తడిసిన ధాన్యాన్నీ కొనుగోలు చేస్తాం
రైతులు ఆందోళన చెందొద్దు ః మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్, జూన్ 5 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పురోగతిపై తడిసిన ధాన్యం కొనుగోలు అంశాలపై కలెక్టర్ చిత్రా మిశ్రా, సివిల్ సప్లయ్స్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రలతో మంత్రి ఫోన్లో సమీక్ష నిర్వహించారు.
కొనుగోలు కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 317 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు 261 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయని, మిగిలిన కేంద్రాల్లో ఉన్న సుమారు 9,500 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లాలోని 16 మండలాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో 8 మండలాల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన మండలాల్లో కూడా వేగవంతంగా కొనుగోళ్లు పూర్తి చేయాలని సూచించారు.
రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని పేర్కొన్నారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, తడిసిన ధాన్యం విషయంలో కూడా రైతుల ప్రయోజనాలను కాపాడే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.






