6 June, 2026 | 1:45 AM

ధాన్యం తరలింపులో జాప్యం సహించం.. వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్

06-06-2026 12:00 AM

భిక్కనూర్, జూన్ 5 (విజయక్రాంతి): రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం సకాలంలో మిల్లులకు తరలించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. శుక్రవారం భిక్కనూర్ మండలం రామేశ్వర్పల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉంచిన తడిసిన ధాన్యం, తూకం వేసి తరలింపుకు సిద్ధంగా ఉన్న బస్తాలను పరిశీలించారు. కేంద్రంలో సుమారు పది వేల బస్తాలు తరలింపుకు ఎదురుచూస్తుండటాన్ని గమనించిన కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులు పండించిన ధాన్యం ఎక్కువ రోజులు కేంద్రాల్లో నిల్వ ఉండడం వల్ల నాణ్యత దెబ్బతినే అవకాశం ఉందని, దీనివల్ల రైతులు నష్టపోకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

లారీల కొరతను సాకుగా చూపకుండా అవసరమైన వాహనాలను సమకూర్చి ధాన్యాన్ని వేగంగా మిల్లులకు తరలించాలని సూచించారు. తనిఖీ సందర్భంగా అక్కడే రెండు లారీలలో ధాన్యం బస్తాలను మిల్లులకు పంపించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు, తూకం, తరలింపు ప్రక్రియలను సమన్వయంతో నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరును అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అదనపు కలెక్టర్ విక్టర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్చంద్రకాంత్ రెడ్డి, తహసీల్దార్ సునీత, ఎంపీడీవో రాజ్కిరణ్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ భూమిరెడ్డి, సీఈవో శంకర్, రైతులు, అధికారులు పాల్గొన్నారు.