు అందుబాటులో ఉండే విధంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో 492 గ్రామ పంచాయతీలు ఉండగా 413 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయనున్నారు. ఐకేపీ ద్వారా 154 కేంద్రాలు, పీ ఏ సి ఎస్ ల ద్వారా 224 కేంద్రాలు, డీసీఎంఎస్ ద్వారా 9, ఎఫ్ పీఓ 26 కేంద్రాల ఏర్పాటుకు యాక్షన్ప్లాన్ రూపొం దించారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు ఉపయోగించడానికి కోటి 11లక్షల గన్ని బస్తాలు అవసరం ఉండగా, అందుబాటులో 60 లక్షల గన్నీ బ్యాగులు ఉన్నాయి.
మరో 51 లక్షల గన్ని బస్తాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. టార్ఫాలిన్ 13 వేలు అందుబాటులో ఉండగా, 2,233 అవసరం ఉన్నాయి. మాయిచ్చర్ మీటర్లు 319 అందుబాటులో ఉండగా, మరో 325 అవసరం ఉన్నాయి. ఎలక్ట్రానిక్ తూకాలు 403 అందుబాటులో ఉండగా, 265 అవసరం ఉన్నాయి. ప్యాడీ క్లీనర్ 6 మాత్రమే అందుబాటులో ఉండగా ఇంకా 194 అవసరం ఉన్నాయని అధికారులు తెలిపారు.
ఏ గ్రేడ్ కు రూ.2389...సాధారణ రకానికి రూ.2369..
ధాన్యం గ్రేడ్ వన్కు రూ.2389, సాధారణ రకానికి రూ.2369 ధరను ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రైతులు గ్రామాల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యాన్ని తరలించనున్నారు. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత తొందరగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ అయ్యేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది.
సర్వం సిద్ధం చేస్తున్నాం.. జగదీశ్వర్, జిల్లా మేనేజర్ సివిల్ సప్లయ్
జిల్లాలో ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. గత అనుభవాల ను దృష్టిలో ఉంచుకొని యాసంగి లో ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఏప్రిల్ మొదటి వారంలో ధాన్యం కేంద్రాలకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లను సవ్యంగా పూర్తి చేస్తాం.




